KTM 200 Duke Launched: అత్యంత ప్రజాదరణ పొందిన కేటీఎం (KTM) స్ట్రీట్‌ఫైటర్ మోటార్‌సైకిల్ KTM 200 Dukeను సరికొత్త అప్‌డేట్లతో భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. అత్యాధునిక సాంకేతికత, ఆధునిక ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్స్‌తో రూపొందిన ఈ నయా మోడల్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 2.07 లక్షలుగా నిర్ణయించారు. పాత వేరియంట్‌తో పోలిస్తే కేవలం రూ. 1,552 మాత్రమే ధర పెరిగినప్పటికీ.. సాధారణంగా ప్రీమియం సెగ్మెంట్ బైక్‌లలో మాత్రమే కనిపించే ఎన్నో హై-ఎండ్ ఫీచర్లను ఇందులో స్టాండర్డ్‌గా చేర్చడం విశేషం.
ఎలక్ట్రానిక్ ఫీచర్లు
కొత్త KTM 200 డ్యూక్‌లో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేశారు. ఇందులో అమర్చిన రైడ్-బై-వైర్ (Ride-by-Wire) ఎలక్ట్రానిక్ థొరోటల్ కంట్రోల్ ద్వారా రైడింగ్ రెస్పాన్స్ మరింత సున్నితంగా మారింది. ఈ సాంకేతికత ద్వారా స్ట్రీట్ (Street), రెయిన్ (Rain) అనే రెండు రైడ్ మోడ్స్ లభిస్తాయి. ఇవి రోడ్డు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఇంజిన్ పవర్ డెలివరీని నియంత్రిస్తాయి. బైక్ చక్రాలు జారిపోకుండా అదనపు భద్రత కల్పించేందుకు ట్రాక్షన్ కంట్రోల్ (Traction Control) సిస్టమ్‌ను సైతం స్టాండర్డ్‌గా అందించారు.
క్లచ్‌లెస్ గేర్ షిఫ్టింగ్
మార్చే సమయంలో క్లచ్ అవసరం లేకుండానే సాఫీగా అప్‌షిఫ్ట్, డౌన్‌షిఫ్ట్ చేసుకునేందుకు బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌ను ఈ బైక్‌లో పొందుపరిచారు. ఇప్పటివరకు కేటీఎం 250, 390 డ్యూక్ వంటి పెద్ద మోడళ్లకే పరిమితమైన ఈ అత్యాధునిక ఫీచర్ ఇప్పుడు ఎంట్రీ-లెవల్ 200 డ్యూక్‌లోనూ లభించడం బైక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీనికి తోడు నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సమయాల్లో క్లచ్‌ను పదే పదే వాడాల్సిన శ్రమను తగ్గిస్తూ బైక్ నెమ్మదిగా ముందుకు సాగేందుకు ‘క్రాల్ అసిస్ట్’ ఫీచర్‌ను జోడించారు. ఈ రైడ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, క్విక్‌షిఫ్టర్ సెట్టింగ్‌లను రైడర్లు సులభంగా నియంత్రించేందుకు వీలుగా సరికొత్త TFT డిస్‌ప్లేను అప్‌డేట్ చేశారు.
దృఢమైన హార్డ్‌వేర్
ఈ బైక్ మెకానికల్ పరంగా తన నమ్మకమైన పవర్ ఫుల్ పర్ఫార్మెన్స్‌నే కొనసాగిస్తోంది. ఇందులో 199.5 cc లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు, ఇది గరిష్టంగా 25 hp పవర్ మరియు 19.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తూ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతకట్టబడి ఉంటుంది. ఈ 200cc స్ట్రీట్-నేకెడ్ విభాగంలో అత్యుత్తమ పవర్-టు-వెయిట్ రేషియో కలిగిన మోటార్‌సైకిల్‌గా ఇది నిలుస్తుందని సంస్థ పేర్కొంది. హార్డ్‌వేర్ పరంగా ముందు వైపు 43 mm WP USD ఫోర్క్స్, 320 mm ఫ్రంట్ డిస్క్ బ్రేక్ రోటర్ మరియు వెనుక వైపు 150-సెక్షన్ వెడల్పాటి టైర్‌ను యథావిధిగా కొనసాగించారు. ఇవి బైక్‌కు అగ్రెసివ్ లుక్‌ను ఇవ్వడంతో పాటు హై-స్పీడ్స్ వద్ద తిరుగులేని రోడ్ స్టెబిలిటీని సమకూరుస్తాయి.
ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లు
కొత్త KTM 200 Duke లుక్స్‌ను మరింత తాజాగా మార్చేందుకు రెండు సరికొత్త రంగుల్లో విడుదల చేశారు. ఇందులో మొదటిసారిగా పరిచయం చేసిన ‘లిక్విడ్ కార్బన్’ (Liquid Carbon) వేరియంట్ పూర్తి ఆల్-బ్లాక్ ఫినిషింగ్‌తో బైక్‌కు డార్క్, దూకుడుతో కూడిన స్పోర్టీ లుక్‌ను అందిస్తుంది. అలాగే రెండో ఆప్షన్‌గా వచ్చిన ‘స్లేట్ గ్రే’ (Slate Grey) కాంట్రాస్ట్ ఎలిమెంట్స్‌తో కూడిన క్లాసీ, మోడ్రన్ మరియు ప్రీమియం రూపాన్ని రైడర్లకు అందిస్తుంది.

