Honda Rebel 300 Launched in India: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా (Honda) తన Rebel 300 బైక్‌కు సంబంధించిన ఇండియా స్పెసిఫికేషన్లను అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది. ఇప్పటికే ఆగస్టులో ఈ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.2.22 లక్షలు కాగా, ఈ-క్లచ్ వేరియంట్ ధరను రూ.2.62 లక్షలుగా నిర్ణయించింది. తాజాగా ఇంజిన్ పవర్, టార్క్, బరువు, కొలతలు, ఫీచర్ల వివరాలను ప్రకటించింది.
హోండా రెబెల్ 300లో 286.01cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్‌ను అందించారు. ఇది 8,000 rpm వద్ద 27.6 PS పవర్, 6,250 rpm వద్ద 24.5 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్ ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్లో అసిస్ట్, స్లిప్పర్ క్లచ్ అందించగా.. టాప్ వేరియంట్లో హోండా ఈ-క్లచ్ టెక్నాలజీని ఇచ్చారు. ఈ సిస్టమ్ ద్వారా క్లచ్ లివర్ ఉపయోగించకుండానే బైక్‌ను స్టార్ట్ చేయడం, ఆపడం, గేర్లు మార్చడం చేయవచ్చు. అయితే గేర్ల ఎంపిక కోసం ఫుట్ షిఫ్టర్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. అవసరమైతే సంప్రదాయ పద్ధతిలో క్లచ్ లివర్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. స్టాండర్డ్ వేరియంట్ బరువు 173 కిలోలు కాగా, ఈ-క్లచ్ వేరియంట్ బరువు 176 కిలోలుగా ఉంది. రెండు వేరియంట్లలోనూ 11.2 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది.
హోండా రెబెల్ 300 పొడవు 2,200 mm, వెడల్పు 808 mm, ఎత్తు 1,125 mmగా ఉంది. వీల్‌బేస్ 1,506 mm కాగా, సీట్ హైట్ 690 mmగా ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ 129 mm. ముందు టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. 16 ఇంచుల వీల్స్‌తో పాటు డ్యూయల్ ఛానల్ ABS అందించారు. ఫీచర్ల విషయానికి వస్తే.. LED హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్స్, TFT ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇప్పటికే కొన్ని హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లకు Rebel 300 బైక్‌లు చేరుకుంటున్నాయి. దీంతో త్వరలోనే కస్టమర్లకు డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే దేశవ్యాప్తంగా డెలివరీల ప్రారంభ తేదీపై హోండా ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

