Volkswagen Virtus Facelift 2026: ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) భారత మార్కెట్లోకి తీసుకురానున్న కొత్త Virtus Facelift కారుకు సంబంధించిన తొలి అధికారిక టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే పలుమార్లు టెస్టింగ్ సమయంలో కనిపించిన ఈ సెడాన్ తాజాగా ఎలాంటి కవరింగ్ లేకుండా టీజర్‌లో దర్శనమిచ్చింది. కొత్త డిజైన్, స్పోర్టీ లుక్, అప్‌డేటెడ్ ఫీచర్లతో ఈ కారును తీసుకురానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 2026లో ఈ మోడల్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
కొత్త ఫ్రంట్ డిజైన్ & స్పోర్టీ లుక్
కొత్త Volkswagen Virtus Facelift ముందు భాగంలో కీలక మార్పులు చేశారు. ఇందులో స్లిమ్ హెడ్‌ల్యాంప్స్‌తో పాటు LED డేటైమ్ రన్నింగ్ లైట్స్‌ను అందించారు. రెండు హెడ్‌ల్యాంప్స్‌ను కలుపుతూ మధ్యలో Volkswagen లోగోతో కూడిన సన్నని గ్రిల్‌ను ఏర్పాటు చేశారు. ఒకవైపు రెడ్ GT బ్యాడ్జ్ కూడా కనిపిస్తోంది. ఇక కొత్త బంపర్‌కు మరింత అగ్రెసివ్ డిజైన్ ఇచ్చారు. వెడల్పాటి లోయర్ ఎయిర్ ఇంటేక్, జామెట్రిక్ డిజైన్ ఎలిమెంట్స్‌తో ముందు భాగం స్పోర్టీగా కనిపిస్తోంది. ఇందులో ప్రత్యేక ఫాగ్ ల్యాంప్స్ స్థానంలో హారిజాంటల్ ఇన్సర్ట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కొత్త అల్లాయ్ వీల్స్..
ఈ టీజర్‌లో బ్లూ ఎక్స్టీరియర్ కలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. బ్లాక్ కలర్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ ORVMలు కారుకు స్పోర్టీ లుక్‌ను అందిస్తున్నాయి. కొత్తగా రూపొందించిన యాంగ్యులర్ అల్లాయ్ వీల్స్‌ను ఇందులో చూడవచ్చు. అయితే కారు సైడ్ ప్రొఫైల్‌లో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. సాంప్రదాయ డోర్ హ్యాండిల్స్, స్లోపింగ్ రూఫ్‌లైన్ కొనసాగనున్నాయి. GT బ్యాడ్జ్‌తో పాటు సింగిల్ పేన్ సన్‌రూఫ్, షార్క్ ఫిన్ యాంటెన్నా కూడా టీజర్‌లో వెల్లడయ్యాయి.
LED టెయిల్ ల్యాంప్స్
కారు వెనుక భాగంలో కూడా కొన్ని మార్పులు చేశారు. ఇందులో స్ప్లిట్ డిజైన్‌తో కూడిన రెడ్ LED టెయిల్ ల్యాంప్స్‌ను అందించారు. ఇవి బూట్ లిడ్ వరకు విస్తరించి ఉంటాయి. రెండు లైట్లను కలుపుతూ మధ్యలో డార్క్ హారిజాంటల్ సెక్షన్‌ను ఇచ్చారు. బూట్‌పై లిప్ స్పాయిలర్, వెనుక బంపర్‌లో డార్క్ లోయర్ ఇన్సర్ట్, పార్కింగ్ సెన్సార్లు ఉన్నాయి. మధ్యలో Volkswagen లోగో, కుడివైపు GT బ్యాడ్జ్ కనిపిస్తున్నాయి.
క్యాబిన్‌లో కొత్త ఫీచర్లు
ప్రస్తుతం కంపెనీ కారు ఇంటీరియర్ వివరాలను వెల్లడించలేదు. అయితే క్యాబిన్‌లో కొత్త అప్‌హోల్స్టరీ, ఇంటీరియర్ ట్రిమ్ మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా 10.25 ఇంచుల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించవచ్చని సమాచారం. ఇప్పటికే ఉన్న 10.1 ఇంచుల టచ్‌స్క్రీన్‌ను కొనసాగిస్తూ కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ ఇవ్వవచ్చు. వీటితో పాటు 360 డిగ్రీల కెమెరా కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఫీచర్లపై కంపెనీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
పెట్రోల్ ఇంజిన్లు & కొత్త ఆటోమేటిక్ గేర్‌బాక్స్
ఇంజిన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 1.0 లీటర్, 1.5 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజిన్లనే కొత్త Virtus Faceliftలో కొనసాగించే అవకాశం ఉంది. 1.0 లీటర్ ఇంజిన్ 115 PS పవర్, 178 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.5 లీటర్ ఇంజిన్ 150 PS పవర్, 250 Nm టార్క్‌ను అందిస్తుంది. అయితే గేర్‌బాక్స్ విషయంలో కీలక మార్పు ఉండనుంది. 1.0 TSI ఇంజిన్‌తో ప్రస్తుతం ఉన్న 6-స్పీడ్ ఆటోమేటిక్ స్థానంలో కొత్త 8-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను అందించే అవకాశం ఉంది. 1.5 TSI ఇంజిన్‌తో 7-స్పీడ్ DSG గేర్‌బాక్స్ కొనసాగనున్నట్లు సమాచారం. ధర, పూర్తి ఫీచర్లు, వేరియంట్ల వివరాలను కంపెనీ లాంచ్‌కు ముందు వెల్లడించే అవకాశం ఉంది.

