Koti Deepotsavam Day 2: కార్తీక మాస శోభతో, అశేష భక్తజన సందోహం మధ్య భక్తి టీవీ నిర్వహిస్తున్న మహా ఆధ్యాత్మిక వేడుక ‘కోటి దీపోత్సవం – 2026’ అత్యంత వైభవంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మహోత్సవంలో భాగంగా రెండవ రోజైన కార్తీక ఆదివారం – స్కంద షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచేందుకు విశేష కార్యక్రమాల నడుమ రెండో రోజు మరింత వైభవంగా ప్రారంభం కానుంది. నేటి వేడుకల్లో భాగంగా మంత్రాలయం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ, రాజస్థాన్‌కు చెందిన శ్రీ హరిచైతన్యపురి మహరాజ్ దివ్య అనుగ్రహ భాషణం అందించనున్నారు. అలాగే శ్రీ తాడేపల్లి పతంజలి శాస్త్రి గారి ప్రవచనామృతం భక్తులను అలరించనుంది.
రెండవ రోజు కార్యక్రమాల వివరాలు:
అనుగ్రహ భాషణం: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థ స్వామీజీ, రాజస్థాన్‌లోని హరి కృపా ధామ్ మహారాజ్ శ్రీ హరిచైతన్యపురి మహరాజ్ భక్తులకు తమ దివ్య అనుగ్రహ భాషణాన్ని అందించనున్నారు.
ప్రవచనామృతం: ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ తాడేపల్లి పతంజలి శాస్త్రి గారి ప్రవచనామృతం భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచనుంది.
వేదికపై ప్రత్యేక పూజలు: వేదికపై అత్యంత భక్తిశ్రద్ధలతో ‘వేలాయుధ కావడి పూజ’, ‘శ్రీ గురురాఘవేంద్ర ఆరాధన’ నిర్వహించనున్నారు.
భక్తులచే విశేష పూజ: ప్రాంగణానికి విచ్చేసే భక్తులందరూ స్వయంగా పాల్గొనేలా శివపుత్రునికి ‘కోటి పుష్పార్చన’ కార్యక్రమం జరగనుంది.
దివ్య కల్యాణోత్సవం: నేటి ప్రధాన ఘట్టంగా తిరుచెందూరు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కల్యాణం అత్యంత వైభవోపేతంగా అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
వాహన సేవ: కల్యాణోత్సవానంతరం స్వామివారికి విశిష్టమైన ‘పల్లకీ’ వాహన సేవ నిర్వహించనున్నారు.
తొలి రోజు శివనామస్మరణతో మార్మోగిన ప్రాంగణంలో, నేడు స్కంద షష్ఠి పర్వదినాన్ని పురస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణతో కోటి దీపోత్సవ వేదిక పులకించనుంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ దివ్య వేడుకల్లో పాల్గొని తరించాలని కోరుతున్నాం. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో, స్కందుడి కరుణతో మీ జీవితం సౌభాగ్యం, సంతోషం, శ్రేయస్సుతో తులతూగాలని కోరుకుంటూ స్కంద షష్ఠి శుభాకాంక్షలు..

