Hero Splendor+ బైక్ ధరలు పెంపు.. అన్ని వేరియంట్లపై భారీగా పెరిగిన రేట్లు.. కొత్త ధరలు ఇవే!

Hero Splendor+

Hero Splendor+

Hero Splendor+ Price Hike: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కమ్యూటర్ బైక్‌లలో హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus) ఒకటి. మూడు దశాబ్దాలకు పైగా ద్విచక్ర వాహనదారుల ఆదరణ పొందుతున్న ఈ బైక్ ధరలను హీరో మోటోకార్ప్ తాజాగా పెంచింది. స్ప్లెండర్ ప్లస్ శ్రేణిలోని అన్ని వేరియంట్లపై ధరల పెంపును ప్రకటించింది. గరిష్ఠంగా ఒక వేరియంట్‌పై రూ.3,086 వరకు ధర పెరిగింది.

హీరో స్ప్లెండర్ ప్లస్ స్టాండర్డ్ మోడల్ డ్రమ్, ఐ3ఎస్ (i3S), స్పెషల్ ఎడిషన్స్, 125 మిలియన్ ఎడిషన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో స్పెషల్ ఎడిషన్స్‌పై అత్యధికంగా రూ.3,086 ధర పెరిగింది. మిగిలిన వేరియంట్ల ధరలు రూ.1,135 చొప్పున పెరిగాయి. హీరో స్ప్లెండర్ ప్లస్ డ్రమ్ వేరియంట్ ధర గతంలో రూ.77,777 ఉండగా.. ప్రస్తుతం రూ.78,912కు పెరిగింది. అంటే రూ.1,135 పెరిగింది. ఇక i3S వేరియంట్ ధర రూ.78,910 నుంచి రూ.80,045కు చేరింది. అలాగే స్పెషల్ ఎడిషన్స్ ధర రూ.78,580 నుంచి రూ.81,666కు పెరిగింది. ఈ వేరియంట్‌పై అత్యధికంగా రూ.3,086 పెంపు విధించారు. ఇక 125 మిలియన్ ఎడిషన్ ధర రూ.80,531 నుంచి రూ.81,666కు చేరగా, దీనిపై రూ.1,135 పెరిగింది.

ఇక గతంలో బ్లాక్, యాక్సెంట్ పేర్లతో అందుబాటులో ఉన్న వేరియంట్లను కంపెనీ ఇప్పుడు స్పెషల్ ఎడిషన్స్‌గా పేరు మార్చింది. వీటిలో మ్యాట్ గ్రే, మ్యాట్ వెర్నియర్ గ్రే, క్యాండీ బ్లేజింగ్ రెడ్ అనే మూడు కొత్త కలర్ ఆప్షన్లను అందిస్తోంది. స్టాండర్డ్ మోడల్‌లోని నాలుగు వేరియంట్లకు ముందు, వెనుక రెండు వైపులా డ్రమ్ బ్రేకులనే ఇచ్చారు. హీరో స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ (XTEC) మోడల్‌లో మాత్రమే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఇందులో అనలాగ్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా డిజిటల్ డిస్‌ప్లేపై రియల్ టైమ్ మైలేజీ వివరాలను కూడా చూడవచ్చు. ఈ మోడల్ డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధర రూ.82,418 కాగా, డిస్క్ బ్రేక్ వేరియంట్ ధర రూ.85,461గా ఉంది.

ఈ శ్రేణిలో టాప్-ఎండ్ మోడల్ అయిన స్ప్లెండర్ ప్లస్ ఎక్స్‌టెక్ 2.0లో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, హజార్డ్ లైట్లు వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. అయితే ఈ మోడల్ కేవలం ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. దీని కొత్త ధరను కంపెనీ రూ.84,549గా నిర్ణయించింది. మరోవైపు హీరో స్ప్లెండర్ ప్లస్ ఫ్లెక్స్ (Flex) మోడల్ ధరను కూడా కంపెనీ పెంచింది. గతంలో రూ.82,710గా ఉన్న ఈ బైక్ ధర ప్రస్తుతం రూ.84,042కు చేరింది. అంటే రూ.1,332 పెరిగింది. ఇటీవల హీరో మోటోకార్ప్ సీఈఓ హర్షవర్ధన్ చితాలే స్ప్లెండర్ ప్లస్, హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ మోడళ్లకు సంబంధించి 15,000 యూనిట్ల డిస్పాచ్‌లను ప్రకటించారు. ఈ ఫ్లెక్స్ మోడల్ E85 ఇంధనంపై 8.6hp పవర్, 8.3Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. E20 వెర్షన్‌తో పోలిస్తే ఇది 7 శాతం అధిక పవర్, 3 శాతం అధిక టార్క్‌ను అందిస్తుంది. అయితే హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఫ్లెక్స్ ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ బైక్ ఇప్పటికీ రూ.72,792 ప్రారంభ ధరతోనే అందుబాటులో ఉంది.