జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అక్టోబర్ 31, 2026న శుభ గ్రహమైన గురుడు కర్కాటక రాశి నుంచి సింహ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇప్పటికే సింహ రాశిలో నీడ గ్రహమైన కేతువు సంచరిస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ‘ధ్వజ యోగం’ ఏర్పడుతోంది. జ్ఞానం, సంపద, అదృష్టానికి కారకుడైన గురుడు.. ఆకస్మిక మార్పులకు, ఆధ్యాత్మికతకు ప్రతీక అయిన కేతువుతో కలవడం కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ ఆరు రాశుల వారు ప్రతి అడుగునూ చాలా జాగ్రత్తగా వేయాలని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. వృషభ రాశి
గురు-కేతువుల సంయోగం వృషభ రాశి వారికి పరీక్షా కాలంగా మారనుంది. ఈ కాలంలో వీరు అకస్మాత్తుగా కొన్ని పెద్ద సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తడంతో పాటు, కుటుంబంలో చిన్నచిన్న విషయాలకే గొడవలు జరిగే అవకాశం ఉంది. దీనివల్ల మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. ఒకవేళ మీరు కొత్తగా ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, ఈ సమయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
2. కన్యారాశి
కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఏ కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించాలన్నా పరిస్థితిని పూర్తిగా అంచనా వేయాలి. గురు-కేతువుల అశుభ ప్రభావం వల్ల ఈ కాలంలో పెద్ద పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం కాదు. నిద్రలేమి, భవిష్యత్ గురించిన ఆందోళనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సరైన ఆలోచన లేకపోతే ధన నష్టం జరిగే ప్రమాదముంది. అలాగే ఖర్చులు విపరీతంగా పెరిగి బడ్జెట్ తలకిందులవుతుంది. మానసిక అశాంతి, కడుపు సంబంధిత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. కార్యాలయంలో మీ సహచరులు మీ పనికి ఆటంకం కలిగించే ప్రయత్నం చేయవచ్చు కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.
3. వృశ్చిక రాశి
ఈ ధ్వజ యోగ ప్రభావంతో వృశ్చిక రాశి వారు కొన్ని ప్రమాదాలు, ఆపదలను ఎదుర్కొనే సూచనలున్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఎలాంటి సాహసాలకు పోకపోవడమే ఉత్తమం. వ్యాపారపరంగా సవాళ్లు ఎదురవుతాయి. ఆర్థిక లావాదేవీలు లేదా డబ్బు వివాదాల కారణంగా వాదనలు జరిగే అవకాశం ఉంది. ఎక్కడైనా ఎలాంటి పత్రాలపై సంతకం చేసే ముందు వాటిని క్షుణ్ణంగా చదవడం చాలా ముఖ్యం.
4. మకర రాశి
గ్రహాల అశుభ ప్రభావం కారణంగా మకర రాశి వారు కోర్టు కేసులు లేదా ఇతర వివాదాల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎక్కడైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు లేదా ఎవరికైనా అప్పు ఇచ్చేటప్పుడు చాలా ఆచి తూచి వ్యవహరించాలి. పూర్తి సమాచారం తెలుసుకోకుండా ముందడుగు వేస్తే భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. కుటుంబంలో ఆర్థిక విషయాలపై మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే పిల్లల భవిష్యత్తు కోసం మీరు చేసిన కొన్ని ప్రణాళికలు బెడిసికొట్టే అవకాశం ఉంది.
5. మిథున రాశి
గురు-కేతువుల కలయిక మిథున రాశి వారి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. దీనివల్ల పనుల్లో అడ్డంకులు, సమస్యలు ఎదురవుతాయి. తోబుట్టువులు లేదా అత్యంత సన్నిహిత మిత్రులతో సంబంధాలు చెడిపోయే అవకాశం ఉంది. కేవలం ఉత్సాహంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకండి. ఎవరి దగ్గరి నుంచైనా అప్పులు చేయడం ఈ సమయంలో సరికాదు. ఆరోగ్యం , సంతానానికి సంబంధించిన విషయాల్లో అనేక అడ్డంకులను ఎదుర్కొంటారు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉన్నందున చాలా అప్రమత్తంగా ఉండాలి.
6. కుంభ రాశి
ఈ కాలంలో కుంభ రాశి వారు వ్యాపార భాగస్వాములతో లేదా జీవిత భాగస్వామితో తీవ్రమైన విభేదాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. సింహ రాశిలో ఈ గ్రహాల కలయిక కారణంగా మీ అత్యంత సన్నిహితులతోనూ మనస్పర్థలు వచ్చే ఛాన్స్ ఉంది. మీ మాటలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొత్త సంబంధాలు లేదా పరిచయాలు ఏర్పరచుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. నోరు జారడం వల్ల బంధాల్లో దూరం పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి సంయమనం పాటించడం చాలా అవసరం.

