Site icon NTV Telugu

Amazon Layoffs: ఉద్యోగాల కోతలపై అమెజాన్ షాకింగ్ ప్రకటన.. నష్టాలు, ఏఐ కాదు.. కొత్త కారణం చెప్పిన సీఈఓ!

Amazon

Amazon

Amazon layoffs 2026: అమెజాన్‌లో ఉద్యోగాల కోతల అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 30 వేల ఉద్యోగాలను తొలగించేలా కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే సగం మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. మిగతా వాళ్లను సైతం తీసేయడానికి ప్లాన్ చేస్తోంది. అయితే.. కంపెనీ ఉద్యోగులను తొలగించడానికి లాభాలు తగ్గడం, ఏఐ కారణం కాదట. ఈ సారి అమెజాన్ చెప్పిన కొత్త కారణంపై చర్చ జరుగుతోంది. రాయిటర్స్ కథనం ప్రకారం.. 2025 అక్టోబర్‌లో అమెజాన్ మొదటి విడతగా సుమారు 14 వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మరో విడతకు సిద్ధమవుతోంది. ఈ రెండో విడతలోనూ దాదాపు అదే స్థాయిలో కోతలు ఉండే అవకాశం ఉంది. మొత్తం కలిపితే దాదాపు 30 వేల ఉద్యోగాలు తగ్గనున్నాయి. ఇవి అమెజాన్ చరిత్రలోనే అతిపెద్ద ఉద్యోగ కోతలుగా నివేదిక చెబుతోంది.

READ MORE: Stock Market: రుచించని భారత్-ఈయూ డీల్.. భారీ నష్టాల్లో సూచీలు

ఈ కోతలు ఎక్కువగా అమెజాన్ వెబ్ సర్వీసెస్, రిటైల్ విభాగం, ప్రైమ్ వీడియో, అలాగే ‘పీపుల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ’ అని పిలిచే హెచ్‌ఆర్ విభాగాన్ని ప్రభావితం చేయనున్నాయి. కాగితాల మీద చూస్తే 30 వేల ఉద్యోగాలు అంటే అమెజాన్‌లో పనిచేసే మొత్తం 15 లక్షల మందిలో 2 శాతం కాదు. ఈ కోతలు కార్పొరేట్ ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం. అంటే నిర్ణయాలు తీసుకునే కేంద్ర స్థాయిలో పెద్ద మార్పు జరుగుతోంది. ఇప్పటివరకు ఉద్యోగాలను తొలగించిన కంపెనీలు మార్కెట్ బాగోలేదు, ఖర్చులు తగ్గించాలి, లేదా ఆటోమేషన్ వచ్చేసింది అని చెప్పాయి. కానీ అమెజాన్ సీఈఓ ఆండీ జాస్సీ మాత్రం కొత్త విషయాలు వెల్లడించారు. ఈ తొలగింపులకు నష్టాలు, ఏఐ కారణాలు కాదని స్పష్టం చేశారు. అసలు కారణం “కల్చర్” అని బాంబు పేల్చారు. కల్చర్ అంటే బయట వినడానికి మామూలు మాటే. కానీ కంపెనీల్లో ఈ పదానికి లోతైన అర్థం ఉంటుంది. కాలక్రమేణా ఉద్యోగులు పెరుగుతారు, టీమ్‌లు పెరుగుతాయి, ప్రతి టీమ్‌కి మేనేజర్లు, ఆ మేనేజర్లకు మరో మేనేజర్లు వస్తారు. అలా ఒక నిర్ణయం తీసుకోవాలంటే చాలా మందిని అడగాల్సి వస్తుంది. ఒక పని ముందుకు వెళ్లాలంటే అనుమతులు, సమీక్షలు, చర్చలు ఎక్కువవుతాయి. ఇదే లేయర్లు అన్నీ కలిసిపోయాక కంపెనీ నెమ్మదిగా ముందకెళ్తోంది. పనులు ఆలస్యం అవుతాయి. బాధ్యత ఎవరిది అన్నది స్పష్టంగా ఉండదు. అమెజాన్‌లో ప్రస్తుతం ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని జాస్సీ భావిస్తున్నట్లు ఆయన మాటల ద్వారా తెలుస్తోంది. అందుకే ఈ ఉద్యోగ కోతలను ఆర్థిక సమస్యగా కాకుండా సంస్థ నిర్మాణాన్ని సరిచేసే చర్యగా చూపుతున్నారు.

READ MORE: CM Chandrababu: నేడు సీఎం చంద్రబాబు బిజీ.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

అయితే.. ఈ కోతల్లో ఏఐ పాత్ర లేదని పూర్తిగా చెప్పలేం. గతంలోనే ఏఐ వల్ల కంపెనీ పనులు మరింత వేగంగా జరుగుతాయని, అందువల్ల భవిష్యత్తులో కార్పొరేట్ ఉద్యోగాలు తగ్గుతాయని జాస్సీ చెప్పారు. ఈసారి ప్రత్యక్ష కారణం ఏఐ కాకపోయినా అది అమెజాన్ సామర్థ్య వ్యూహంలో ఒక భాగమే అని నిపుణులు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఈ కోతలు గోదాముల్లో పనిచేసే వారిపై లేదా డెలివరీ సిబ్బందిపై పడలేదు. మేయిన్ సిబ్బందిపైనే పడిందని చెబుతున్నారు. అక్టోబర్‌లో తొలగించిన ఉద్యోగులకు 90 రోజులు జీతం ఇస్తామని, ఆ సమయంలో కంపెనీలోనే మరో ఉద్యోగం చూసుకోవచ్చు లేదా బయట అవకాశాలు వెతుక్కోవచ్చని చెప్పారు. ఆ గడువు ఈ సోమవారంతో ముగియనుంది. ఇప్పుడు రెండో విడత వస్తే, మరెంతమందికి ఇదే పరిస్థితి ఎదురవుతుందో చూడాలి.

Exit mobile version