Hero XPulse 200 4V & XPulse 200 Pro Launched: హీరో మోటో కార్ప్ తన అడ్వెంచర్ బైక్ పోర్ట్‌ఫోలియోను అంతర్జాతీయ మార్కెట్లో మరింత పెంచుతూ UKలో XPulse 200 4V & XPulse 200 Pro మోటార్‌సైకిళ్లను అధికారికంగా లాంచ్ చేసింది. ఇటలీ, స్పెయిన్ వంటి యూరోపియన్ మార్కెట్లలో ప్రవేశించిన తర్వాత బ్రిటన్‌లో అడుగుపెట్టింది. ఈ కొత్త బైక్స్‌ను ఇంచ్ పర్ఫెక్ట్ ట్రయల్స్ వద్ద ఆవిష్కరించారు. అడవులు, నదీ మార్గాలు, కఠినమైన ఆఫ్‌రోడ్ ట్రాక్‌లతో ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం అడ్వెంచర్ బైక్స్ సామర్థ్యాన్ని ప్రదర్శించేందుకు అనువైన వేదికగా నిలిచింది.
XPulse 200 4V, XPulse 200 Pro రెండూ 199.6cc సింగిల్ సిలిండర్, ఫోర్-వాల్వ్, ఆయిల్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తున్నాయి. ఇవి 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో రానున్నాయి. ఈ ఇంజిన్ 8,500 RPM వద్ద 18.9 BHP పవర్, 6,500 RPM వద్ద 17.35 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. తక్కువ వేగాల్లో మెరుగైన పనితీరు, సుదీర్ఘ టూరింగ్‌కు అనువుగా ఈ ఇంజిన్‌ను తయారు చేసినట్లు హీరో తెలిపింది.
ఈ బైక్స్‌లో రోడ్, ఆఫ్-రోడ్, ర్యాలీ అనే మూడు ABS మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. రోడ్డు పరిస్థితులకు అనుగుణంగా బ్రేకింగ్‌ను నియంత్రించుకునే అవకాశం ఉంటుంది. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్, LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LED DRLs, బాష్ ప్లేట్, హ్యాండ్‌గార్డ్స్, లగేజ్ ప్లేట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. డర్డ్ XPulse 200 4V మోడల్ నగర ప్రయాణాలతో పాటు తేలికపాటి ఆఫ్‌రోడ్ ట్రైల్స్ కోసం రూపొందించారు. దీనికి 825mm సీట్ హైట్, 220mm గ్రౌండ్ క్లియరెన్స్, 190mm సస్పెన్షన్ ట్రావెల్ కలిగిన టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్ ఉన్నాయి. ఈ మోడల్ ధర 2,499 పౌండ్లు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.
ఇక XPulse 200 Pro మోడల్ పూర్తిస్థాయి ఆఫ్‌రోడ్ రైడింగ్‌ను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇందులో అడ్జస్టబుల్ సస్పెన్షన్, 250mm ఫ్రంట్ మరియు 220mm రియర్ సస్పెన్షన్ ట్రావెల్, 270mm గ్రౌండ్ క్లియరెన్స్, హ్యాండిల్‌బార్ రైజర్స్, ప్రత్యేక ఆఫ్‌రోడ్ గేర్ లీవర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ సీట్ హైట్ 891mm కాగా, ధర 2,699 పౌండ్లు (ఎక్స్ షోరూమ్)గా ఉంది. యూకేలో హీరో మోటోకార్ప్ బైక్స్‌ను MotoGB సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న 36 విక్రయ, సేవా కేంద్రాల ద్వారా విక్రయించనుంది. ఈ రెండు బైక్స్‌పైనా కంపెనీ 2 సంవత్సరాల వారంటీ అందిస్తోంది.
