ప్రస్తుతం విమాన ప్రయాణం చేసే సామాన్యులకు సీటు ఎంపిక (Seat Selection) అనేది ఒక పెద్ద ఆర్థిక భారంగా మారింది. టికెట్ ధర కంటే సీటు కోసం అదనంగా చెల్లించాల్సి రావడంపై ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో, విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) , కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నాయి. ఏప్రిల్ 20, 2026 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల ప్రకారం, విమాన ప్రయాణం మరింత పారదర్శకంగా, చౌకగా మారనుంది.
60 శాతం సీట్లు ఇక ఉచితం..
ప్రస్తుతం విమాన సంస్థలు కేవలం 20 శాతం సీట్లను మాత్రమే ఉచితంగా కేటాయిస్తున్నాయి. మిగిలిన 80 శాతం సీట్లను ‘ప్రిఫర్డ్ సీట్స్’ పేరుతో విండో, ఐల్ లేదా ముందు వరుస సీట్ల కోసం రూ. 200 నుంచి రూ. 2,100 వరకు వసూలు చేస్తున్నాయి. అయితే.. తాజా ఉత్తర్వుల ప్రకారం, ప్రతి విమానంలో కనీసం 60 శాతం సీట్లను ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా ప్రయాణికులు ఎంచుకునేలా అందుబాటులో ఉంచాలి.
కుటుంబ సభ్యులకు పక్కపక్కనే సీట్లు..
చాలా కాలంగా ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య.. ఒకే టికెట్ (PNR)పై బుక్ చేసుకున్నా కుటుంబ సభ్యులకు విడివిడి సీట్లు కేటాయించడం. దీనివల్ల చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకపై ఒకే పీఎన్ఆర్ నంబర్‌తో ప్రయాణించే వారికి సాధ్యమైనంత వరకు పక్కపక్కనే లేదా ఒకే వరుసలో సీట్లు కేటాయించాలని డీజీసీఏ స్పష్టం చేసింది. ముఖ్యంగా 12 ఏళ్ల లోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల పక్కనే సీటు కచ్చితంగా ఇవ్వాలని ఆదేశించింది.
Also Read:MI Vs KKR: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్.. తుది జట్లు ఇవే..
పారదర్శకతకు పెద్దపీట..
విమాన సంస్థలు తమ వెబ్‌సైట్లు , మొబైల్ యాప్‌లలో ఏ సీట్లు ఉచితంగా ఉన్నాయి, వేటికి ఛార్జీలు వర్తిస్తాయి అనే విషయాన్ని స్పష్టంగా, పారదర్శకంగా ప్రదర్శించాలి. కేవలం సీట్లే కాకుండా, క్రీడా పరికరాలు (Sports Kits), సంగీత వాయిద్యాలు వంటి అదనపు వస్తువుల రవాణాకు సంబంధించిన ఛార్జీలను కూడా ముందే వెల్లడించాలి. ఒకవేళ ప్రయాణంలో ఈ వస్తువులు దెబ్బతింటే విమాన సంస్థ బాధ్యత ఏమిటో కూడా నిబంధనల్లో స్పష్టంగా ఉండాలి. ప్రయాణికుల హక్కులను ప్రాంతీయ భాషల్లో కూడా అందుబాటులో ఉంచాలని డీజీసీఏ సూచించింది.
విమాన సంస్థల అభ్యంతరం..
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంపై ఇండిగో, ఎయిర్ ఇండియా, స్పైస్‌జెట్ వంటి ప్రధాన సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సీట్ల ద్వారా వచ్చే అదనపు ఆదాయం తగ్గడం వల్ల, ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి విమాన టికెట్ల మూల ధరలను పెంచాల్సి వస్తుందని అవి వాదిస్తున్నాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ (FIA) ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాసింది.
ప్రస్తుతం దేశంలో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికులు విమాన సర్వీసులను వినియోగించుకుంటున్నారు. విమానయాన రంగంలో వస్తున్న ఈ విప్లవాత్మక మార్పులు సామాన్యుడి ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
