TVS Armado Cargo: టీవీఎస్ మోటార్ కంపెనీ ‘ఆర్మాడో’ (Armado) పేరుతో కొత్త కార్గో త్రిచక్ర వాహనాన్ని గ్లోబల్‌గా ఆవిష్కరించింది. ఇది గరిష్ఠంగా ఒక టన్ను వరకు సరుకులను రవాణా చేయగలదని కంపెనీ వెల్లడించింది. 200cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్, 5-స్పీడ్ గేర్‌బాక్స్, రెండు మీటర్ల కార్గో బెడ్ దీని ప్రత్యేకతలు. ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియాన్ మార్కెట్లలో దీనిని విడుదల చేయనుంది.
ఈ వాహనంలో 200cc ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 7,500 rpm వద్ద 10.6 kW (సుమారు 14.2 bhp) పవర్, 5,000 rpm వద్ద 15.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, 16 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉన్నాయి. భారీ లోడ్లు, ఎత్తైన ప్రాంతాలు, ట్రాఫిక్‌లో నిరంతర వినియోగానికి అనుగుణంగా ఇంజిన్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది. ఆర్మాడోలో రెండు మీటర్ల పొడవైన కార్గో బెడ్ ప్రధాన ఆకర్షణ. దీని ద్వారా ఒక టన్ను వరకు సరుకులను తరలించవచ్చు.
కార్గో బెడ్‌కు మూడు వైపులా తెరిచే సదుపాయం ఉండటంతో సరుకులను లోడ్ చేయడం, అన్‌లోడ్ చేయడం సులభమవుతుంది. లీఫ్ స్ప్రింగ్ సస్పెన్షన్, 230 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌ను కూడా అందించారు. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో పూర్తిగా డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, USB ఛార్జింగ్ పోర్ట్ ఉన్నాయి. అభివృద్ధి సమయంలో వేల కిలోమీటర్ల పాటు ఈ వాహనాన్ని పరీక్షించినట్లు కంపెనీ వెల్లడించింది. లక్ష్య మార్కెట్లలో టీవీఎస్ విక్రయ, సర్వీస్ నెట్‌వర్క్ ద్వారా సేవలు, ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అందించనుంది. అయితే, TVS Armado ధర, ఆయా దేశాల్లో అందుబాటులోకి వచ్చే తేదీలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. భారత్‌లో విడుదల చేసే ప్రణాళికపైనా స్పష్టత ఇవ్వలేదు.

