పండుగ వేళ టయోటా ధమాకా ఆఫర్.. Toyota Glanza Facelift విడుదల.. రూ. 6.99 లక్షల నుంచే ప్రారంభం..

Toyota Glanza Facelift

Toyota Glanza Facelift

Toyota Glanza Facelift: పండుగల సీజన్ హడావుడి నడుస్తుండగా జపనీస్ కార్ల తయారీ దిగ్గజం టయోటా భారత మార్కెట్లోకి ఒక ధమాకా ఆఫర్‌ను మోసుకొచ్చింది. దేశంలో నవరాత్రులతో పండుగల సందడి మొదలవ్వడంతో వాహన తయారీ సంస్థలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడంలో బిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో టయోటా తన పోర్ట్‌ఫోలియోలోనే అత్యంత చౌకైన కారుగా పేరుగాంచిన టయోటా గ్లాంజా (Toyota Glanza) ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను ఈరోజే ఇండియన్ మార్కెట్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేసింది. ఆకర్షణీయమైన లుక్, పవర్‌ఫుల్ ఇంజిన్‌తో వచ్చిన ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రారంభ ధరను రూ. 6.99 లక్షలుగా నిర్ణయించారు. ఇక టాప్ మోడల్ ధర ఎక్స్-షోరూమ్‌లో రూ. 10.49 లక్షల వరకు ఉంటుంది. ఈ కొత్త టయోటా గ్లాంజా మొత్తం ఈ, ఎస్, జీ, వి, అలాగే వి (ఆప్షనల్) అనే 5 వేరియంట్లలో లభిస్తుంది. ఈ కారులో టయోటా మొదటిసారిగా అడ్వాన్స్‌డ్ డ్రైవింగ్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌ను జోడించడం విశేషం. అయితే ఈ ఫీచర్ కేవలం హయ్యర్ వేరియంట్ అయిన V (O) గ్రేడ్‌లోనే అందుబాటులో ఉంటుంది. రంగుల విషయానికొస్తే.. కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా మొత్తం 7 కలర్ ఆప్షన్లలో లభిస్తోంది. ఇందులో సరికొత్తగా పరిచయం చేసిన బ్లూయిష్ బ్లాక్, డిజిటల్ టీల్ రంగులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

లుక్, డిజైన్ పరంగా ఈ కొత్త గ్లాంజాలో పలు ఆసక్తికరమైన మార్పులు చేశారు. కారు ముందరి భాగాన్ని (ఫ్రంట్ ఫేస్) పూర్తిగా కొత్తగా తీర్చిదిద్దారు. కొత్త గ్రిల్, సరికొత్త డిజైన్‌తో కూడిన అలాయ్ వీల్స్‌ను అమర్చారు. ADAS కి సంబంధించిన ఫీచర్లకు సపోర్ట్ చేసేలా కారులో అధునాతన రాడార్ మోడ్యూల్‌ను అమర్చారు. హెడ్‌లైట్ల డిజైన్‌లో ఎలాంటి మార్పు చేయకపోయినప్పటికీ, ఎల్ఈడీ ఫాగ్ ల్యాంప్స్‌కు మాత్రం కొత్త రూపునిచ్చారు. ముందు భాగంలో ఉండే టయోటా లోగో స్థానాన్ని మార్చి, బోనెట్ కింద ఉన్న ప్లాస్టిక్ ట్రిమ్‌పై అమర్చారు. దీనితో పాటు షార్క్-ఫిన్ యాంటెన్నాను కూడా ఇచ్చారు. ఇక సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే పాత మోడల్ డిజైన్‌నే కొనసాగించారు. ఇందులో 16 అంగుళాల అలాయ్ వీల్స్, క్రోమ్ డోర్ హ్యాండిల్స్, కిటికీల చుట్టూ ఉండే క్రోమ్ లైనింగ్స్ అలాగే ఉంటాయి. వెనుక వైపు కూడా ర్యాప్‌రౌండ్ LED టెయిల్‌లైట్స్, రూఫ్ స్పాయిలర్, రియర్ వైపర్, వాషర్‌లతో పాత డిజైన్‌నే మైంటైన్ చేశారు.

ఈ కారులో తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు దాని ఇంజిన్. కొత్త గ్లాంజాలో Z12E కోడ్‌తో కూడిన 1.2 లీటర్, 3-సిలిండర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్‌ను అందించారు. ఇది పెట్రోల్, సీఎన్‌జీ (CNG) రెండు ఇంధన ఆప్షన్లలోనూ నడుస్తుంది. పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజిన్ 83hp పవర్, 112Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ (AMT) ఆప్షన్లు ఇచ్చారు. పాత మోడల్‌లో 4-సిలిండర్ ఇంజిన్ ఉండేది, దానితో పోలిస్తే కొత్త ఇంజిన్ పవర్ 7hp, టార్క్ 1Nm మేర తగ్గినప్పటికీ మైలేజ్ మాత్రం మెరుగైంది. ట్రాఫిక్‌లో లేదా కారు కొద్దిసేపు ఆగినప్పుడు ఇంధనం వృథా కాకుండా ఇంజిన్‌ను ఆటోమేటిక్‌గా ఆఫ్ చేసే ఐడిల్ స్టార్ట్-స్టాప్ ఫీచర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. డ్రైవింగ్‌ను మరింత స్మూత్‌గా మార్చడానికి ఆటోమేటిక్ వేరియంట్ల కోసం ‘ఇంటెలిజెంట్ గేర్ షిఫ్ట్’ (IGS) సిస్టమ్‌ను ప్రవేశపెట్టారు. ఇక సీఎన్‌జీ మోడ్‌లో ఈ ఇంజిన్ 70hp పవర్, 102Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులోనూ 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ AMT ఆప్షన్లు ఉన్నాయి. సీఎన్‌జీలో పవర్ 7hp తగ్గినా, టార్క్ మాత్రం 4.5Nm పెరగడం గమనార్హం.

కేబిన్ ఫీచర్ల పరంగా కొత్త గ్లాంజా అత్యంత ప్రీమియంగా అనిపిస్తుంది. ఇందులో సరికొత్త లెదరెట్ సీట్ అప్‌హోల్స్టరీని అందించారు. వేసవి కాలంలో ప్రయాణాన్ని మరింత సుఖమయం చేసేందుకు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్ల సదుపాయాన్ని చేర్చారు. వైర్‌లెస్ ఫోన్ చార్జర్ సదుపాయంతో పాటు, చార్జింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా కింద భాగంలో కూలింగ్ వెంట్ కూడా ఇవ్వడం విశేషం. కార్ కనెక్టివిటీ కోసం టయోటా ఐ-కనెక్ట్, డ్రైవర్ సౌకర్యార్థం మోనోక్రోమ్ హెడ్-అప్ డిస్‌ప్లే (HUD), రంగుల మల్టీ-ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే (MID) తో కూడిన అనలాగ్ డయల్స్, అలాగే సులభమైన పార్కింగ్ కోసం 360 డిగ్రీ కెమెరాను అమర్చారు. మ్యూజిక్ ప్రియులను అలరించేందుకు క్లారియాన్ (Clarion) కి చెందిన 4-స్పీకర్లు, 2-ట్వీటర్ల సౌండ్ సిస్టమ్‌ను అందించారు. మునుపటి మోడల్ లాగే ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక సీటు ప్రయాణికుల కోసం ఏసీ వెంట్స్ ఉన్నాయి. టైర్లలో గాలి ఒత్తిడిని పర్యవేక్షించే టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) కూడా ఉంది. ఇక, భద్రత విషయంలో టయోటా ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా (స్టాండర్డ్‌గా) అందిస్తోంది. టాప్ వేరియంట్‌లో లెవల్-2 ADAS ప్యాకేజ్ లభిస్తుంది. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ కీప్ అసిస్ట్, హై-బీమ్ అసిస్ట్ వంటి అడ్వాన్స్‌డ్ సెక్యూర్ ఫీచర్లు ఉన్నాయి. వీటితో పాటు టెక్ బాడీ స్ట్రక్చర్, ఈబీడీతో కూడిన ఏబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్, వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC), త్రీ-పాయింటెడ్ ఈఎల్ఆర్ సీట్ బెల్ట్స్, ఎమర్జెన్సీ స్టాప్ సిగ్నల్స్ వంటి అనేక కీలకమైన సేఫ్టీ ఫీచర్లు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా మారుస్తాయి.