Mauni Amavasya 2026: ఈ ఏడాది మాఘ మాసంలో వచ్చే మౌనీ అమావాస్య ఆదివారం నాడు రావడంతో దీనికి మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఆదివారం సూర్యుడికి అంకితమైన రోజు కావడంతో ఆధ్యాత్మికంగా ఈ రోజు శక్తి ఎక్కువగా ఉంటుందని నమ్మకం. మౌనీ అమావాస్య రోజున స్నానం, దానం, పూజ, ధ్యానం చేయడం, మనసును శుద్ధి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయని విశ్వాసం. మాఘ అమావాస్యను మాఘీ అమావాస్య లేదా మౌనీ అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి దానధర్మాలు చేయడం ఆనవాయితీ. ముఖ్యంగా మౌనంగా ఉండి పూజలు చేయడం వల్ల ప్రత్యేక ఫలితం కలుగుతుందని చెబుతారు. అందుకే దీనికి మౌనీ అమావాస్య అనే పేరు వచ్చింది.
READ MORE: ADAS, పానోరమిక్ సన్‌రూఫ్, 7 సీట్లు.. ప్రీమియం లుక్లో MG Majestor
పంచాంగం ప్రకారం అమావాస్య తిథి జనవరి 17వ తేదీ రాత్రి 12 గంటల 5 నిమిషాలకు ప్రారంభమై, జనవరి 18వ తేదీ రాత్రి 1 గంట 22 నిమిషాల వరకు ఉంటుంది. సూర్యోదయం సమయంలో అమావాస్య ఉండటంతో పండుగను జనవరి 18, ఆదివారం రోజునే జరుపుకుంటారు. ఈ రోజున సర్వార్థ సిద్ధి యోగం, హర్షణ యోగం, శివవాస యోగం ఒకేసారి ఏర్పడటం విశేషం. ఉదయం 10 గంటల 14 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 7 గంటల 31 నిమిషాల వరకు సర్వార్థ సిద్ధి యోగం కొనసాగుతుంది. అలాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల శుభసంయోగం కూడా ఉంటుంది. ఈ సమయం స్నానం, దానం, పూజలకు ఎంతో అనుకూలంగా భావిస్తారు. మౌనీ అమావాస్య రోజున గంగా, నర్మద వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల పుణ్యం అనేక రెట్లు పెరుగుతుందని నమ్మకం. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, అవసరమైన వారికి భోజనం పెట్టడం, బట్టలు, దుప్పట్లు, నూనె, పాలు, ధాన్యం లేదా తమ సామర్థ్యానికి తగ్గ దానం చేయడం శుభఫలితాలను ఇస్తుంది. జంతువులు, పక్షులకు ఆహారం పెట్టడం వల్ల పితృదేవతల కృప లభిస్తుందని కూడా చెబుతారు. కచ్చితంగా బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయడం ఉత్తమం. నదిలో స్నానం చేయలేని వారు స్నాన జలంలో గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు.
