Nissan Festive Offers: కార్లపై బంపర్ ఆఫర్.. రూ.86 వేల విలువైన CNG కిట్ ఫ్రీ.. అప్పటి వరకు మాత్రమే..!

Nissan Festive Offers

Nissan Festive Offers

Nissan Magnite, Gravite Offer: ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) భారతీయ వినియోగదారులకు అదిరిపోయే పండుగ ఆఫర్ ప్రకటించింది. తన పాపులర్ కార్లు మాగ్నైట్, గ్రావైట్ కొనుగోలుదారులకు ఉచితంగా CNG రెట్రోఫిట్‌మెంట్ కిట్లను అందిస్తోంది. ఈ కిట్ల అసలు ధర రూ.85,999 వరకు ఉండగా.. పరిమిత కాలం పాటు ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అందించనుంది. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుంది. 2026 నవంబర్ 16వ తేదీలోపు బుక్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ప్రయోజనం లభిస్తుంది.

ఉచిత CNG కిట్లు

నిస్సాన్ ప్రకటించిన ఈ ఆఫర్‌లో భాగంగా మాగ్నైట్, గ్రావైట్ కార్లకు ప్రభుత్వం ఆమోదించిన CNG రెట్రోఫిట్‌మెంట్ కిట్లను ఉచితంగా పొందవచ్చు. సాధారణంగా Magnite కోసం ఈ కిట్ ధర రూ.74,999 కాగా, Gravite కోసం రూ.85,999గా ఉంది. అయితే పరిమిత కాల ఆఫర్‌లో భాగంగా అర్హులైన కొనుగోలుదారులకు వీటిని ఉచితంగా అందించనున్నారు. మాగ్నైట్ లో VISIA MT, VISIA EZ-SHIFT, VISIA+ MT మినహా మిగిలిన అన్ని నాన్-టర్బో వేరియంట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఇక గ్రావైట్ లో TEKNA ట్రిమ్ కొనుగోలుదారులు మాత్రమే ఉచిత CNG కిట్ ప్రయోజనాన్ని పొందగలరు. ఈ కిట్లకు వాహనం ప్రామాణిక వారంటీతో పాటు అదనంగా 3 సంవత్సరాలు లేదా లక్ష కిలోమీటర్ల వరకు (ఏది ముందుగా పూర్తయితే అది) థర్డ్ పార్టీ వారంటీ కూడా లభిస్తుంది.

రెండు కార్లలో CNG కిట్ సెటప్

మాగ్నైట్లో బూట్ స్పేస్‌లో సింగిల్ సిలిండర్‌తో కూడిన CNG కిట్‌ను అమర్చనున్నారు. మరోవైపు గ్రావైట్ లో రెండు సిలిండర్ల సెటప్‌ను అందించారు. ఇందులో 25 లీటర్ల సామర్థ్యం కలిగిన రెండు సిలిండర్లు ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా అమర్చడం వల్ల కారులోని మూడు వరుసల సీటింగ్ సౌకర్యం కొనసాగుతుంది. CNG కిట్లను ఉచితంగా అందించడం ద్వారా వినియోగదారులకు ఇంధన ఖర్చులు తగ్గించుకునే అవకాశం కల్పించడంతో పాటు పర్యావరణహిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించాలని నిస్సాన్ భావిస్తోంది. ఈ ఆఫర్ ముగిసిన తర్వాత Magnite CNG కిట్ ధర రూ.74,999, Gravite CNG కిట్ ధర రూ.85,999గా కొనసాగనున్నాయి. ప్రస్తుతం ఈ రెండు కార్లపై CNG కిట్ మినహా ఇతర అదనపు పండుగ ఆఫర్లను కంపెనీ ప్రకటించలేదు.