Kitchen Vastu Tips: వాస్తు శాస్త్రం ప్రకారం.. వంటగది (కిచెన్) అనేది ఇంటి మొత్తంలోనే అత్యంత పవిత్రమైన ప్రదేశం. ఎందుకంటే కుటుంబ సభ్యుల అందరి ఆరోగ్యం, శక్తి వంటగది నుంచే లభిస్తాయి. కిచెన్‌లో ఉండే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందులోనూ మనం రోజూ వాడే చపాతీ పీట, కర్ర (చక్లా-బేలన్) అత్యంత కీలకమైనవి. వాస్తు నిపుణుల ప్రకారం.. వంటగదిలో విరిగిన లేదా పగిలిన చపాతీ పీట, కర్రను ఉంచడం చాలాచాలా ప్రమాదకరమైంది. దీనివల్ల ఇల్లు దరిద్రంలోకి నెట్టబడటమే కాకుండా, కటిక ఆర్థిక పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందట. చపాతీ పీట వల్ల కలిగే ఆ భయంకరమైన నష్టాలు ఏంటి, దానిని నివారించడానికి పాటించాల్సిన ముఖ్యమైన వాస్తు నియమాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొంప ముంచే 3 వాస్తు నష్టాలు ఇవే..
1. దరిద్రం తాండవిస్తుంది
వాస్తు శాస్త్రం ప్రకారం.. విరిగిన లేదా పగుళ్లు ఉన్న చపాతీ పీటపై రొట్టెలు ఒత్తినప్పుడు ఒక రకమైన వింత శబ్దం వస్తుంది. ఈ శబ్దాన్ని అత్యంత అశుభంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి వచ్చే లక్ష్మీదేవిని అడ్డుకుంటుందట. దీనివల్ల ఆదాయం తగ్గిపోయి, అనవసరపు ఖర్చులు పెరిగి సంపద మంచు ముక్కల కరిగిపోతుందని చెబుతున్నారు.
2. కుటుంబంలో కలహాలు
పగిలిన లేదా విరిగిన వస్తువుల నుంచి ఎల్లప్పుడూ ప్రతికూల శక్తి విడుదలవుతుంది. వంటగదిలో ఇలాంటి విరిగిన వస్తువులు ఉంటే.. కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన దెబ్బతింటుంది. చిన్న చిన్న విషయాలకే ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు జరిగి మనశ్శాంతి కరువవుతుందని అంటున్నారు.
3. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం
వంటగదికి అన్నపూర్ణా దేవి, లక్ష్మీదేవితో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కిచెన్‌లో పగిలిన గిన్నెలు లేదా విరిగిన చపాతీ పీటను వాడటం వల్ల అన్నపూర్ణా దేవి తీవ్రంగా ఆగ్రహిస్తుందట. దీని ప్రభావం కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై పడి, ఎప్పుడూ ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
చపాతీ పీట-కర్ర విషయంలో పాటించాల్సిన 4 గోల్డెన్ రూల్స్:
ఈ భయంకరమైన దోషాల నుంచి తప్పించుకోవడానికి వాస్తు శాస్త్రం ఈ క్రింది నియమాలను సూచిస్తోంది.
శబ్దం రాకూడదు: చపాతీలు చేసేటప్పుడు పీట అస్సలు కదలకూడదు, శబ్దం చేయకూడదు. ఒకవేళ మీ పీట కదులుతూ శబ్దం చేస్తుంటే.. దాని కింద ఒక శుభ్రమైన కాటన్ గుడ్డను వేసి ఆ తర్వాత చపాతీలు చేయండి.
బోర్లించి పెట్టకండి: చాలామంది చపాతీలు చేసిన తర్వాత పీటను బోర్లించి పెడుతుంటారు. వాస్తు శాస్త్రంలో ఇలా చేయడం చాలా పెద్ద తప్పు. పీటను ఎప్పుడూ నిటారుగా (సీదాగా) లేదా గోడకు ఆనించి నిలబెట్టి ఉంచాలి.
వెంటనే కడిగి ఆరబెట్టండి: వంట పూర్తయిన తర్వాత చపాతీ పీట, కర్రను మురికిగా వదిలేయకండి. వాటిని వెంటనే కడిగి, తడి ఆరిన తర్వాత సరైన స్థానంలో పెట్టాలి. రాత్రంతా వాటిని సింక్‌లో మురికిగా వదిలేస్తే రాహువు, శని దోషాలు మీ కుటుంబానికి చుట్టుముట్టే ప్రమాదం ఉందట.
కొనడానికి శుభప్రదమైన రోజు: మీరు ఒకవేళ కొత్త చపాతీ పీట లేదా కర్రను కొనాలనుకుంటే.. బుధవారం లేదా గురువారం రోజూ కొనడం అత్యంత శుభప్రదం అని వాస్తు శాస్త్రం చెబుతుంది. శనివారం, మంగళవారాల్లో వీటిని అస్సలు కొనకూడదని పేర్కొంది.

