దేశంలో ఆర్థిక అసమానతలను తొలగించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. పేద వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆర్థిక సాయం అందించే పథకాలను తీసుకొస్తున్నాయి. ఈ పథకాలతో సాయం అందిస్తూ అండగా నిలుస్తున్నాయి. కాగా కేంద్రం అందించే స్కీముల్లో పేదలకు వరం లాంటి స్కీమ్ ఒకటి ఉంది. అదే పీఎం ముద్ర యోజన స్కీమ్. ఈ పథకం ద్వారా ఏకంగా రూ. 20 లక్షల వరకు లోన్ పొందే ఛాన్స్ ఉంటుంది. వ్యాపారం చేయాలనుకునే వారికి ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవాలనుకునే వారికి ఈ స్కీమ్ కింద లోన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది.
సూక్ష్మ, చిన్నతరహా సంస్థల కోసం లోన్స్ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ ముద్ర యోజన స్కీమ్ ను తీసుకొచ్చింది. స్వయం ఉపాధిని పొందాలనుకునే వారిని ప్రోత్సహించేందుకు ఈ పథకం ద్వారా లోన్స్ ను అందిస్తోంది. నిరుద్యోగులు, మహిళలు, పేద ప్రజలు ఈ స్కీమ్ ద్వారా లోన్స్ పొంది వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు. కాగా ఈ పథకంలో శిశు లోన్ కింద రూ. 50 వేల వరకు లోన్ వస్తుంది. కిషోర్ లోన్ కింద రూ. 50 వేల నుంచి రూ. 5 లక్షల వరకు రుణం వస్తుంది. తరుణ్ లోన్ కింద రూ. 5-10 లక్షల వరకు లోన్ అందిస్తారు. ఇప్పుడు తరుణ్ ప్లస్ కేటగిరీ తీసుకొచ్చి దీని కింద రూ. 20 లక్షల వరకు లోన్ ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం.
అయితే రూ. 20 లక్షల లోన్ పొందాలంటే ముందుగా తరుణ్ కేటగిరి కింద లోన్ తీసుకుని తిరిగి సకాలంలో చెల్లిస్తే అప్పుడు తరుణ్ ప్లస్ కింద లోన్ పొందొచ్చు. ముద్ర యోజన స్కీమ్ ద్వారా ఎలాంటి గ్యారంటీ లేకుండానే లోన్ పొందొచ్చు. తక్కువ వడ్డీకే లోన్లు పొందొచ్చు. లోన్ ను ఈఎంఐల్లో చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు వ్యవధి 12 నెలల నుంచి ఐదేళ్ల వరకు ఉంటుంది. ముద్ర యోజన స్కీమ్ ద్వారా లోన్ పొందాలనుకునే వారు https://udyamimitra.in/ వెబ్ సైట్ కి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకుని, అవసరమైన సమాచారాన్ని నమోదు చేసి అప్లై చేసుకోవచ్చు.