VinFast VF 2: టాటా నానో కంటే చిన్న ఎలక్ట్రిక్ కారు.. VinFast కొత్త ఎలక్ట్రిక్ కారు.. 18.3kWh బ్యాటరీ, 210KM రేంజ్

Vinfast Vf 2

Vinfast Vf 2

VinFast VF 2 Electric Car: భారత మార్కెట్లో టాటా నానో ఒకప్పుడు సంచలనం సృష్టించింది. సామాన్య కుటుంబాలు కూడా సొంతంగా కారు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో టాటా మోటార్స్ ఈ చిన్న కారును అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే, ఆశించిన స్థాయిలో నానో విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో వియత్నాంకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ VinFast మరో చిన్న ఎలక్ట్రిక్ కారును పరిచయం చేసింది. అదే VinFast VF 2. చిన్న పరిమాణం, 210 కిలోమీటర్ల రేంజ్, 80 కి.మీ. గరిష్ట వేగంతో ఈ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. VinFast VF 2 కారును ప్రధానంగా నగరాల్లో రోజువారీ ప్రయాణాల కోసం రూపొందించారు. చిన్న రోడ్లు, ఇరుకైన వీధుల్లో సులభంగా ప్రయాణించడంతో పాటు తక్కువ స్థలంలో పార్కింగ్ చేసుకునేలా దీని డిజైన్‌ను రూపొందించారు.

ఈ కారు కొలతలు

పొడవు: 3,090 మి.మీ.
వెడల్పు: 1,496 మి.మీ.
ఎత్తు: 1,663.2 మి.మీ.
వీల్‌బేస్: 2,065 మి.మీ.

టాటా నానో ప్రారంభంలో సుమారు 3.1 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పు, 1.6 మీటర్ల ఎత్తుతో అందుబాటులో ఉండేది. ఈ లెక్కన VinFast VF 2 కూడా టాటా నానోను గుర్తుచేసే విధంగా చిన్న పరిమాణంలో ఉంది. అయితే, చిన్న కారే అయినప్పటికీ ఇందులో నలుగురు ప్రయాణించే సదుపాయం కల్పించారు. డిజైన్ పరంగా VinFast VF 2 మొడ్రన్ లుక్ ని కలిగి ఉంది. ఇందులో LED హెడ్‌ల్యాంప్స్, 13 ఇంచుల అల్లాయ్ వీల్స్ అందించారు. ఇక కారు ఇంటీరియర్ విషయానికి వస్తే స్టీరింగ్ వీల్ వెనుక 7 ఇంచుల డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే ఉంటుంది. అలాగే ఎయిర్ కండిషనింగ్, డ్రైవర్ కోసం 4-వే మాన్యువల్ అడ్జస్టబుల్ సీటు, FM రేడియో, రెండు స్పీకర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. రోజువారీ నగర ప్రయాణాలకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను ఈ కారులో అందించారు.

VinFast VF 2లో రియర్ వీల్ డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. ఈ మోటార్ 30 kW పవర్ (40.2 bhp), 65 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 80 కిలోమీటర్లు. ఇందులో Eco, Normal అనే రెండు డ్రైవింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. అవసరాన్ని బట్టి డ్రైవర్ వీటిని ఎంచుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారులో 18.3 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే గరిష్టంగా 210 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

అయితే, ఈ రేంజ్ NEDC టెస్టింగ్ సైకిల్ ఆధారంగా ప్రకటించిన గణాంకం. వాస్తవ వినియోగంలో రహదారి పరిస్థితులు, వేగం, ఏసీ వినియోగం, డ్రైవింగ్ విధానాన్ని బట్టి రేంజ్ మారవచ్చు. ఛార్జింగ్ విషయానికి వస్తే ఇందులో 24 kW వరకు DC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఈ టెక్నాలజీతో బ్యాటరీని కేవలం 34 నిమిషాల్లో 10 శాతం నుంచి 70 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. ఈ వివరాలను బట్టి చూస్తే, ఈ కారును సుదూర ప్రయాణాల కంటే నగరాల్లో రోజువారీ రాకపోకలకు అనువుగా రూపొందించినట్లు తెలుస్తోంది.

చిన్న ఎలక్ట్రిక్ కారైనా భద్రత విషయంలో అవసరమైన కొన్ని ఫీచర్లను అందించారు. ఇందులో డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD) ఉన్నాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు, వెనుక భాగాల్లో MacPherson స్ట్రట్ సస్పెన్షన్ సెటప్‌ను అందించినట్లు కంపెనీ సమాచారం. ప్రస్తుతం VinFast VF 2 కారును భారత మార్కెట్లో విడుదల చేసే విషయంపై కంపెనీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే, VinFast ఇప్పటికే భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ SUVలు, MPVల విభాగంలో తన ఉనికిని చాటుకుంటోంది. భవిష్యత్తులో చిన్న ఎలక్ట్రిక్ కార్ల విభాగంలోకి కూడా ప్రవేశిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఈ కారును భారతదేశంలో అందుబాటు ధరలో విడుదల చేస్తే, తక్కువ ఖర్చుతో సొంత కారు కొనాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉంది.