బిగ్ బాస్ సీజన్ 5 షో స్పాన్సర్స్ ఒక్కో వారం ఇద్దరేసి చొప్పున హౌస్ మేట్స్ కు అదనపు బహుమతులను ఇస్తూ తమ ప్రాడక్ట్స్ కు చక్కని ప్రచారం చేసుకుంటున్నారు. బిగ్ బాస్ షోలో టాస్క్ కు టాస్క్ కు మధ్య ఈ రకమైన వాణిజ్య ప్రచారాలు బాగానే జరుగుతున్నాయి. శుక్రవారం ప్రసారం అయిన ఎపిసోడ్ లోనూ ప్రెస్టేజ్ సంస్థ బిగ్ బాస్ హౌస్ మేట్స్ కు రెండు సార్లు బహుమతులను అందించింది. హౌస్ మేట్స్ ఆకలిని గుర్తెరిగి, వారికి చక్కని అల్పాహారాన్ని, భోజనాన్ని అందించడంలో ముందున్న వ్యక్తికి 25 వేల రూపాయల గిఫ్ట్ హ్యాంపర్ ను కానుకగా ఇవ్వమంటూ ప్రెస్టేజ్ సంస్థ తరఫున బిగ్ బాస్, కెప్టెన్ షణ్ముఖ్ ను ఆదేశించాడు. హౌస్ లోకి అడుగుపెట్టింది మొదలు ఇంతవరకూ కిచెన్ లోనే తన సేవలు వినియోగించిన ప్రియాంకకు మరో ఆలోచన చేయకుండా షణ్ముఖ్ గిఫ్ట్ హ్యాంపర్ ను అందించాడు.
విశేషం ఏమంటే అదో రోజు రాత్రి ప్రిస్టేజ్ గ్యాస్ స్టవ్ లను క్లీన్ చేసే ఓ జంటకు కూడా 25 వేల గిఫ్ట్ హ్యాంపర్ ను ప్రకటించింది ప్రెస్టేజ్ సంస్థ. ఆ టాస్క్ కు కాజల్, శ్రీరామ్ ను, సిరి, విశ్వ లను షణ్ముఖ్ ఎంపిక చేశాడు. నిర్ణీతసమయంలో గ్యాస్ స్టవ్ లను నీట్ గా క్లీన్ చేసిన సిరి, విశ్వ విజేతలుగా నిలిచి, గిఫ్ట్ హ్యాంపర్ ను అందుకున్నారు. దానికి ముందు కెప్టెన్సీ టాస్క్ కు సంబంధించి జరిగిన పోటీలో మానస్ చక్కటి ప్రతిభ కనబరిచి, సూపర్ విలన్స్ ను గెలిపించాడు. ఆ తర్వాత ఆ టీమ్ సభ్యులు పాల్గొన్న పోటీలో యాని మాస్టర్ ఫైనల్ విజేతగా నిలిచి కెప్టెన్ అయ్యింది. ఆర్. ఎం. నుండి ఆమెకు కెప్టెన్ గా ప్రమోషన్ వచ్చిందని అందరూ అభినందించారు. దానికి ముందు జరిగిన ‘చిక్కకు – దొరక్కు’ గేమ్ ఇంటి సభ్యుల మధ్య కొత్త పేచీకి తెర తీసింది. గేమ్ చివరి రౌండ్ లో యానీ, తాను ఉండగా, ఇంటి సభ్యులంతా బాల్ తో తననే కొట్టారని, యానీ మాస్టర్ సేవ్ కావడానికి సహకరించారని సన్నీ ఆరోపించాడు. అదే తరహాలో షణ్ముఖ్ తో సిరి గొడవ పెట్టుకుంది. షణ్ణు కావాలనే తనపై బాల్స్ తో దాడి చేశాడని, ఒకవేళ తన స్థానంలో షణ్ణు ఉండి ఉంటే, తాను ఒక్క బాల్ కూడా వేసి ఉండేదాన్ని కాదని చెప్పింది. షణ్ణు బాల్ తో చేసిన దాడిని తట్టుకోలేకపోయిన సిరి కన్నీటి పర్యంతమైంది. బయట అందరూ తమని ఫ్రెండ్స్ గా భావిస్తుంటారని, కానీ ఇక్కడ అసలు అలాంటిదే లేదని, నమ్మిన స్నేహితులే తనను టార్గెట్ చేస్తున్నారని, టాస్క్ లలో శారీరకంగా, ఇతర సమయాలలో మాటలతో దాడి చేస్తున్నారని వాపోయింది. ఒకానొక సమయంలో ‘నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, నన్ను బయటకు పంపేయండి బిగ్ బాస్’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది. గతంలో ఇలానే రవి బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోవాలని ఉందని చెప్పినప్పుడు నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. ఇప్పుడు కూడా సిరికి నాగ్ క్లాస్ పీకే ఆస్కారం బాగా కనిపిస్తోంది.