వారానికి 5 రోజులు పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశ వ్యాప్త సమ్మెను బ్యాంకులు ప్రకటించాయి. ఐదు రోజుల పని దినాలకు గతంలో ప్రభుత్వం అంగీకరించిందని.. ఆ హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను కేంద్ర ఆర్థిక శాఖ ఖండించింది. ఎన్నడూ హామీ ఇవ్వలేదని.. యూనియన్లు చేస్తున్న ప్రకటనలను తోసిపుచ్చింది. వేతన పరిష్కార చర్చల సమయంలో ఆ అంశంపై చర్చే జరగలేదని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.
అసలు ఒప్పందమే లేదంటున్న కేంద్రం
బ్యాంకులకు ఐదు రోజుల పని విధానంపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆర్థిక శాఖకు చెందిన ఓ అధికారి తెలిపారు. ఇది చర్చల్లో భాగమైన అంశం కాదని, ఇరుపక్షాల మధ్య దీనిపై ఎలాంటి ఒప్పందం జరగలేదని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు ఈ డిమాండ్‌ను ఏకపక్షంగా ముందుకు తీసుకొచ్చాయని పేర్కొన్నారు.
అయితే బ్యాంకు ఉద్యోగ సంఘాలు మాత్రం ఇందుకు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయి. 2024 మార్చిలో జరిగిన వేతన సవరణ ఒప్పందంలో వారానికి ఐదు రోజుల పని విధానానికి అంగీకారం కుదిరిందని, శనివారాలను సెలవు దినాలుగా ప్రకటించేందుకు నిర్ణయం తీసుకున్నామని సంఘాలు చెబుతున్నాయి.
2024 మార్చిలో ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA), యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య జరిగిన వేతన సవరణ ఒప్పందంలో శనివారాన్ని సెలవు దినంగా ప్రకటించేందుకు అంగీకారం కుదిరిందని ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (AIBOC) ప్రధాన కార్యదర్శి రూపమ్ రాయ్ గతంలో పేర్కొన్నారు. బ్యాంకుల యాజమాన్యానికి ప్రాతినిధ్యం వహించే సంస్థగా IBA పనిచేస్తుంది. ఉద్యోగుల వేతనాలు, సేవా నిబంధనలపై యూనియన్లతో చర్చలు జరుపుతుంది. ఇక UFBU అనేది బ్యాంకింగ్ రంగంలోని తొమ్మిది ప్రధాన ఉద్యోగ, అధికారుల సంఘాలకు ప్రాతినిధ్యం వహించే సమాఖ్య.
ఐదు రోజుల పనివారంతో పాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహక పథకం (PLI) కూడా బ్యాంకు యూనియన్లు, ప్రభుత్వం మధ్య వివాదానికి కారణంగా మారింది. సీనియర్ బ్యాంకు అధికారులకు సంబంధించిన సవరించిన PLI విధానాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిలిపివేసింది. సెప్టెంబర్ 8న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకు ఉద్యోగుల ప్రతినిధులతో సమావేశమైన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఆర్థిక సేవల విభాగం 2024 నవంబర్ 19న సవరించిన PLI పథకాన్ని నోటిఫై చేసింది. ఇది FY26కి వర్తిస్తుంది. స్కేల్ IV, అంతకంటే పైస్థాయి అధికారులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. పనితీరు ఆధారంగా గరిష్ఠంగా 365 రోజుల ప్రాథమిక వేతనానికి సమానమైన ప్రోత్సాహకాన్ని పొందే అవకాశం ఇందులో ఉంది.
మూడు రోజుల సమ్మె
బ్యాంకులకు ఐదు రోజుల పని విధానం తమ ప్రధాన డిమాండ్ అని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి. దీనిపై స్పష్టమైన గడువు ప్రకటించే వరకు తదుపరి ఆందోళనలను విరమించేది లేదని పేర్కొన్నాయి. ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఇండియన్ నేషనల్ బ్యాంక్ ఆఫీసర్స్ కాంగ్రెస్ సహా పలు సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఈ సంఘాలు కలిపి దేశంలోని 90 శాతానికి పైగా బ్యాంకింగ్ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొన్నాయి. సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించాయి.
సమ్మె కారణంగా ఖాతాదారులకు ఇబ్బందులు తగ్గించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. సెప్టెంబర్ 27 ఆదివారం రోజున ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేసేలా చూడాలని ఆదేశించింది. దీంతో సమ్మెకు ముందు రోజు బ్యాంకింగ్ సేవలను అందుబాటులో ఉంచి, వినియోగదారులపై ప్రభావాన్ని కొంత మేర తగ్గించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

