Sheetal Devi: పారా ఆర్చరీలో అద్భుత విజయాలు సాధించిన భారత క్రీడాకారిణి శీతల్ దేవికి ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ (Hyundai) సరికొత్త Bayon SUVని బహుమతిగా అందచేసింది. క్రీడల్లో ఆమె సాధించిన విజయాలతో పాటు సమాజంలో సమానత్వం, సాధికారత కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ కానుక ఇచ్చింది. ఆసియా పారా గేమ్స్‌లో శీతల్ దేవి వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగాల్లో స్వర్ణ పతకాలు సాధించింది. ఈ పోటీల్లో తోమన్ కుమార్‌తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో బంగారు పతకం గెలుచుకుంది. అలాగే పాయల్ నాగ్‌తో కలిసి మహిళల కాంపౌండ్ డబుల్స్‌లో రజత పతకాన్ని అందుకుంది.
2026 సెప్టెంబర్ 9న శీతల్ దేవిని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా హ్యుందాయ్ ప్రకటించింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా ప్రకటనల ప్రచారాలు, దివ్యాంగులకు అందుబాటు సౌకర్యాల కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆమె భాగస్వామ్యం కానుంది. సంస్థ చేపట్టిన ‘Samarth’ కార్యక్రమం ద్వారా ఇప్పటికే పారా అథ్లెట్లకు మద్దతు అందిస్తోంది. ఇకపోతే హ్యుందాయ్ Bayon SUVని 2026 అక్టోబర్ 26న భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్‌షోరూమ్ ధర రూ.9,99,900గా ఉంది. వెన్యూ, క్రెటా మోడళ్ల మధ్య స్థానంలో ఉండేలా ఈ SUVని రూపొందించారు.
ఈ కారులో 1.5 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ ఉంది. ఇది 115 hp పవర్, 143.8 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్, ఇంటెలిజెంట్ వేరియబుల్ ట్రాన్స్మిషన్ (IVT) గేర్‌బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి రెండు 12.3 అంగుళాల డిస్ప్లేలు, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీట్, బోస్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు లభిస్తాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్‌ను అన్ని వేరియంట్లలో అందించారు. అయితే శీతల్ దేవికి అందించిన Bayon SUVలో ప్రత్యేకంగా మార్పులు చేసిన డ్రైవింగ్ కంట్రోల్స్ ఉన్నాయా? ఏ వేరియంట్‌ను బహుమతిగా ఇచ్చారు? అనే విషయాలను హ్యుందాయ్ వెల్లడించలేదు.

