Toyota Hilux India Launch: జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ టయోటా భారత మార్కెట్లో తన పాపులర్ పికప్ ట్రక్ హిలక్స్ (Toyota Hilux) కొత్త వెర్షన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా కంపెనీ అధికారికంగా టీజర్‌ను విడుదల చేసింది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో అందుబాటులో ఉన్న ఈ కొత్త తరం హిలక్స్‌ను అదే డిజైన్, ఫీచర్లతో భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. జూలై 28, 2026న ఈ పికప్ ట్రక్ అధికారికంగా భారత మార్కెట్లో లాంచ్ కానుంది.
టయోటా విడుదల చేసిన టీజర్లో కొత్త హిలక్స్ బ్రాంజ్ కలర్లో కనిపించింది. గత మోడల్‌తో పోలిస్తే ఈసారి ముందు భాగంలో గణనీయమైన మార్పులు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇందులో సిల్వర్ స్కిడ్ ప్లేట్, హనీకోంబ్ స్టైల్ సెంటర్ గ్రిల్, LED లైట్ల మధ్య TOYOTA అక్షరాలతో కూడిన బ్లాక్ ప్యానెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. కొత్త డిజైన్ ఈ పికప్ ట్రక్కు మరింత బలమైన, ప్రీమియం లుక్‌ను తీసుకొచ్చింది.
బాహ్య డిజైన్‌లో భాగంగా బ్లాక్ అల్లాయ్ వీల్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, రోల్ బార్లు, షార్క్ ఫిన్ యాంటెన్నా వంటి స్పోర్టీ అంశాలను కూడా టయోటా అందించనుంది. అయితే వెనుక భాగం డిజైన్‌ను కంపెనీ ఇంకా పూర్తిగా వెల్లడించలేదు. అంతర్జాతీయ వెర్షన్లో ఉన్నట్లుగానే వెనుక భాగంలో HiLux బ్రాండింగ్, నిలువుగా అమర్చిన LED టెయిల్లైట్లు భారత వెర్షన్లో కూడా ఉండే అవకాశం ఉంది.
ఇంటీరియర్ విషయానికి వస్తే, భారత మార్కెట్ కోసం పూర్తి వివరాలను టయోటా ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ పికప్ ట్రక్ డబుల్ క్యాబ్ కాన్ఫిగరేషన్‌లో అందుబాటులోకి రానుంది. క్యాబిన్లో లెదర్ స్టీరింగ్ వీల్, 12.3 అంగుళాల డ్యూయల్ డిజిటల్ స్క్రీన్లు, టయోటా స్మార్ట్ కనెక్ట్ సిస్టమ్, డాష్‌బోర్డ్ మౌంటెడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి ఆధునిక ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. దీంతో డ్రైవింగ్ అనుభవం మరింత సౌకర్యవంతంగా మారనుంది.
ఇంజిన్ పరంగా పెద్ద మార్పులు ఉండే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉన్న 2.8 లీటర్ నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్నే కొనసాగించే అవకాశముంది. ఈ ఇంజిన్ 204 హార్స్పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో 420 Nm టార్క్, 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో 500 Nm టార్క్ అందిస్తుంది. పనితీరు పరంగా కూడా ఈ ఇంజిన్‌కు మంచి గుర్తింపు ఉంది. అంతర్జాతీయ మార్కెట్లలో కొత్త హిలక్స్ 48V మైల్డ్-హైబ్రిడ్ టెక్నాలజీ, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో అందుబాటులో ఉంది. అయితే ఈ హైబ్రిడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో విడుదల చేస్తారా లేదా అన్నదానిపై టయోటా ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ధరల విషయానికి వస్తే, ప్రస్తుతం టయోటా హిలక్స్ ధరలు రూ. 28.52 లక్షల నుంచి రూ. 36 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ఉన్నాయి. కొత్త వెర్షన్లో అదనపు ఫీచర్లు, డిజైన్ అప్డేట్స్ కారణంగా ధరలు ప్రస్తుత మోడల్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక, భారత మార్కె్ట్లో పికప్ ట్రక్కుల విభాగంలో టయోటా హిలక్స్ ఇప్పటికే మంచి గుర్తింపు సంపాదించింది. ఇప్పుడు కొత్త డిజైన్, ఆధునిక ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్‌తో రానున్న నెక్స్ట్ జనరేషన్ హిలక్స్ కస్టమర్లను మరింత ఆకట్టుకునే అవకాశం కనిపిస్తోంది.

