Skoda Kodiaq RS: స్కోడా (Skoda) భారత మార్కెట్లో లగ్జరీ + పెర్ఫార్మెన్స్ కూడిన కొత్త SUV కారు Kodiaq RSను అధికారికంగా లాంచ్ చేసింది. ఈ ప్రీమియం పెర్ఫార్మెన్స్ SUV ఎక్స్‌షోరూమ్ ధర రూ.66.99 లక్షలుగా నిర్ణయించారు. భారతదేశంలో ప్రస్తుతం విక్రయిస్తున్న స్కోడా SUVలలో ఇదే అత్యంత ఖరీదైన మోడల్. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. జూన్ 22న బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే మొదటి 50 యూనిట్లు కేవలం 6 నిమిషాల్లోనే అమ్ముడుపోయాయి. అయితే మరికొన్ని యూనిట్లను భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకురానున్నారా.? లేదా.? అనే విషయంపై స్కోడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
కేవలం 6.3 సెకన్లలో 100 కి.మీ వేగం:
స్కోడా కొడియాక్ RSలో 2.0 లీటర్ EA888 నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 265 హార్స్‌పవర్ (hp) శక్తితో పాటు 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సాధారణ కొడియాక్ మోడల్‌తో పోలిస్తే ఇది 61hp అదనపు పవర్, 80Nm అధిక టార్క్‌ను అందిస్తుంది. ఇంజిన్‌కు 7-స్పీడ్ DSG ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జతచేశారు. ఈ SUVలో ఆల్-వీల్ డ్రైవ్ (AWD) సిస్టమ్ కూడా అందుబాటులో ఉంది. స్కోడా ప్రకారం.. ఈ SUV 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 6.3 సెకన్లలో అందుకోగలదు. దీంతో భారత మార్కెట్లో విక్రయిస్తున్న స్కోడా కార్లలోనే అత్యంత వేగవంతమైన మోడల్‌గా Kodiaq RS నిలవనుంది.
ఆధునిక టెక్నాలజీ ఫీచర్స్:
కొడియాక్ RSలో కేవలం పవర్ మాత్రమే కాకుండా పలు అధునాతన టెక్నాలజీ ఫీచర్లను కూడా అందించారు. ఇందులో ప్రోగ్రెసివ్ స్టీరింగ్ సిస్టమ్ ఉండటం వల్ల వాహనం వేగానికి అనుగుణంగా స్టీరింగ్ స్పందన మారుతుంది. అలాగే డైనమిక్ చాసిస్ కంట్రోల్ ప్లస్ ద్వారా 15 రకాల సస్పెన్షన్ సెట్టింగ్స్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్లు స్పోర్టీ డ్రైవింగ్ అనుభూతిని అందించడంతో పాటు అవసరమైనప్పుడు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా కల్పిస్తాయి.
స్పోర్టీ డిజైన్ & ప్రీమియం లుక్:
డిజైన్ పరంగా కూడా Kodiaq RS ప్రత్యేకతను సొంతం చేసుకుంది. ఇందులో 20 అంగుళాల అలాయ్ వీల్స్, ప్రత్యేక RS బ్యాడ్జింగ్, పెద్ద రూఫ్ స్పాయిలర్, బ్లాక్-అవుట్ గ్రిల్, బ్లాక్ ORVMలు, రూఫ్ రైల్స్, విండో సరౌండ్స్ వంటి స్పోర్టీ ఎలిమెంట్స్ ఉన్నాయి. వీటితోపాటు డ్యూయల్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఎగ్జాస్ట్ టిప్స్ వాహనానికి మరింత ఆకర్షణీయమైన ప్రీమియం లుక్‌ను అందిస్తున్నాయి.
ధరలు:
ప్రస్తుతం భారతదేశంలో స్కోడా కొడియాక్ SUV నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి ఎక్స్‌షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి.
* కొడియాక్ లాంజ్ – రూ.36.99 లక్షలు.
* కొడియాక్ స్పోర్ట్ లైన్ – రూ.44.99 లక్షలు.
* కొడియాక్ సెలక్షన్ L&K – రూ.46.99 లక్షలు.
* కొడియాక్ RS – రూ.66.99 లక్షలు.

