501.7cc ఇంజిన్, మూడు వేరియంట్లు.. రెట్రో లుక్‌తో Honda CB500 బైక్..!

Honda Cb500

Honda Cb500

Honda CB500 Launched: ఇటీవల హోండా (Honda) CB500 క్లాసిక్ రోడ్‌స్టర్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్ ప్రారంభ ధరను రూ.2.75 లక్షలుగా నిర్ణయించింది. ఇందులో అల్లాయ్, స్పోక్, స్పోక్ విత్ స్ట్రైప్ పేర్లతో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు వరుసగా రూ.2.75 లక్షలు, రూ.3 లక్షలు, రూ.3.02 లక్షలుగా ఉన్నాయి. లాంచ్ సమయంలో కొన్ని వివరాలనే వెల్లడించిన కంపెనీ.. తాజాగా ఈ బైక్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ప్రకటించింది.

ఇంజిన్, పనితీరు..

Honda CB500లో 501.7cc సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్‌ను ఆయిల్ కూలర్‌తో అందించారు. ఈ ఇంజిన్ 5,250 rpm వద్ద 28.14 PS గరిష్ఠ పవర్‌ను, 3,750 rpm వద్ద 43.3 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 5 స్పీడ్ గేర్‌బాక్స్, అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్‌ను జత చేశారు. తక్కువ RPM వద్దే గరిష్ఠ టార్క్ లభించడంతో రోజువారీ ప్రయాణాల్లో మంచి పుల్లింగ్ పవర్ అందించనుంది. తరచూ గేర్లు మార్చాల్సిన అవసరం కూడా తక్కువగా ఉంటుంది. అయితే హై-స్పీడ్ రైడింగ్, వేగంగా యాక్సిలరేషన్ కోరుకునే వారి కంటే ప్రశాంతమైన ప్రయాణాలను ఇష్టపడేవారికి ఈ బైక్ అనుకూలంగా ఉంటుంది.

సస్పెన్షన్, బ్రేకింగ్ ఫీచర్లు..

ఈ బైక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుకవైపు గ్యాస్ ఛార్జ్డ్ డ్యూయల్ షాక్ అబ్జార్బర్లను అందించారు. ముందు 19 అంగుళాలు, వెనుక 17 అంగుళాల వీల్స్ ఉన్నాయి. వీటికి వరుసగా 100/90, 150/70 టైర్లను అమర్చారు. అల్లాయ్ వీల్స్‌తో పాటు ట్యూబ్‌లెస్ టైర్లతో కూడిన వైర్ స్పోక్ వీల్స్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. రెండు చక్రాలకూ డిస్క్ బ్రేకులు, స్టాండర్డ్‌గా డ్యూయల్ ఛానల్ ABS ఇచ్చారు. ఈ బైక్ బరువు 189 కిలోలు కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 168 మి.మీ. ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 15.2 లీటర్లు. సీటు ఎత్తు 782 మి.మీ.గా నివేదికలు చెబుతున్నప్పటికీ, హోండా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

టెక్నాలజీ ఫీచర్లు..

Honda CB500లో సెమీ డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను అందించారు. స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ కోసం టైప్-C పోర్ట్ కూడా ఉంది. హోండా రోడ్‌సింక్ (Honda RoadSync), బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

రెట్రో డిజైన్, కలర్ ఆప్షన్లు..

ఈ బైక్ సంప్రదాయ రెట్రో డిజైన్‌కు ఆధునిక హంగులను జోడిస్తూ ఆకట్టుకునేలా రూపొందించారు. ఇందులో రౌండ్ హెడ్‌ల్యాంప్, క్రోమ్ మిర్రర్లు, సర్క్యులర్ ఇన్‌స్ట్రుమెంట్ పాడ్, ఆల్-ఎల్ఈడీ లైటింగ్, కర్వీ ఫ్యూయల్ ట్యాంక్, క్విల్టెడ్ సింగిల్ పీస్ సీటు ఉన్నాయి. మెటాలిక్ ఫినిషింగ్‌తో కూడిన ఇంజిన్, ఎగ్జాస్ట్, ఫోర్క్ గైటర్లు, వెడల్పాటి రియర్ ఫెండర్ రెట్రో లుక్‌ను మరింత పెంచుతున్నాయి. ఈ బైక్ నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ రంగులో అల్లాయ్ వీల్స్, వైర్ స్పోక్ వీల్స్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. స్పోక్ వీల్స్ వేరియంట్‌లో ఫ్యూయల్ ట్యాంక్‌పై గోల్డెన్ స్ట్రైప్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ అల్లాయ్ వీల్స్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే వేరియంట్లలో రిమ్స్‌పై వైట్ స్టిక్కర్లు ఉంటాయి. మరింత రెట్రో లుక్ కోరుకునేవారికి రెబెల్ రెడ్ మెటాలిక్, సింపుల్ లుక్ ఇష్టపడేవారికి మ్యాట్ స్టీల్ సిల్వర్ మెటాలిక్ కలర్ ఆప్షన్లు ఉన్నాయి.