Air India Fuel Surcharge Hike: విమాన ఇంధన ధరల్లో కొనసాగుతున్న హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ఫ్యూయల్ సర్‌ఛార్జీలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇవి ఇవాళ్టి నుంచి అంటే అక్టోబర్ 9 నుంచి దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై సవరించిన ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దీంతో విమాన టికెట్ బేస్ ధరలో మార్పు లేకపోయినా, ప్రయాణికులు చెల్లించాల్సిన మొత్తం పెరిగే అవకాశం ఉంది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) కీలక పాత్ర పోషిస్తుంది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో ఒత్తిడి, భౌగోళిక రాజకీయ పరిణామాల కారణంగా విమాన ఇంధన ధరల్లో అస్థిరత కొనసాగుతోంది. ఇంధన ఖర్చులు పెరగడంతో విమానాలను నడిపే వ్యయం కూడా అధికమవుతోందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఈ అదనపు భారాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఫ్యూయల్ సర్‌ఛార్జీలను సవరించినట్లు పేర్కొంది.
దేశీయ విమాన టికెట్లపై ఎంత పెరగనుంది?
ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ దేశీయ విమాన ప్రయాణాలపై దూరాన్ని బట్టి ఫ్యూయల్ సర్‌ఛార్జీ విధించనున్నాయి. ప్రయాణ దూరాన్ని బట్టి ఈ ఛార్జీ రూ.400 నుంచి రూ.1,200 వరకు ఉండనుంది. తక్కువ దూరం ప్రయాణించే వారికి తక్కువ ఛార్జీ, ఎక్కువ దూరం ప్రయాణించే వారికి అధిక ఛార్జీ వర్తించే విధంగా స్లాబ్‌లు ఉంటాయి. అంతర్జాతీయ విమాన ప్రయాణాల విషయంలో గమ్యస్థానాన్ని బట్టి ఫ్యూయల్ సర్‌ఛార్జీ మారుతుంది. ఆయా ప్రాంతాలు, దేశాలను బట్టి ఈ ఛార్జీ 55 అమెరికన్ డాలర్ల నుంచి 215 డాలర్ల వరకు ఉండనుంది. అక్టోబర్ 9 నుంచి అమల్లోకి వచ్చిన ఈ మార్పుల వల్ల కొత్తగా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులపై అదనపు భారం పడనుంది.
ఫ్యూయల్ సర్‌ఛార్జీ పెంచిన ఆకాశ ఎయిర్
ఎయిర్ ఇండియాతో పాటు ఆకాశ ఎయిర్ కూడా ఫ్యూయల్ సర్‌ఛార్జీలను సవరించింది. అక్టోబర్ 9 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. దేశీయ విమాన ప్రయాణాలపై మళ్లీ ఫ్యూయల్ సర్‌ఛార్జీని విధించడంతో పాటు, అంతర్జాతీయ విమానాలపై ఇప్పటికే ఉన్న ఛార్జీని పెంచింది. ఆకాశ ఎయిర్ తాజా నిర్ణయం ప్రకారం, దేశీయ విమానాల్లో ప్రయాణ దూరాన్ని బట్టి ఫ్యూయల్ సర్‌ఛార్జీ రూ.375 నుంచి రూ.1,150 వరకు ఉండనుంది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై సర్‌ఛార్జీ రూ.2,500గా నిర్ణయించింది. ఈ ఏడాది మార్చిలో దేశీయ, అంతర్జాతీయ విమానాలకు ఫ్యూయల్ సర్‌ఛార్జీని ప్రవేశపెట్టిన ఆకాశ ఎయిర్, ఆ తర్వాత దేశీయ విమానాలపై ఆ ఛార్జీని తొలగించింది. ఇప్పుడు మళ్లీ దేశీయ సేవలకు ఈ ఛార్జీని పునరుద్ధరించింది. విమాన ఇంధన ధరల పెరుగుదల నిర్వహణ ఖర్చులపై నిరంతర ఒత్తిడిని కలిగిస్తోందని ఆకాశ ఎయిర్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో పెరుగుతున్న ఖర్చుల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించుకునేందుకు తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
విమాన ఇంధన ధరలు పెరగడానికి కారణమేంటి?
విమానాలను నడిపేందుకు ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF) ఖర్చు విమానయాన సంస్థల మొత్తం నిర్వహణ వ్యయంలో సుమారు 40 శాతం వరకు ఉంటుందని అంచనా. అందువల్ల ఇంధన ధరలు పెరిగినప్పుడు విమానయాన సంస్థలపై గణనీయమైన ఆర్థిక భారం పడుతుంది. ఇక, ఇంధన ధరలు ఎక్కువ కాలం అధిక స్థాయిలో కొనసాగితే, ఆ ప్రభావాన్ని తగ్గించుకునేందుకు విమానయాన సంస్థలు టికెట్ ధరలను సవరించడం లేదా ఫ్యూయల్ సర్‌ఛార్జీలను విధించడం వంటి చర్యలు తీసుకుంటాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ తాజా నిర్ణయాలు కూడా ఈ పరిస్థితుల్లోనే వచ్చాయి. దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ అయిన ఇండిగో కూడా అంతకుముందే ఫ్యూయల్ సర్‌ఛార్జీని పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో ఇంధన ధరల ప్రభావం ఒక్క సంస్థకే పరిమితం కాకుండా విమానయాన రంగం మొత్తంపై పడుతున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రయాణికులపై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
ఫ్యూయల్ సర్‌ఛార్జీ పెంపుతో విమాన టికెట్‌కు చెల్లించాల్సిన మొత్తం పెరుగుతుంది. అయితే ఈ పెంపు అందరికీ ఒకే విధంగా ఉండదు. దేశీయ విమానాల్లో ప్రయాణ దూరం ఆధారంగా ఛార్జీలు మారుతాయి. అంతర్జాతీయ విమానాల్లో గమ్యస్థానం లేదా ప్రాంతాన్ని బట్టి అదనపు మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. టికెట్ బేస్ ఫేర్‌లో మార్పు లేకపోయినా, ఫ్యూయల్ సర్‌ఛార్జీ పెరగడం వల్ల చివరగా చెల్లించే మొత్తం పెరగనుంది.. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే దేశీయ ప్రయాణికులు, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణించే వారు టికెట్ బుక్ చేసుకునే ముందు ఛార్జీలను జాగ్రత్తగా పరిశీలించాలి.
టికెట్ బుక్ చేసుకునే ముందు ఏం చూడాలి?
ఇవాళ్టి నుంచి ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకునే వారు టికెట్ ధర వివరాలను పూర్తిగా తనిఖీ చేయాలి. బేస్ ఫేర్‌తో పాటు ఫ్యూయల్ సర్‌ఛార్జీ, ఇతర వర్తించే ఛార్జీలను కూడా గమనించాలి. వివిధ విమానయాన సంస్థల టికెట్ ధరలను పోల్చేటప్పుడు కేవలం ప్రారంభ ధరను మాత్రమే చూడకుండా, అన్ని ఛార్జీలు కలిపిన తుది ధరను పరిశీలించడం మంచిది. అప్పుడే ఏ విమానయాన సంస్థలో ప్రయాణించడం తక్కువ ఖర్చుతో కూడుకున్నదో నిర్ణయించుకోవచ్చు.

