Balapur Ganesh Laddu Auction: బాలాపూర్ గణపతి లడ్డూ వేలానికి గట్టి పోటీ.. కొత్త రికార్డు సృష్టిస్తుందా..?

Balapur Ganesh Laddu Auctio

Balapur Ganesh Laddu Auctio

Balapur Ganesh Laddu Auction: బాలాపూర్‌ గణపతి అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది లడ్డూ వేలం పాట.. తొలిసారి లడ్డూ వేలం పాటను ప్రారంభించి రికార్డు సృష్టించిన బాలాపూర్‌ గణపతి ఎంతో ప్రాముఖ్యత ఉంది.. ఈ వేలం పాట మొదటిసారిగా 1994 సంవత్సరంలో కేవలం రూ.450తో ప్రారంభం కాగా.. ప్రతీ ఏడాది క్రమంగా పెరుగుతూ.. లక్షలు పలుకుతోంది.. గత ఏడాది కర్మన్‌ఘాట్‌కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ 21 కిలోల లడ్డూను రికార్డు స్థాయిలో రూ. 35 లక్షలకు వేలంలో దక్కించుకున్నారు.. ఇక, ఈ ఏడాది బాలాపూర్‌ గణేష్‌ లడ్డూ కొత్త రికార్డులు సృష్టిస్తుంది అనడం సందేహం లేదంటున్నారు భక్తులు..

బాలాపూర్‌ గణపయ్య లడ్డూను దక్కించుకున్న వారికి అష్టైశ్వర్యాలు, సిరిసంపదలు కలుగుతాయని, వ్యవసాయంలో మంచి పంట వస్తుందని భక్తుల విశ్వాసం.. ఇక, బాలాపూర్ గణపతి లడ్డూ వేలంపాటకు సర్వం సిద్ధమైంది. 21 కిలోల లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు, దాతలు భారీ ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వేలంలో పాల్గొనేందుకు ఇప్పటివరకు ఎనిమిది మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.

మరోవైపు.. బాలాపూర్ గణేశుడికి చివరి రోజు పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. నిర్వాహకులు ఉద్వాసన పూజను నిర్వహించారు. అనంతరం గణేశుడి ఊరేగింపు కార్యక్రమాన్ని బాలాపూర్ వీధుల్లో నిర్వహించనున్నారు. ఇక, ఉదయం 10 గంటల ప్రాంతంలో బాలాపూర్‌లోని బొడ్రాయి వద్ద గణేశుడి లడ్డూ వేలంపాట జరగనుంది. ఈసారి వేలంలో సామ ప్రణీత్ రెడ్డి, మర్రి రవికిరణ్ రెడ్డి, కందాడి శాలిని వీరేందర్ రెడ్డి, కంచర్ల శివారెడ్డి, సామ దయానంద్ రెడ్డి, గడ్డం నవీన్ రెడ్డి, శ్రీకాంత్, ఇబ్రాం ప్రత్యూష్ పాల్గొననున్నారు. గత ఏడాది లడ్డూను లింగాల దశరథ గౌడ్ రూ.35 లక్షలకు దక్కించుకున్నారు. ఈసారి ఆ రికార్డు ధరను అధిగమిస్తుందా? అనే ఉత్కంఠ నెలకొంది.