Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!

Nagula Chavithi

Nagula Chavithi

Nagula Chavithi: నాగుల చవితి పర్వదినాన రాజమహేంద్రవరంలోని ప్రసిద్ధ సారంగధరమెట్ట ఆలయంలో ఓ అరుదైన, భక్తిపారవశ్యం కలిగించే ఘటన చోటుచేసుకుంది. పవిత్రమైన ఈ పండగ రోజున సాక్షాత్తూ నాగదేవత ఆలయంలోకి రావడం భక్తులను, అర్చకులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. రాజమహేంద్రవరం నగరంలోని శ్రీ బాలా త్రిపురసుందరి దేవి సమేత శ్రీ సారంగధరేశ్వర స్వామివారి దేవస్థాన ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో నాగుల చవితి రోజున ఒక నాగసర్పం ప్రత్యక్షమైంది. సరిగ్గా నాగుల చవితి పర్వదినం నాడే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోకి నాగసర్పం రావడంతో అక్కడున్న ఆలయ సిబ్బంది, భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.

ఆలయంలోకి నాగసర్పం రావడాన్ని భక్తులు సాక్షాత్తూ ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దివ్య సాన్నిధ్యంగా, ప్రత్యక్ష అనుగ్రహంగా భావించి భక్తిభావంతో పులకించిపోయారు. ఈ అరుదైన ఘటన నేపథ్యంలో ఆలయ అర్చకులు స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నాగుల చవితి రోజున ఇలా నాగసర్పం కనిపించడం అత్యంత శుభసూచకమని ఆలయానికి వచ్చిన భక్తులు ఆసక్తిగా చర్చించుకున్నారు. ఈ వార్త తెలియడంతో ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరిగింది.