Hyundai Ioniq P Electric SUV Launch: హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి మరో కొత్త ఎలక్ట్రిక్ SUV రాబోతోంది. ‘ఐయోనిక్ P’ (Ioniq P) పేరుతో రూపొందిస్తున్న ఈ సబ్-4 మీటర్ ఎలక్ట్రిక్ SUVని 2027 జనవరి 16న ఆవిష్కరించనున్నట్లు తాజా సమాచారం. ఫిబ్రవరిలో జరిగే 2027 భారత్ మొబిలిటీ ఎక్స్‌పోలో కూడా ఈ వాహనాన్ని ప్రదర్శించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ధరలను ప్రకటించవచ్చని అంచనా. టెస్ట్ మ్యూల్ చిత్రాల ఆధారంగా చూస్తే హ్యుందాయ్ ఐయోనిక్ P బాక్సీ SUV డిజైన్‌తో రానుంది. వెన్యూ తరహా రూపాన్ని పోలి ఉండే ఈ కారులో క్లోజ్డ్ గ్రిల్, పిక్సెల్ స్టైల్ LED DRLs, పెద్ద హెడ్‌ల్యాంప్స్ ఉండే అవకాశం ఉంది. సైడ్ ప్రొఫైల్‌లో సర్క్యులర్ వీల్ ఆర్చెస్, ఏరో-ఆప్టిమైజ్డ్ అల్లాయ్ వీల్స్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, రూఫ్ రైల్స్ కనిపించనున్నాయి. వెనుక భాగంలో కనెక్టెడ్ పిక్సెల్ స్టైల్ టెయిల్ ల్యాంప్స్, స్పోర్టీ రూఫ్ స్పాయిలర్ ఉండనున్నాయి.
ఈ SUVలో ప్రీమియం ఫీచర్లతో పాటు క్యాబిన్ స్పేస్, సౌకర్యానికి హ్యుందాయ్ ప్రాధాన్యం ఇవ్వనుంది. ఇందులో పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్, చిన్న డ్రైవర్ డిస్‌ప్లేతో కూడిన ‘ప్లియోస్ కనెక్ట్’ (Pleos Connect) సిస్టమ్ ఉండే అవకాశం ఉంది. ఈ టెక్నాలజీతో భారత్‌లో విడుదలయ్యే హ్యుందాయ్ తొలి కారుగా ఐయోనిక్ P నిలిచే అవకాశం ఉంది. ఇతర ఫీచర్లలో లెవల్-2 ADAS, OTA అప్‌డేట్స్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, హ్యుందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ టెక్నాలజీ ఉండనున్నాయి. వీటితో పాటు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక AC వెంట్స్ కూడా అందించే అవకాశం ఉంది.
హ్యుందాయ్ ఐయోనిక్ Pను కంపెనీ E-GMP (K) ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తున్నట్లు లీక్స్ చెబుతున్నాయి. అయితే బ్యాటరీ, మోటార్ స్పెసిఫికేషన్లను ఇంకా వెల్లడించలేదు. కాకపోతే హ్యుందాయ్ ఇన్‌స్టర్ EV తరహాలో 42 kWh, 49 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చని తెలుస్తోంది. ఇన్‌స్టర్ EVలో ఈ బ్యాటరీలు వరుసగా 300 కి.మీ.- 355 కి.మీ. రేంజ్‌ను అందిస్తాయి. ఇన్‌స్టర్ EVలో చిన్న బ్యాటరీతో 97 hp, పెద్ద బ్యాటరీతో 115 hp పవర్ ఉత్పత్తి చేసే ఫ్రంట్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఐయోనిక్ Pలో కూడా ఇలాంటి పనితీరు ఉండవచ్చని అంచనా. ఈ SUV స్టాండర్డ్ రేంజ్, లాంగ్ రేంజ్ అనే రెండు బ్యాటరీ వెర్షన్లలో రానున్నట్లు హ్యుందాయ్ ధృవీకరించింది. పూర్తి వివరాలను కంపెనీ రాబోయే వారాల్లో వెల్లడించనుంది.

