Lamborghini Temerario Spyder: ప్రముఖ లగ్జరీ స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ Lamborghini మరో అద్భుతమైన సూపర్‌కార్‌ను పరిచయం చేసింది. తన హైబ్రిడ్ సూపర్‌కార్ Temerarioకి ఓపెన్‌టాప్ వెర్షన్‌గా Temerario Spyderను ఆవిష్కరించింది. అత్యాధునిక టెక్నాలజీ, ఆకట్టుకునే డిజైన్, శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్‌తో రూపొందించిన ఈ కారు గరిష్టంగా 920hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా గంటకు 343 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోగలదు.
Lamborghini Temerario Spyderలో ప్రధాన ఆకర్షణ పూర్తిగా ఎలక్ట్రిక్ రిట్రాక్టబుల్ హార్డ్‌టాప్. ఇందులో 10 ఎలక్ట్రిక్ యాక్చుయేటర్లను ఉపయోగించారు. ఈ రూఫ్ సీట్ల వెనుక నిలువుగా ముడుచుకునే విధంగా రూపొందించారు. Lamborghini స్పైడర్ మోడళ్లలో తొలిసారిగా ఈ తరహా రూఫ్‌ను అందించారు. కంపెనీ వెల్లడించిన వివరాల ప్రకారం, రూఫ్ ఓపెన్ చేసినప్పుడు కారు సెంటర్ ఆఫ్ గ్రావిటీ 3mm తగ్గుతుంది. అయితే వెయిట్ డిస్ట్రిబ్యూషన్లో ఎలాంటి మార్పు ఉండదు.
గతంలో వచ్చిన Huracan EVO Spyderతో పోలిస్తే Temerario Spyderలో క్యాబిన్ స్పేస్‌ను మరింత మెరుగుపరిచారు. ఇందులో 46mm అదనపు లెగ్‌రూమ్, 22mm ఎక్కువ హెడ్‌రూమ్, 9mm అదనపు షోల్డర్, ఎల్బో రూమ్ లభిస్తుంది. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే మూడు స్థాయిల్లో పనిచేసే సీట్ నెక్ వార్మర్, 112 లీటర్ల ఫ్రంట్ లగేజ్ కంపార్ట్మెంట్ ఉన్నాయి. అంతేకాకుండా అప్డేట్ చేసిన సస్పెన్షన్ ట్యూనింగ్ వల్ల గుంతలు, ఎగుడుదిగుడు రోడ్లపై ప్రయాణించేటప్పుడు వచ్చే సెకండరీ వైబ్రేషన్లు 20 శాతం తగ్గుతాయని కంపెనీ తెలిపింది.
ఈ సూపర్‌కార్‌ను పూర్తిగా అల్యూమినియంతో తయారు చేసిన స్పేస్ఫ్రేమ్పై నిర్మించారు. Huracan Spyderతో పోలిస్తే దీని స్టాటిక్ టార్షనల్ రిజిడిటీలో 6 శాతం, డైనమిక్ బెండింగ్ స్టిఫ్నెస్లో 9 శాతం, డైనమిక్ టార్షనల్ రిజిడిటీలో 6 శాతం మెరుగుదల ఉన్నట్లు Lamborghini వెల్లడించింది. అలాగే Huracan EVO Spyderతో పోలిస్తే స్ట్రక్చరల్ కాంపోనెంట్ల సంఖ్యను 50 శాతం, హీట్ ఇన్పుట్ వెల్డింగ్‌లను 80 శాతం తగ్గించారు.
Lamborghini Temerario Spyderలో 4.0 లీటర్ ట్విన్ టర్బో V8 ఇంజిన్‌తో పాటు మూడు ఎలక్ట్రిక్ మోటార్లను అందించారు. ఈ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ మొత్తం 920hp గరిష్ట పవర్‌ను, 800Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులోని V8 ఇంజిన్ ఒక్కటే 800hp పవర్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 10,000rpm వరకు పనిచేస్తుంది. లాంచ్ కంట్రోల్ యాక్టివేట్ చేసినప్పుడు ఇంజిన్ వేగం 10,250rpm వరకు చేరుకుంటుంది.
పెర్ఫార్మెన్స్ విషయంలోనూ Temerario Spyder ఆకట్టుకుంటుంది. ఈ కారు కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 100kmph వేగాన్ని అందుకుంటుందని, దీని గరిష్ట వేగం గంటకు 343 కిలోమీటర్లుగా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. ఇందులో Citta, Strada, Sport, Corsa, Corsa ESC Off అనే ఐదు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. వీటితో పాటు Recharge, Hybrid, Performance అనే మూడు ఎనర్జీ మేనేజ్మెంట్ స్ట్రాటజీలను కూడా అందించారు. మరో ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మూడు స్థాయిల్లో పనిచేసే Drift Mode కూడా ఉంది. Citta మోడ్‌లో ఈ కారు పూర్తిగా ఎలక్ట్రిక్ పవర్‌తో ప్రయాణిస్తుంది. ఈ సమయంలో గరిష్టంగా 190hp పవర్‌ను అందిస్తుంది.
Lamborghini Temerario Spyder తన శక్తివంతమైన హైబ్రిడ్ ఇంజిన్, ఎలక్ట్రిక్ రిట్రాక్టబుల్ హార్డ్‌టాప్, లగ్జరీ ఫీచర్లు, అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో సూపర్‌కార్ ప్రియులను ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ కారు భారతదేశంలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దీని ధర ఎంత ఉంటుంది? అనే విషయాలపై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

