B2B UPI Payment Charges: వ్యాపార లావాదేవీలపై రూ.5 ఛార్జీ?.. NPCI కొత్త ప్రతిపాదన ఇదే!

B2b Upi Payments

B2b Upi Payments

B2B UPI Payment Charges: భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు మరింత ఆదరణ పెరుగుతున్న వేళ UPI వినియోగదారులకు, ముఖ్యంగా వ్యాపారులకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. వ్యాపారాల మధ్య జరిగే UPI చెల్లింపులపై (B2B UPI Payments) ఫ్లాట్‌గా రూ.5 ఛార్జీ విధించే ప్రతిపాదనకు NPCI కమిటీ ఆమోదం తెలిపినట్లు సమాచారం. అయితే ఈ కొత్త ఛార్జీల విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఓ నేషనల్ మీడియా కథనం ప్రకారం.. వ్యాపారుల మధ్య జరిగే UPI లావాదేవీలకు ప్రత్యేక ఛార్జీల విధానాన్ని తీసుకురావాలని ప్రతిపాదించారు. ఇందులో భాగంగా ప్రతి B2B లావాదేవీపై ఫ్లాట్‌గా రూ.5 వసూలు చేసే అవకాశం ఉంది. NPCI UPI అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ సుమారు నెల రోజుల క్రితమే ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన లేదా నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్ల మధ్య జరిగే చెల్లింపులతో పాటు B2B ప్లాట్‌ఫామ్స్, మార్కెట్‌ప్లేస్‌ల ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలకు వర్తించే అవకాశం ఉంది.

NPCI గతంలో సవరించిన MDR (Merchant Discount Rate) విధానాన్ని అక్టోబర్ 15 నుంచి అమలు చేయాలని భావించింది. అయితే ఆ తర్వాత దీపావళి పండుగ ముగిసిన అనంతరం అమలు చేయాలని నిర్ణయాన్ని వాయిదా వేసింది. కొత్త అమలు తేదీని ప్రత్యేకంగా ప్రకటిస్తామని NPCI తెలిపినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన తేదీ వెల్లడించలేదు. B2B చెల్లింపులపై రూ.5 ఛార్జీ ప్రతిపాదనకు కమిటీ ఆమోదం లభించినప్పటికీ, అధికారిక నోటిఫికేషన్, అమలు షెడ్యూల్ కోసం ఎదురుచూడాల్సి ఉంది.

ప్రస్తుతం వ్యాపారాల మధ్య జరిగే UPI లావాదేవీల విలువ సాధారణంగా రూ.20,000 నుంచి రూ.40,000 వరకు ఉంటుందని సంబంధిత వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఈ లావాదేవీలపై 0.4 శాతం MDR విధిస్తే వ్యాపారులు ఎంత చెల్లించాల్సి వస్తుందో చూడండి.

లావాదేవీ విలువ -0.4% ఛార్జీ – ప్రతిపాదిత ఛార్జీ

రూ.5,000 -రూ.20 -రూ.5
రూ.10,000 – రూ.40 -రూ.5
రూ.20,000 – రూ.80 – రూ.5
రూ.30,000 -రూ.120 – రూ.5
రూ.40,000 -రూ.160 -రూ.5
రూ.75,000 -రూ.300 -రూ.5

ఉదాహరణకు.. రూ.20,000 లావాదేవీపై 0.4 శాతం చొప్పున రూ.80 ఛార్జీ అవుతుంది. అదే రూ.5 ఫ్లాట్ ఛార్జీ విధిస్తే వ్యాపారికి రూ.75 ఆదా అవుతుంది. అలాగే రూ.40,000 లావాదేవీపై రూ.160కు బదులుగా కేవలం రూ.5 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ 0.4 శాతం లెక్కలు కేవలం ఉదాహరణ కోసం మాత్రమే. సెప్టెంబర్‌లో ప్రకటించిన MDR విధానంలో అర్హత కలిగిన వ్యక్తి నుంచి వ్యాపారికి జరిగే (P2M) రూ.2,000కు పైబడిన లావాదేవీలకు ఈ రేటును పేర్కొన్నారు. వ్యాపారి నుంచి వ్యాపారికి జరిగే (M2M) లావాదేవీలకు ప్రత్యేక ఛార్జీని ఆ విధానం స్పష్టంగా నిర్దేశించలేదు.

డిజిటల్ చెల్లింపులపై అదనపు భారం పడుతుందనే ఆందోళనలను వ్యాపార సంఘాలు గతంలో వ్యక్తం చేశాయి. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ (AICPDF) ఈ విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాసింది. వ్యాపారుల మధ్య జరిగే చెల్లింపులను MDR విధానం నుంచి మినహాయించాలని ఆ సంఘం కోరింది. ముఖ్యంగా డిస్ట్రిబ్యూటర్లు, రిటైలర్లపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని పేర్కొంది. MDR ఛార్జీలపై GST ప్రభావం కూడా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది.

MDR అంటే Merchant Discount Rate. డిజిటల్ చెల్లింపులను ప్రాసెస్ చేసినందుకు వ్యాపారుల నుంచి వసూలు చేసే రుసుమునే MDR అంటారు. ఈ మొత్తాన్ని నిబంధనలను బట్టి బ్యాంకులు, చెల్లింపుల సేవల సంస్థలు సహా డిజిటల్ పేమెంట్ వ్యవస్థలోని వివిధ భాగస్వాములు పంచుకుంటారు. NPCI సెప్టెంబర్‌లో ప్రకటించిన సవరించిన MDR విధానంలో అర్హత కలిగిన రూ.2,000కు పైబడిన P2M UPI లావాదేవీలకు 0.4 శాతం ఛార్జీని ప్రతిపాదించింది. రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలకు గరిష్ఠంగా రూ.300 పరిమితిని కూడా పేర్కొంది. కొన్ని వ్యాపార వర్గాలకు వేర్వేరు రేట్లు నిర్ణయించింది. అయితే M2M లావాదేవీలకు ప్రత్యేక రేటు లేకపోవడంతో ఇప్పుడు ఫ్లాట్‌గా రూ.5 ఛార్జీ విధించే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.