Top 5 Most Impactful Cars Launched in India in 2025: 2025లో భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో ఎన్నో కీలకమైన కొత్త కార్లు విడుదలయ్యాయి. ఈ ఏడాది కంపెనీలు పూర్తిగా కొత్త మోడళ్లను తీసుకురావడమే కాకుండా, పాత పేర్లను మళ్లీ మార్కెట్‌లోకి తెచ్చాయి. ఎలక్ట్రిక్ వాహనాల నుంచి మెరుగైన పెట్రోల్, డీజిల్ కార్ల వరకు అన్ని విభాగాలను ఇవి కవర్ చేశాయి. వాటిలో ఈ ఏడాది ప్రభావం చూపిన ఐదు ముఖ్యమైన కార్ల గురించి తెలుసుకుందాం..
READ MORE: Chinese Manja Accident : దడ పుట్టిస్తున్న చైనా మాంజా.. మెడకు తగిలి యువకుడికి 19 కుట్లు
మహీంద్రా XEV9e
ప్రీమియం ఎలక్ట్రిక్ SUV విభాగంలో మహీంద్రా తన సత్తా చూపిస్తూ XEV9eను విడుదల చేసింది. INGLO ప్లాట్‌ఫామ్‌పై తయారైన ఈ ఎలక్ట్రిక్ SUVను రూ.21.90 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. డిజైన్, పనితీరు, రేంజ్‌పై ప్రత్యేక దృష్టితో రూపొందించిన ఈ కారు 59 kWh, 79 kWh బ్యాటరీ ఆప్షన్లలో లభిస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 600 కిలోమీటర్లకు పైగా రేంజ్ ఇవ్వగలదని కంపెనీ తెలిపింది.
మారుతి సుజుకి విక్టోరిస్
మారుతి సుజుకి తన అరేనా షోరూమ్‌ల ద్వారా విక్టోరిస్ మోడల్‌ను విడుదల చేసి, ఎస్‌యూవీ సెగ్మెంట్లలో తన ఉనికిని పెంచుకుంది. కొత్త ప్లాట్‌ఫామ్‌పై రూపొందిన ఈ కారు మెరుగైన ఇంటీరియర్, అప్‌డేటెడ్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చింది. కాంపాక్ట్ SUVలకే పరిమితం కాకుండా ప్రీమియం కార్ల డిమాండ్‌ను అందిపుచ్చుకోవాలనే లక్ష్యంతో ఈ మోడల్‌ను తీసుకొచ్చింది. రూ.10.50 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) లభించే ఈ కారులో CNG, ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV) వంటి ఆప్షన్లు ఉన్నాయి.
ఎంజీ సైబర్‌స్టర్
ఎంజీ మోటార్ ఇండియా మార్కెట్‌లో కొత్తదనాన్ని తీసుకొస్తూ డబుల్ డోర్స్ ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ సైబర్‌స్టర్‌ను విడుదల చేసింది. ఇది ఎంజీకి హాలో ప్రొడక్ట్‌లా పనిచేస్తూ, కంపెనీ ఎలక్ట్రిక్ టెక్నాలజీ, డిజైన్ సామర్థ్యాన్ని చూపించింది. ఇది నిశ్ విభాగానికి చెందిన కారు అయినప్పటికీ.. ఎంజీ తన EV పోర్ట్‌ఫోలియోను విస్తరించాలనే ఉద్దేశాన్ని ఈ కారుతో స్పష్టంగా తెలిపింది. ఈ కారు ప్రస్తుతం రూ.74.99 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) మార్కెట్లో అందుబాటులో ఉంది.
హ్యుందాయ్ వెన్యూ (ఫేస్‌లిఫ్ట్)
2025లో హ్యుందాయ్ వెన్యూను కొత్త రూపంతో అప్‌డేట్ చేసింది. కారు డిజైన్‌లో మార్పులు చేయడమే కాకుండా, ఫీచర్లు, కనెక్టెడ్ టెక్నాలజీ, భద్రతా సదుపాయాలు, మెటీరియల్ క్వాలిటీని మెరుగుపరిచింది. రూ.7.90 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) విడుదలైన ఈ కాంపాక్ట్ SUV భారత వినియోగదారులను ఆకట్టుకుంది.
టాటా సియెర్రా
టాటా మోటార్స్ సియెర్రా అనే పాత పేరును మళ్లీ మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. నాటి రోజులను గుర్తు చేసే డిజైన్‌తో పాటు ఆధునిక ఫీచర్లను కలిపి ఈ SUVను తయారు చేసింది. పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో వచ్చిన ఈ మోడల్‌లో కొత్త టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించడం విశేషం. ఈ ఇంజిన్ భవిష్యత్తులో హారియర్, సఫారి వంటి మోడళ్లకు కూడా ఉపయోగపడేలా టాటాకు దారితీసింది. మొదటిసారి మార్కెట్‌లో వచ్చిన స్పందన మామూలుగానే ఉన్నా, దీని దీర్ఘకాల ప్రభావం ఎలా ఉంటుందో చూడాల్సి ఉంది.
