Site icon NTV Telugu

Man Of The Hole Brazil: ఆ ఒకే ఒక్కడు.. ఇక లేడు

Man Of The Hole Died

Man Of The Hole Died

Man of the Hole Last Of His Tanaru Tribe Dies In Brazil: బ్రెజిల్‌లోని టనారు ఆదివాసీ తెగకు చివరి వ్యక్తి చనిపోవడంతో.. ఆ తెగ అంతరించిపోయింది. గత 26 ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న అతడు.. తాను కట్టుకున్న గుడిసె బయట విగతజీవిగా కనిపించినట్టు అధికారులు వెల్లడించారు. అతనిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో.. సహజంగానే మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. అతను ఆగస్టు 23వ తేదీన మృతి చెందినట్టు గుర్తించారు. అతని వయసు 60 సంవత్సరాలు ఉండొచ్చని అనుకుంటున్నారు. తను గొయ్యిలు తవ్వి.. వాటిలో పడే జంతువుల్ని ఆహారంగా తీసుకుంటాడు. దాంతో అతనికి బ్రెజిల్‌లో ‘మ్యాన్ ఆఫ్ హోల్’ అని పిలుస్తారు. అయితే.. ఆ వ్యక్తి పేరేంటో ఎవ్వరికీ తెలీదు.

అసలు ఈ తెగ మనుషులు ఏమయ్యారు? ఆ ఒక్క వ్యక్తే ఎందుకు మిగిలాడు? ఒకప్పుడు ఈ తెగకు చెందిన మనుషులు చాలామందే ఉండేవారు. బొలీవియా బార్డర్‌లో రోండోనియా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల్లో వీళ్లు నివసించేవాళ్లు. ఈ తెగ వ్యక్తులు ఎవ్వరి జోలికి వెళ్లేవారు కాదు. తమ పని తాము చేసుకునేవారు. అయితే.. 70వ దశకంలో రోండోనియా రాష్ట్రానికి చెందిన భూస్వాములు, అటవీభూముల్లో తమ పొలాలను విస్తరించాలనుకున్నారు. కానీ, ఈ టనారు ఆదివాసీ వాళ్లు అందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆగ్రహించిన భూస్వాములు.. వారిపై దాడికి దిగారు. అధునాధన ఆయుధాలతో ఎగబడ్డారు. ఆ దాడిలో ఈ అరుదైన తెగకు చెందిన ఆదివాసీలు చాలామంది చనిపోయారు. ఆ తర్వాత 1995లో అక్రమ గనుల తవ్వకందారులు సైతం ఈ తెగలో మిగిలిన కొంతమందిని సైతం చంపేశాడు. అలా దాడుల్లో అందరూ చనిపోగా.. ఒక్క మ్యాన్ ఆఫ్ హోల్ మాత్రమే మిగిలాడు.

టనారు తెగకు చెందిన వాళ్లలో కేవలం ఒకే ఒక్కడు మిగిలిన విషయాన్ని బ్రెజిల్ ప్రభుత్వం తెలుసుకొని.. అతనుండే ప్రాంతాన్ని నిషిద్ధం ప్రాంతంగా ప్రకటించింది. అతని జోలికి ఎవ్వరూ వెళ్లకూడదని రూల్ పెట్టింది. అంతేకాదు.. అతడు సంచరించే ప్రాంతాలను సైతం బ్రెజిల్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుండేవారు. అతనికి ఏమీ హాని కాకూడదని, ఇతరుల నుంచి అతనికెలాంటి అపాయం కలగకూడదనే ఆ పర్యవేక్షణ. ఈ క్రమంలోనే అతడ్ని పరిశీలించేందుకు ఓ ఉద్యోగి అతని ఇంటివైపు వెళ్లగా.. విగతజీవుడిలా దర్శనమిచ్చాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తనకు చావు దగ్గర పడిందన్న విషయం తెలిసి, ఆ వ్యక్తి తన శరీరంపై స్వయంగా ఈకలు కప్పుకున్నాడు.

Exit mobile version