క్రెటా ప్రియులకు గుడ్ న్యూస్.. త్వరలోనే మార్కె్ట్లోకి Hyundai Creta 7-Seater.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం..

Hyundai Creta 7 Seater

Hyundai Creta 7 Seater

Hyundai Creta 7-Seater: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటాకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే హవా సృష్టిస్తున్న ఈ పాపులర్ ఎస్‌యూవీని కంపెనీ మరింత అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో సరికొత్త రూపంలో తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. మీడియాలో వస్తున్న నివేదికల ప్రకారం.. త్వరలో రానున్న నెక్స్ట్ జనరేషన్ క్రెటాతో పాటు దీనికి సంబంధించిన 7-సీటర్ మోడల్‌ను కూడా మార్కెట్లోకి లాంచ్ చేసే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే.. పెద్ద కుటుంబాలతో కలిసి ప్రయాణించే వారికి ఎక్కువ సీటింగ్ కెపాసిటీ ఉన్న అద్భుతమైన ఎస్‌యూవీని కొనుగోలు చేసే అవకాశం దక్కుతుంది. అంతేకాకుండా, ఆటోమొబైల్ మార్కెట్లో క్రెటా ఆధిపత్యం మరింత బలపడుతుంది.

ప్రస్తుతం థర్డ్ జనరేషన్ క్రెటాకు సంబంధించి వేగంగా పనులు జరుగుతున్నాయి. కంపెనీ వర్గాలు దీనికి ‘SX3’ అనే కోడ్‌నేమ్‌ను కేటాయించాయి. ఈ కొత్త ఎస్‌యూవీకి సంబంధించి ప్రస్తుతం భారతీయ రోడ్లపై రహస్య టెస్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. రాబోయే కొత్త క్రెటాలో డిజైన్ నుంచి ప్లాట్‌ఫారమ్ వరకు భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. దీన్ని కంపెనీ అటు 5-సీటర్, ఇటు 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో తీసుకురానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 7-సీటర్ మోడల్ డిజైన్ చాలా వరకు రెగ్యులర్ క్రెటాలానే కనిపించినప్పటికీ.. దీన్ని మరింత ఆకర్షణీయంగా మార్చడానికి ముందు భాగంలోనూ, వెనుక డిజైన్‌లోనూ కొన్ని ప్రత్యేక మార్పులు చేయనున్నారు.

ఈ కొత్త జనరేషన్ హ్యుందాయ్ క్రెటాలో కంపెనీ సరికొత్త ‘K3 ప్లాట్‌ఫారమ్‌’ను ఉపయోగించనుంది. సరిగ్గా ఇదే ప్లాట్‌ఫారమ్ మీదే కొత్త జనరేషన్ కియా సెల్టోస్‌ను కూడా తయారు చేశారు. దీనివల్ల రాబోయే క్రెటా వీల్‌బేస్ ప్రస్తుత మోడల్‌తో పోలిస్తే కాస్త ఎక్కువగా ఉండనుంది. ఇంటీరియర్ స్పేస్‌తో పాటు ఎస్‌యూవీ మొత్తం సైజు కూడా పెరిగే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఇక, ఇంజిన్ విషయానికొస్తే.. ఇందులో 1.5-టర్బో పెట్రోల్ అలాగే 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను అందించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇదే ఇంజిన్లను హ్యుందాయ్ కంపెనీకి చెందిన మరో 7-సీటర్ మోడల్ ‘అల్కాజార్’లో కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా, ప్రస్తుతం హైబ్రిడ్ కార్ల తయారీపై కంపెనీ తన దృష్టిని మరింత సారిస్తున్న నేపథ్యంలో.. రాబోయే కొత్త క్రెటాలో ‘స్ట్రాంగ్-హైబ్రిడ్’ టెక్నాలజీని కూడా తీసుకువచ్చే అంశంపై గట్టిగా ఆలోచిస్తోంది. మార్కెట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఈ 7-సీటర్ క్రెటా నేరుగా మహీంద్రా స్కార్పియో-ఎన్, టాటా సఫారి, ఎంజీ హెక్టర్ వంటి పాపులర్ ఎస్‌యూవీలతో గట్టి పోటీ పడనుంది.