NTV Telugu Site icon

Fifa World Cup: జర్నలిస్ట్‌కి చేదు అనుభవం.. లైవ్‌లోనే దోచుకున్న దొంగ

Reporter Robbed

Reporter Robbed

FIFA World Cup Reporter Robbed While On Air: ఫిఫా వరల్డ్‌కప్‌లో ఒక మహిళా జర్నలిస్ట్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆమె లైవ్ రిపోర్టింగ్ చెప్తుండగానే.. ఒక దొంగ చాకచక్యంగా ఆమెను దోచేసుకున్నాడు. తన హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న విలువైన డాక్యుమెంట్లతో పాటు నగదు తీసుకొని ఆ దొంగ ఉడాయించాడు. ఖతార్‌, ఈక్వెడార్‌ మధ్య తొలి మ్యాచ్‌ సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. డొమినిక్ మెట్జెర్ అనే యువతి టోడో నోటియాస్‌ అనే టెలివిజన్‌ చానెల్‌లో రిపోర్టర్‌గా పని చేస్తోంది. ఛానెల్ కోసం ఫిఫా వరల్డ్‌కప్‌లో లైవ్ కవరేజ్ ఇవ్వడానికి ఖతార్‌కు వెళ్లింది. ఈక్వెడార్‌, ఖతార్‌లో మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను ఆమె లైవ్ కవరేజ్ చేస్తుండగా.. ఆ దొంగ చడీచప్పుడు కాకుండా తన చేతివాటం ప్రదర్శించాడు. స్టేడియం మొత్తం జనాలతో నిండిపోవడం, అరుపుల-గోల మధ్య.. ఈ దొంగతనాన్ని ఆ రిపోర్టర్ గమనించలేకపోయింది.

అయితే.. దాహం వేయడంతో వాటర్ తాగాలని, మెట్జెర్ తన హ్యాండ్‌బాగ్ తెరిచి చూసింది. అంతే.. దెబ్బకు ఆమె దిమ్మతిరిగింది. కొన్ని పత్రాలు, నగదు లేకపోవడాన్ని చూసి, షాక్‌కి గురైంది. ఆ తర్వాత తేరుకున్నాక తన పర్స్‌ని ఎవరో దొంగలించారని గుర్తించి, పోలీసుల్ని ఆశ్రయించింది. అయితే.. అక్కడ కూడా ఆమెకు మరో ఊహించని షాక్ తగిలింది. ఈ దోపిడీ గురించి ఆ రిపోర్టర్ ఫిర్యాదు చేయగా.. తాము ప్రతీ చోటా హై-టెక్ కెమెరాలను అమర్చామని, ఫేస్ డిటెక్షన్ ద్వారా అతడ్ని తప్పకుండా పట్టుకుంటామని పోలీసులు అన్నారు. అయితే.. అతడ్ని పట్టుకున్న తర్వాత ఎలాంటి శిక్ష విధించాలని అనుకుంటున్నారు? ఐదేళ్ల జైలు శిక్ష విధించాలా? లేక తిరిగి అతని స్వదేశానికి పంపించేయాలా? అని చెప్పగానే.. ఆ రిపోర్టర్ ఖంగుతింది. కాగా.. ఈ మెగ ఈవెంట్‌లో మరో జర్నలిస్ట్ కూడా చేదు అనుభవాన్ని ఎదుర్కున్నాడు. డానిష్ అనే జర్నలిస్ట్ తన ఛానల్ కోసం వీడియో చిత్రీకరిస్తున్నప్పుడు.. దాన్ని ఆపివేయాల్సిందిగా ఆదేశాలిచ్చారు. అనంతరం ఈ ఘటనపై టోర్నమెంట్ నిర్వాహకులు క్షమాపణలు చెప్పారు.