Site icon NTV Telugu

Credit Cards: అప్పుల్లో చిక్కుకుంటున్న మధ్య తరగతి ప్రజలు.. 93 శాతం మంది క్రెడిట్ కార్డుల వినియోగం

Credit Cards

Credit Cards

Credit Cards: భారతదేశంలో ఖర్చులను తట్టుకునేందుకు క్రెడిట్‌ కార్డులపై ఆధారపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరిగిపోతుంది. నెలకు రూ.50 వేల కంటే తక్కువ జీతం సంపాదిస్తున్న వారిలో దాదాపు 93 శాతం మంది తమ అవసరాలను తీర్చుకోవడానికి ఈ క్రెడిట్‌ కార్డులనే వినియోగిస్తున్నారని థింక్‌ 360 ఏఐ ఒక నివేదికను విడుదల చేసింది. అయితే, దేశంలో 20 వేల మందికి పైగా వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తుల ఆర్థిక ప్రవర్తనను 12 నెలల పాటు పరిశీలించి రిలీజ్ చేసిన రిపోర్టుతో ఈ ఆందోళనకర విషయం బహిర్గతం అయింది.

Read Also: Sleeping Prince: 20 ఏళ్లుగా కోమాలోనే.. సౌదీ ‘స్లీపింగ్ ప్రిన్స్’ అల్వలీద్ బిన్ ఖలీద్ మృతి

అయితే, స్వయం ఉపాధి పొందుతున్న వారిలో సుమారు 85 శాతం మంది క్రెడిట్‌ కార్డులనే ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ‘ఇప్పుడు కొనండి, తర్వాత చెల్లించండి’ సేవలను సద్వినియోగం చేసుకుంటున్న వారి సంఖ్య గణనీయంగానే పెరిగింది. స్వయం ఉపాధి పొందుతున్న వారిలో 20 శాతం, ఉద్యోగుల్లో 15 శాతం మంది వీటిని వాడుకుంటున్నారు. ఇక, దేశంలో క్రెడిట్‌ కార్డులు, బీఎన్‌పీఎల్‌ ఇప్పుడు తమ జీవితంలో ఒక సాధనంగా మారిందని థింక్‌360.ఏఐ వ్యవస్థాపకుడు, సీఈఓ అమిత్‌ దాస్‌ వెల్లడించారు. ఉద్యోగులు, వృత్తి నిపుణులతో పాటు గిగ్‌ వర్కర్లు ఆర్థిక తమ అవసరాల కోసం ఈ క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారని చెప్పుకొచ్చారు. అలాగే, ఫిన్‌టెక్‌లు సైతం డిజిటల్‌ రుణాల విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాయి. 2023లో ఫిన్‌టెక్‌లు రూ. 92 వేల కోట్లకు పైగా వ్యక్తిగత రుణాలను రిలీజ్ చేశాయి. కొత్త రుణాల్లో ఇవి 76 శాతానికి సమానం అని చెప్పాలి.. తక్కువ ఆదాయం ఉన్న వారే.. స్వల్ప కాలిక, డిజిటల్‌ రుణాల వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని ఈ నివేదికలో వెల్లడించారు.

Exit mobile version