Toyota Innova Hycross Facelift: 360 డిగ్రీ కెమెరా, Wi-Fi, డ్యాష్‌క్యామ్‌తో ఇన్నోవా హైక్రాస్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?

Toyota Innova Hycross Facel

Toyota Innova Hycross Facel

Toyota Innova Hycross Facelift: టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ కోసం ఎదురుచూస్తున్న కార్ల ప్రియులకు గుడ్ న్యూస్. టయోటా కంపెనీ ఇండోనేషియాలో అప్‌డేటెడ్ ఇన్నోవా హైక్రాస్ మోడల్‌ను విడుదల చేసింది. అక్కడ ఈ MPVని Kijang Innova Zenix పేరుతో విక్రయిస్తున్నారు. ఈ కొత్త మోడల్‌లో 360 డిగ్రీ కెమెరా, 12.3 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లే, ఇన్-కార్ Wi-Fi, ఫ్రంట్ అండ్ రియర్ డ్యాష్‌క్యామ్ వంటి ఆధునిక ఫీచర్లను అందించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. భారత్‌లో కూడా టయోటా ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్ నవంబర్ 26న విడుదల కానున్నట్లు సమాచారం. దీంతో ఇండోనేషియాలో విడుదలైన మోడల్‌లోని కొన్ని ఫీచర్లు భారత వెర్షన్‌లోనూ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

కొత్త ఇన్నోవా హైక్రాస్‌లో అదిరిపోయే ఫీచర్లు

ఇండోనేషియాలో విడుదలైన కొత్త ఇన్నోవా జెనిక్స్ హైబ్రిడ్ వేరియంట్లలో ఫీచర్ల పరంగా పలు మార్పులు చేశారు. హైబ్రిడ్ వేరియంట్లన్నింటిలో 12.3 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ అందించారు. పెట్రోల్ వేరియంట్లలో మాత్రం 7 అంగుళాల డిస్‌ప్లే ఇచ్చారు. V Hybrid, అంతకంటే పై స్థాయి వేరియంట్లలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంటుంది. G Hybrid వేరియంట్‌లో 10 అంగుళాల స్క్రీన్ అందించారు. అలాగే V Hybrid, అంతకంటే ఖరీదైన వేరియంట్లలో 360 డిగ్రీ కెమెరా సదుపాయం ఉంది. G Hybridలో సాధారణ రియర్ కెమెరా మాత్రమే లభిస్తుంది.

టాప్ వేరియంట్‌లో ప్రత్యేక ఫీచర్లు

టాప్ Q Hybrid Modellista వేరియంట్‌లో మరిన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నాయి.

డ్రైవర్ సీటుకు ఎలక్ట్రిక్ అడ్జస్ట్‌మెంట్
వెనుక వరుసలో కెప్టెన్ సీట్లు
పవర్ రిక్లైన్, ఒట్టోమన్ సదుపాయం
ముందు, వెనుక డ్యాష్‌క్యామ్‌లు
ఆరు ఎయిర్‌బ్యాగ్స్
Toyota Safety Sense
బ్లైండ్ స్పాట్ మానిటరింగ్
ఇన్-కార్ Wi-Fi హాట్‌స్పాట్

కనెక్టెడ్ కార్ ఫీచర్లలో భాగంగా రిమోట్ ఇంజిన్ స్టార్ట్, రిమోట్ ఏసీ కంట్రోల్, జియోఫెన్సింగ్, దొంగిలించబడిన వాహనాన్ని ట్రాక్ చేసే సదుపాయాలను కూడా అందించారు.
Modellista వేరియంట్లలో ప్రత్యేకమైన ఫ్రంట్, రియర్ బంపర్ డిజైన్‌తో పాటు సైడ్ మోల్డింగ్‌ను కూడా అందించారు.

కొత్త ఇన్నోవా హైక్రాస్ ధర ఎంత?

ఇండోనేషియాలో కొత్త Kijang Innova Zenix హైబ్రిడ్ వేరియంట్ల ధరలు సుమారుగా ఈ విధంగా ఉన్నాయి.

G Hybrid
రూ.24.87 లక్షలు

V Hybrid
రూ.27.05 లక్షలు

V Hybrid Modellista
రూ.28.22 లక్షలు

Q Hybrid Modellista
రూ.32.35 లక్షలు

ఈ ధరల ప్రకారం, బేస్ G Hybrid వేరియంట్‌తో పోలిస్తే టాప్ Q Hybrid Modellista వేరియంట్ ధరలో సుమారు రూ.7.5 లక్షల వ్యత్యాసం ఉంది. ఇవి ఇండోనేషియా మార్కెట్ ధరలను రూపాయల్లోకి మార్చిన అంచనా విలువలు మాత్రమే. భారత మార్కెట్ ధరలుగా భావించకూడదు.

ఇంజిన్, పవర్‌ట్రెయిన్ వివరాలు

కొత్త ఇన్నోవా జెనిక్స్‌లో 1,987cc సామర్థ్యం కలిగిన నాలుగు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించారు. దీనికి 113hp సామర్థ్యం కలిగిన ఎలక్ట్రిక్ మోటార్‌ను జత చేశారు. ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ రెండూ కలిసి గరిష్ఠంగా 186hp పవర్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌కు e-CVT గేర్‌బాక్స్‌ను అనుసంధానించారు.

కొలతలు ఎలా ఉన్నాయి?

పొడవు: 4,755 మి.మీ.
వీల్‌బేస్: 2,850 మి.మీ.
గ్రౌండ్ క్లియరెన్స్: 185 మి.మీ.