Site icon NTV Telugu

Bank Strike: వరుసగా బ్యాంక్‌ల మూత.. రేపు సమ్మెకు పిలుపు

Bank Strike

Bank Strike

Bank Strike: దేశవ్యాప్తంగా బ్యాంక్ వినియోగదారులకు మరోసారి ఇబ్బందులు తప్పేలా లేవు. వరుస సెలవులతో ఇప్పటికే గత మూడు రోజులుగా బ్యాంకులు పనిచేయని పరిస్థితి ఉండగా.. రేపు అనగా మంగళవారం రోజు మరోసారి బ్యాంక్‌లు మూతపడనున్నాయి. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) పిలుపుతో బ్యాంక్ ఉద్యోగులు ఒకరోజు దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమయ్యారు. ఈ సమ్మెలో AIBEA, AIBOC, NCBE సహా మొత్తం తొమ్మిది బ్యాంక్ యూనియన్లు పాల్గొంటున్నాయి. దాదాపు 8 లక్షల మంది బ్యాంక్ ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. ముఖ్యంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా తదితర బ్యాంకుల సేవలు పూర్తిగా నిలిచే అవకాశం ఉంది. అయితే HDFC, ICICI, Axis వంటి ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువగా ప్రభావితం కావని బ్యాంక్ వర్గాలు తెలిపాయి.

Read Also: Aroori Ramesh : బీజేపీకి బిగ్ షాక్.. పార్టీని వీడిన ఆరూరి రమేష్..

బ్యాంక్ ఉద్యోగుల ప్రధాన డిమాండ్ 5-డే వర్క్ వీక్‌గా ఉంది.. 2024 మార్చిలో కుదిరిన 12వ బైపార్టైట్ సెటిల్‌మెంట్‌లో అన్ని శనివారాలను సెలవులుగా ప్రకటించేందుకు అంగీకారం వచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు దీనిపై నోటిఫికేషన్ విడుదల చేయలేదని యూనియన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 5-డే వర్క్ వీక్ అమలుకు బదులుగా సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజుకు అదనంగా 40 నిమిషాలు పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఉద్యోగులు చెబుతున్నారు. వర్క్–లైఫ్ బ్యాలెన్స్ మెరుగుపడాలన్నది కూడా వారి కీలక డిమాండ్. ఈ సమ్మె కారణంగా నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్ క్లియరెన్స్, బ్రాంచ్ సేవలు పూర్తిగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. అయితే UPI, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ సేవలు సాధారణంగానే కొనసాగుతాయి అని బ్యాంక్ యాజమాన్యం తెలిపింది. వరుస సెలవులు, ఆపై సమ్మె కారణంగా బ్యాంకింగ్ పనులు ఆలస్యం కావొచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. అత్యవసర లావాదేవీలు ఉన్న వినియోగదారులు ముందుగానే డిజిటల్ మార్గాలను ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు.

Exit mobile version