Honda CB500 Launched in India: రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..

Honda Cb500 Launched In Ind

Honda Cb500 Launched In Ind

Honda CB500 Launched in India: ఎన్నో బైక్‌లు మార్కెట్‌ను ముంచెత్తినా.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్న ప్రత్యేకతే వేరు.. అయితే, ఇప్పుడు రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు పోటీగా కొత్త బైక్‌ వచ్చేసింది.. భారత మార్కెట్‌లో 500cc సింగిల్-సిలిండర్ మోటార్‌సైకిల్ విభాగంలో  హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా కొత్త CB500 బైక్‌ను విడుదల చేసింది. ఆకర్షణీయమైన డిజైన్, శక్తివంతమైన ఇంజిన్‌తో వచ్చిన ఈ మోటార్‌సైకిల్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.2.75 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

మూడు వేరియంట్లు.. ధరలు ఇలా
హోండా CB500 బేస్ అల్లాయ్ వేరియంట్ ధర రూ.2.75 లక్షలు. క్రాస్-స్పోక్ ట్యూబ్‌లెస్ రిమ్‌లతో కూడిన స్పోక్ వేరియంట్ ధర రూ.3 లక్షలుగా ఉంది. టాప్-స్పెక్ వేరియంట్‌లో స్పోక్ వీల్స్‌తో పాటు ప్రత్యేక రంగులు, గ్రాఫిక్స్ అందిస్తున్నారు. దీని ధర రూ.3.02 లక్షలు. బైక్‌కు సంబంధించిన అధికారిక బుకింగ్‌లను కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రారంభించింది.

501cc సింగిల్-సిలిండర్ ఇంజిన్
CB500లో 501cc సింగిల్-సిలిండర్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌ను అందించారు. ఈ ఇంజిన్ 28 hp గరిష్ట శక్తిని, 43.3 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. భారత మార్కెట్‌లో హోండా అందిస్తున్న అతిపెద్ద ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ మోటార్‌సైకిల్‌గా ఇది నిలుస్తుంది. బలమైన సింగిల్-సిలిండర్ ఇంజిన్‌తో పాటు లైట్‌ వెయిట్‌ కోరుకునే రైడర్లను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు.

ఫీచర్లకు ప్రాధాన్యం
మూడు వేరియంట్లలోనూ కీలక ఫీచర్లను స్టాండర్డ్‌గా అందించారు. హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (HSTC), స్లిప్పర్ క్లచ్, అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రైడింగ్ సమయంలో వెనుక చక్రానికి ట్రాక్షన్‌ను నిర్వహించడంలో HSTC సహాయపడుతుంది.

భారత్‌లోనే తయారీ
హోండా CB500ను భారత్‌లోనే తయారు చేస్తోంది. స్థానిక తయారీ ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించడంతో పాటు ధరను పోటీగా ఉంచేందుకు కంపెనీ ప్రయత్నించింది. ముఖ్యంగా 350cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న మోటార్‌సైకిళ్లపై వర్తించే 40 శాతం జీఎస్‌టీ నేపథ్యంలో స్థానిక తయారీ ప్రాధాన్యం సంతరించుకుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లతో పోటీ
రాయల్ ఎన్‌ఫీల్డ్ 2020లో తన 500cc మోటార్‌సైకిళ్లను నిలిపివేసిన తర్వాత ఈ విభాగంలో ఖాళీ ఏర్పడింది. ఇప్పుడు CB500తో హోండా ఆ విభాగంలోకి అడుగుపెట్టింది. ధర పరంగా కూడా CB500, రూ.3.39 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర కలిగిన రాయల్ ఎన్‌ఫీల్డ్ 650 ట్విన్స్ కంటే తక్కువ ధరలో అందుబాటులో ఉంది.