Koti Deepotsavam 2026: నేడు కన్నులపండుగగా జరగనున్న కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం..! గంగాధరుడికి కోటిరుద్రాక్షల అర్చన..

Koti Deepotsavam 2026

Koti Deepotsavam 2026

Koti Deepotsavam 2026: భక్తి టీవీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం 2026 వేడుకల్లో 16వ రోజు ఆదివారం (నవంబర్ 29, 2026, కార్తిక బహుళ షష్ఠి) సాయంత్రం 5:30 గంటల నుంచి విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. ఆధ్యాత్మిక శోభ, భక్తి భావాలతో సాగే ఈ రోజు వేడుకల్లో అనుగ్రహ భాషణం, ప్రవచనామృతం, ప్రత్యేక పూజలు, కల్యాణోత్సవం, వాహన సేవ వంటి పలు ఆధ్యాత్మిక ఘట్టాలు నిర్వహించనున్నారు.

ఆధ్యాత్మిక ప్రవచనామృతం

ఇవాళ జరిగే విశేష కార్యక్రమాల్లో భాగంగా కర్ణాటకలోని శ్రీరంగపట్నం చంద్రవనాశ్రమం ప్రతినిధి శ్రీ శ్రీ త్రినేత్ర మహంత శివయోగి మహాస్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం అందించనున్నారు. మహాస్వామీజీ ఆధ్యాత్మిక సందేశంతో పాటు డాక్టర్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ప్రవచనామృతం వినిపించనున్నారు.

భక్తులచే రుద్రాక్షల అర్చన

వేదికపై నిర్వహించే ప్రత్యేక పూజల్లో భాగంగా సర్వపాపహరణం కలిగించే గంగాధరుడికి కోటిరుద్రాక్షల అర్చన అత్యంత వైభవంగా చేయనున్నారు. మరోవైపు భక్తులచే జరిపే పూజా కార్యక్రమంలో శివలింగాలకు రుద్రాక్షల అర్చన నిర్వహించే ఏర్పాట్లు చేశారు. కార్తిక మాసంలో పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రుద్రాక్షలతో జరిగే ఈ విశేష పూజలు భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతిని ఇవ్వనున్నాయి.

నంది వాహన సేవ

ఈ రోజు వేడుకల్లో అత్యంత కీలకమైన ఘట్టంగా.. నెమలి రూపంలో పార్వతీదేవి తపమాచరించిన క్షేత్రమైన, బ్రహ్మ ప్రతిష్ఠిత శివలింగం కొలువై ఉన్న చెన్నై – మైలాపూర్ శ్రీ కపాలీశ్వర స్వామి కల్యాణోత్సవం కనులపండువగా జరగనుంది. కల్యాణ వేడుకతో పాటు స్వామివారికి నంది వాహన సేవ కూడా నిర్వహించనున్నారు.