MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!

  • ఎంజీ మెజెస్టర్ ధరలు.. బుకింగ్స్ ప్రారంభం
  • పవర్‌ఫుల్ ట్విన్-టర్బో ఇంజిన్‌తో భారీ పర్ఫార్మెన్స్
  • లగ్జరీ ఇంటీరియర్.. ప్రీమియం ఫీచర్ల సందడి
  • లెవెల్-2 ADASతో సేఫ్టీకి హై ప్రాధాన్యత
Majestor

Majestor

భారత ఆటోమొబైల్ రంగంలో జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ (JSW MG Motor) తన సరికొత్త ఫ్లాగ్‌షిప్ లగ్జరీ ఎస్‌యూవీ ‘ఎంజీ మెజెస్టర్’ (MG Majestor) ను దేశీయ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. విలాసవంతమైన ప్రయాణాన్ని ఇష్టపడే వారి కోసం అత్యాధునిక సాంకేతికతతో ఈ సరికొత్త మోడల్‌ను కంపెనీ రంగంలోకి దించింది. ఈ సరికొత్త ఎస్‌యూవీ ప్రారంభ ధరను రూ.40.99 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

లాంచ్‌తో పాటే ఈ కారు కోసం బుకింగ్స్‌ను కూడా కంపెనీ ప్రారంభించింది. కేవలం రూ.41,000 టోకెన్ అమౌంట్ చెల్లించి కస్టమర్లు తమకు నచ్చిన వేరియంట్‌ను ఆన్‌లైన్ ద్వారా లేదా దేశవ్యాప్తంగా ఉన్న ఎంజీ అధికారిక డీలర్‌షిప్‌ల ద్వారా బుక్ చేసుకోవచ్చు. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎండీ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ, “భారతదేశపు మొట్టమొదటి డి+ (D+) క్లాస్ ఎస్‌యూవీగా ఎంజీ మెజెస్టర్ మా పోర్ట్‌ఫోలియోలో చేరింది. ఇది అద్భుతమైన పనితీరు, ప్రీమియం ఫీచర్లు, అధునాతన సాంకేతికత , నమ్మకమైన భద్రత కలయిక” అని ధీమా వ్యక్తం చేశారు.

ఎంజీ మెజెస్టర్ ధరల వివరాలు

ప్రస్తుతానికి కంపెనీ కేవలం టాప్ మోడల్‌లోని రెండు వేరియంట్ల ధరలను మాత్రమే అధికారికంగా వెల్లడించింది. మిగిలిన వేరియంట్ల ధరలను భవిష్యత్తులో ప్రకటించనున్నారు.

MG Majestor 4×2 ఆటోమేటిక్ (టాప్ వేరియంట్): దీని ధర రూ.40.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా 6-సీటర్ , 7-సీటర్ ఆప్షన్లలో లభిస్తుంది.

MG Majestor 4×4 ఆటోమేటిక్ (టాప్ వేరియంట్): ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం తీసుకొచ్చిన ఈ వేరియంట్ ధర రూ.44.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది కేవలం 7-సీటర్ ఆప్షన్‌లో మాత్రమే కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

ఫైనాన్స్ , ఈఎంఐ (EMI) ఆప్షన్స్
ఈ లగ్జరీ కారును కొనుగోలు చేయాలనుకునే వారి కోసం కంపెనీ ఆకర్షణీయమైన ఈఎంఐ ఆప్షన్లను కూడా అందిస్తోంది. ఉదాహరణకు, ఎక్స్-షోరూమ్ ధర రూ.40.99 లక్షలు ఉన్న 4×2 ఆటోమేటిక్ వేరియంట్.. టాక్స్, ఇన్సూరెన్స్ , ఇతర రిజిస్ట్రేషన్ ఖర్చులతో కలిపి ఆన్-రోడ్ ధర సుమారు రూ.49 లక్షల వరకు వస్తుంది. ఒకవేళ కస్టమర్ రూ.10 లక్షల డౌన్ పేమెంట్ చేసి, 10% వడ్డీ రేటుతో 5 సంవత్సరాల కాలపరిమితికి లోన్ తీసుకుంటే నెలవారీ ఈఎంఐ సుమారు రూ.80,000 వరకు ఉంటుంది. అదే లోన్ కాలపరిమితిని 7 సంవత్సరాలకు పొడిగించుకుంటే ఈఎంఐ భారం తగ్గి సుమారు రూ.64,000 అవుతుంది. వినియోగదారులు చెల్లించే డౌన్ పేమెంట్, ఎంచుకునే బ్యాంక్ వడ్డీ రేటును బట్టి ఈ ఈఎంఐ మొత్తంలో మార్పులు ఉంటాయని గమనించాలి.

పవర్‌ఫుల్ ఇంజిన్ , పర్ఫార్మెన్స్
ఎంజీ మెజెస్టర్ కారులో అత్యంత పవర్‌ఫుల్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 215.5 PS పవర్ , 478.5 Nm ల పీక్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. దీనికి అధునాతన 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఈ కారు 2WD , అడ్వాన్స్‌డ్ 4WD అనే రెండు డ్రైవ్ ఆప్షన్లలో లభిస్తుంది. ముఖ్యంగా ఇందులోని 4WD సిస్టమ్‌లో ఏకంగా 10 రకాల ఆఫ్-రోడ్ మోడ్స్ ఇవ్వడం విశేషం. ఆటో మోడ్‌లో ఉన్నప్పుడు ఈ కారు నార్మల్ రోడ్లపై 2WD మోడ్‌లోనే నడుస్తూ ఇంధనాన్ని ఆదా చేస్తుంది, అవసరాన్ని బట్టి రోడ్డు కండిషన్‌ను బట్టి ఆటోమేటిక్‌గా 4WD మోడ్‌లోకి మారిపోతుంది.

రాజసం ఉట్టిపడే ఇంటీరియర్, ఇన్ఫోటైన్‌మెంట్
కారు లోపలి భాగం (Interior) ప్రీమియం బ్లాక్ కలర్ థీమ్‌తో అద్భుతంగా డిజైన్ చేయబడింది. ఇందులో వెంటిలేటెడ్ , మసాజ్ ఫీచర్ ఉన్న లగ్జరీ లెదర్ సీట్లను అందించారు. డ్రైవర్ సీటును 12 రకాలుగా, ప్యాసింజర్ సీటును 8 రకాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారులో భారీ పనోరమిక్ సన్‌రూఫ్, 64 రంగుల యాంబియంట్ లైటింగ్ , త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉన్నాయి. డ్యాష్‌బోర్డ్‌పై డ్యూయల్ 12.3-అంగుళాల భారీ డిస్‌ప్లేలు, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ప్రయాణంలో థియేటర్ అనుభూతిని ఇచ్చే 12 జేబీఎల్ (JBL) స్పీకర్లు, డ్యూయల్ వైర్‌లెస్ ఛార్జర్లు, 220V పవర్ అవుట్‌లెట్‌తో పాటు ఏకంగా 75కు పైగా ఐస్మార్ట్ (iSMART) కనెక్టెడ్ ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

లెవెల్-2 ADAS తో పటిష్టమైన భద్రత
లగ్జరీతో పాటు భద్రతకు కూడా ఈ కారులో అగ్ర ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో అత్యంత సురక్షితమైన లెవెల్-2 అడాస్ (ADAS) టెక్నాలజీని అందించారు. ఇది ప్రయాణంలో ఆటోమేటిక్ స్టీరింగ్, బ్రేకింగ్ , యాక్సిలరేషన్‌లో డ్రైవర్‌కు సహాయపడుతుంది. వీటితో పాటు 360-డిగ్రీ హెచ్‌డీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), ఏబీఎస్ (ABS), ఈబీడీ (EBD), ట్రాక్షన్ కంట్రోల్ (TCS) , రోల్‌ఓవర్ మిటిగేషన్ (RMI) వంటి పటిష్టమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ పెర్ల్ వైట్, కాంక్రీట్ గ్రే, మెటల్ బ్లాక్ , మెటల్ యాష్ అనే నాలుగు ఆకర్షణీయమైన రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది.