NTV Telugu Site icon

బ్రెజిల్‌తో ఒప్పందం రద్దు.. కారణం అదే..!

Covaxin Deal

Covaxin Deal

భారత్‌ బయోటెక్‌… బ్రెజిల్‌ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం… ఆ దేశంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఒప్పందంలో బ్రెజిల్‌ అధ్యక్షుడు బొల్సనారో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. కోవాగ్జిన్ సరఫరాలో అవినీతి జరిగిందనే కోణంలో పార్లమెంటరీ కమిషన్‌ ఆఫ్‌ ఎంక్వైరీ దృష్టి సారించింది. బ్రెజిల్‌ అధ్యక్షుడు జెయిర్‌ బొల్సొనారో ప్రత్యేక ఆసక్తి కనబర్చారని, సన్నిహితులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ఆరోపణలు వచ్చాయి. అమెరికాకు చెందిన ఫైజర్, చైనాకు చెందిన సినోవాక్‌ను కాదని… బ్రెజిల్‌ ఆరోగ్య నియంత్రణ సంస్థల అనుమతి లేని… కోవాగ్జిన్‌తో ఎందుకు ఒప్పందం చేసుకున్నారని చెప్పాలంటున్నారు సెనేటర్లు. అధ్యక్షుడు బోల్సనారో ఏ ప్రయోజనాలు ఆశించారో చెప్పాలని నిలదీస్తున్నారు.

కాగా, బ్రెజిల్‌ ప్రభుత్వం… వ్యాక్సినేషన్‌ కోసం భారత్‌ బయోటెక్‌ సంస్థతో ఫిబ్రవరిలో 324 మిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. రెండు కోట్ల టీకాలకు ఆర్డర్‌ ఇస్తే.. అవి సకాలంలో డెలివరీ కాకపోవడంతో బొల్సనారో మరింత ఇరకాటంలో పడ్డారు. వాక్సిన్‌ ఒప్పందంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని బ్రెజిల్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. వరుస ఆరోపణలు రావడంతో.. దర్యాప్తులో భాగంగా.. మరింత లోతైన విశ్లేషణ కోసమే డీల్‌ను నిలిపివేసినట్లు తెలిపింది. మరోవైపు తానెలాంటి అవినీతికి పాల్పడలేదని బోల్సనారో ప్రకటించారు. బ్రెజిల్‌తో వ్యాక్సిన్ల కాంట్రాక్ట్‌పై భారత్‌ బయోటెక్‌ సంస్థ స్పందించింది. బ్రెజిల్ నుంచి కోవాగ్జిన్ సరఫరా కోసం… ఎలాంటి అడ్వాన్స్ తీసుకోలేద‌ని స్పష్టం చేసింది. ఆ దేశానికి కోవిడ్ టీకాల‌ను కూడా స‌ర‌ఫ‌రా చేయ‌లేద‌ని భార‌త్ బ‌యోటెక్ వెల్లడించింది. 8 నెల‌ల పాటు సాగిన ఒప్పందంలో అన్ని ష‌ర‌తుల‌ను పాటించిన‌ట్లు తెలిపింది. జూన్ 29 వ‌ర‌కు త‌మ‌కు ఎటువంటి పేమెంట్ అంద‌లేద‌ని సంస్థ ప్రకటించింది. విదేశాలకు స‌ర‌ఫ‌రా చేసే టీకా ధరను… డోసుకు 15 నుంచి 20 డాల‌ర్లుగా నిర్ధారించిన‌ట్లు ఆ సంస్థ వెల్లడించింది. బ్రెజిల్‌కు డోసుకు 15 డాల‌ర్ల చొప్పున అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నామని స్పష్టం చేసింది.