Site icon NTV Telugu

Budget 2026: నిర్మలా సీతారామన్ బడ్జెట్ టీమ్‌లో ఉన్నది ఎవరెవరు..?

Budget Team

Budget Team

Budget 2026: దేశ కేంద్ర బడ్జెట్–2026 కోసం సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నాయకత్వంలో బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ తుది దశకు చేరుకుంటోంది. అనుభవజ్ఞులు, కొత్త ముఖాల కలయికతో కూడిన బడ్జెట్ బృందం ఈ కీలక బాధ్యతను భుజాన వేసుకుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 9వ సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఇది మోడీ 3.0 ప్రభుత్వానికి మూడవ పూర్తి బడ్జెట్ కావడం విశేషం. ఈసారి ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో సెలవు దినంలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

బడ్జెట్ టీమ్‌లో కీలక వ్యక్తులు వీరే..!
* పంకజ్ చౌదరి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి..
పంకజ్ చౌదరి ఈ బడ్జెట్ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక విధానాల అమలులో ఆయన నిర్మలా సీతారామన్‌కు మద్దతుగా నిలుస్తున్నారు.

* వి. అనంత్ నాగేశ్వరన్ (ప్రధాన ఆర్థిక సలహాదారు)
ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత్ నాగేశ్వరన్ బడ్జెట్ రూపకల్పనలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్థిక వృద్ధి అంచనాలు.. రంగాల పనితీరు విశ్లేషణ.. ప్రపంచ ఆర్థిక పరిస్థితుల ప్రభావం.. వంటి అంశాలపై స్థూల ఆర్థిక రూపరేఖను ఆయన విభాగం సిద్ధం చేస్తుంది.

* అనురాధ ఠాకూర్ – ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి
బడ్జెట్ విభాగానికి నాయకత్వం వహిస్తున్న అనురాధ ఠాకూర్‌కు ఇది మొదటి బడ్జెట్… 1994 బ్యాచ్, హిమాచల్ ప్రదేశ్ కేడర్ IAS.. జూలై 1, 2025న బాధ్యతలు స్వీకరణ.. బడ్జెట్ విభాగాన్ని నడిపిస్తున్న మొదటి మహిళా కార్యదర్శి ఆమె.. బడ్జెట్ పత్రాల తయారీ మొత్తం ఆమె పర్యవేక్షణలో జరుగుతుంది.

* అరవింద్ శ్రీవాస్తవ – రెవెన్యూ కార్యదర్శి
పన్ను ప్రతిపాదనలను పర్యవేక్షించే బాధ్యత అరవింద్ శ్రీవాస్తవదే.. ప్రత్యక్ష పన్నులు: ఆదాయపు పన్ను, కార్పొరేట్ పన్ను.. పరోక్ష పన్నులు: జీఎస్టీ, కస్టమ్స్ డ్యూటీ.. రెవెన్యూ కార్యదర్శిగా ఇది ఆయన తొలి బడ్జెట్.

* వి. వుయల్నామ్ – వ్యయ కార్యదర్శి
మణిపూర్ కేడర్‌కు చెందిన 1992 బ్యాచ్ IAS అధికారి వి. వుయల్నామ్.. ప్రభుత్వ వ్యయం.. ఆర్థిక లోటు నియంత్రణ.. సబ్సిడీలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT).. వంటి అంశాలను పర్యవేక్షిస్తారు.

* ఎం. నాగరాజు – ఆర్థిక సేవల కార్యదర్శి
ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, పెన్షన్ వ్యవస్థల ఆర్థిక ఆరోగ్యాన్ని పర్యవేక్షించే బాధ్యత ఎం. నాగరాజుదే. ప్రభుత్వ ఆర్థిక అజెండాను ముందుకు నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు.

* అరుణిష్ చావ్లా – DIPAM కార్యదర్శి
ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ రోడ్‌మ్యాప్ బాధ్యతలు అరుణిష్ చావ్లా వద్ద ఉన్నాయి.

* కె. మోసెస్ చలై – DPE కార్యదర్శి
మణిపూర్ కేడర్, 1990 బ్యాచ్ IAS.. ప్రభుత్వ రంగ సంస్థల విభాగం (DPE) కార్యదర్శిగా ఉన్నారు.. మూలధన వ్యయం (Capex) పథకాల పర్యవేక్షణ చేస్తున్నారు.. మొత్తంగా అనుభవజ్ఞులైన అధికారులు, కొత్త బాధ్యతలు చేపట్టిన కార్యదర్శులతో నిర్మలా సీతారామన్ బడ్జెట్ టీమ్ సిద్ధంగా ఉంది. ఆర్థిక వృద్ధి, పన్ను సంస్కరణలు, కాపెక్స్, సంక్షేమ పథకాలపై ఈ బడ్జెట్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

Exit mobile version