Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్‌లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..

Upcoming Ipos

Upcoming Ipos

Upcoming IPOs : దేశీయ స్టాక్ మార్కెట్‌లో వచ్చే వారం సరికొత్త రికార్డులకు తెరలేవనుంది. ప్రైమరీ మార్కెట్ వేదికగా ఏకంగా 19 కంపెనీలు పబ్లిక్ ఇష్యూలకు రెడీ అవుతున్నాయి. వీటి ద్వారా మొత్తం సుమారు రూ.4,169 కోట్ల నిధులను సమీకరించాలని కంపెనీలు ప్రణాళికలు రచించాయి. ఇందులో 6 ప్రధాన మెయిన్‌బోర్డ్ కంపెనీలు కాగా, మిగిలిన 13 ఎస్‌ఎమ్‌ఈ (SME) విభాగం నుంచి రాబోతున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి 28 మధ్య ఈ ఐపీఓలు సబ్‌స్క్రిప్షన్ కోసం అందుబాటులో ఉంటాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

మెయిన్‌బోర్డ్ ఐపీఓల ద్వారా రూ.3,825 కోట్లు

వచ్చే వారం రాబోయే నిధుల్లో సింహభాగం మెయిన్‌బోర్డ్ ఐపీఓలకే సమకూరనుంది. మొత్తం రూ.3,825 కోట్లను ఈ ఆరు సంస్థలు సేకరించనున్నాయి.

ఎలివేట్ క్యాంపసెస్: హిల్‌హౌస్ ఇన్వెస్ట్‌మెంట్స్ సపోర్ట్ వస్తున్న ఈ కంపెనీ వచ్చే వారంలో అతిపెద్ద ఇష్యూగా నిలవనుంది. సెప్టెంబర్ 23న ప్రారంభమై 25న ముగిసే ఈ ఆఫరింగ్ ద్వారా రూ.2,100 కోట్లను సమీకరించనున్నారు. ప్రైస్ బ్యాండ్ రూ.343- రూ.362గా నిర్ణయించారు. ఇది పూర్తిగా ఫ్రెష్ ఇష్యూ రూపంలోనే వస్తోంది. సెప్టెంబర్ 30న షేర్లు లిస్ట్ కానున్నాయి.

వర్మోరా గ్రానిటో: సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు రూ.708 కోట్ల ఐపీఓ అందుబాటులో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ రూ.140-రూ.148. ఇందులో రూ.320 కోట్ల ఫ్రెష్ షేర్లు, కట్సురా ఇన్వెస్ట్‌మెంట్స్‌కు చెందిన రూ.388 కోట్ల విలువైన ఓఎఫ్ఎస్ (OFS) ఉన్నాయి.

ఏ-వన్ స్టీల్స్ ఇండియా: ఇంటిగ్రేటెడ్ స్టీల్ తయారీ సంస్థ అయిన ఈ కంపెనీ రూ.405 కోట్ల లక్ష్యంతో సెప్టెంబర్ 24న ఐపీఓను ప్రారంభించనుంది. ఒక్కో షేరు ధర శ్రేణి రూ.385 – రూ.405గా నిర్ణయించారు.

ఆర్మీ ఇన్ఫోటెక్: సెప్టెంబర్ 23-25 మధ్య రూ.300 కోట్ల నిధుల సమీకరణకు రానుంది. ధర రూ.350- రూ375 ఉంటుందని అంచనా.

స్వస్తిక ఇన్‌ఫ్రా & అడ్రాయిట్ ఇండస్ట్రీస్: ఇన్‌ఫ్రా ఈపీసీ సొల్యూషన్స్ సంస్థ స్వస్తిక ఇన్‌ఫ్రా రూ.161 కోట్లతో (ధర రూ.175- రూ.185), అడ్రాయిట్ ఇండస్ట్రీస్ రూ.151 కోట్లతో (ధర 126- రూ.134) సెప్టెంబర్ 23న రంగంలోకి దిగుతున్నాయి.

13 SME ఐపీఓల సందడి
మరోవైపు చిన్న తరహా పరిశ్రమల (SME) విభాగంలో కూడా భారీ రద్దీ నెలకొంది. సెప్టెంబర్ 21న వివేకానంద్ కాట్‌స్పిన్, ఎఫ్‌ఎక్స్ మల్టీటెక్, రోబోకిడ్జ్ ఎడ్యువెంచర్స్ ఐపీఓలు స్టార్ట్ కానున్నాయి. 22న హిమాలయ న్యూట్రావెడిక్స్, ఆనంద్ సీమ్‌లెస్ వస్తుండగా.. 23న కోర్‌ఇంటెగ్రా కన్సల్టింగ్, సాయి ఊర్జా ఇండో వెంచర్స్, పూజా లాజిస్టిక్స్, లిక్విడ్ డిజిటల్ ఇండియా, ఎస్‌కే ఆఫ్‌సెట్, యునైటెక్ ఫైబర్స్ బిడ్డింగ్‌కు రానున్నాయి. పేశ్వా వీట్ (సెప్టెంబర్ 24), బెంచ్‌మార్క్ ఇన్ఫోటెక్ (సెప్టెంబర్ 25)ల ద్వారా ఈ జాబితా మరింత విస్తరించనుంది.

ఎన్‌ఎస్‌ఈ సహా 12 లిస్టింగ్‌లు.. జీఎంపీపై దృష్టి
కొత్త ఐపీఓల రాకతో పాటు వచ్చే వారం మార్కెట్‌లో 12 లిస్టింగ్‌లు జరగనున్నాయి. దేశంలోనే అతిపెద్ద ఎక్స్ఛేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) లిస్టింగ్ అత్యంత కీలకంగా మారినప్పటికీ, గ్రే మార్కెట్ ప్రీమియం (GMP) దాదాపు 3 శాతానికి పడిపోవడం మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇతర లిస్టింగ్‌లలో స్పెక్ట్రాఏ టెక్నాలజీస్ జీఎంపీ దాదాపు 38 శాతం, ఎస్ఎస్ రిటైల్ 34 శాతంతో బలంగా ట్రేడ్ అవుతుండగా, హీరో మోటార్స్ నెగెటివ్ జీఎంపీతో బలహీన సెంటిమెంట్‌ను సూచిస్తోంది.

2026లో ఐపీఓల రికార్డు జోరు
సెప్టెంబర్‌లో ఇప్పటికే 17 ఐపీఓలు స్టార్ట్ కాగా, వచ్చే వారం రాబోయే కొత్త ఇష్యూలతో 2026లో మార్కెట్‌కు వచ్చిన కంపెనీల సంఖ్య 87కు చేరనుంది. పాంటోమాత్ క్యాపిటల్ ఎండీ, సీఈఓ కమ్రాజ్ సింగ్ నేగి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు సేకరించిన రూ.83,062 కోట్లలో సుమారు 60 శాతం నిధులు ఒక్క జూలై, ఆగస్టు నెలల్లోనే సమీకరించబడ్డాయి. భవిష్యత్తులోనూ ఇదే దూకుడు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 167 కంపెనీలు దాదాపు రూ.3.06 లక్షల కోట్ల నిధుల సేకరణకు సెబీ ఆమోదం పొందగా, మరో రూ.1.60 లక్షల కోట్ల సమీకరణ కోసం 71 కంపెనీల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిణామాలు భారత ప్రైమరీ మార్కెట్ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.