Ducati Monster V2: ప్రీమియం మోటార్‌సైకిల్ తయారీ సంస్థ డుకాటీ (Ducati) భారత మార్కెట్లో కొత్త 2026 డుకాటీ మాన్స్టర్ V2 (Ducati Monster V2), మాన్స్టర్+ (Monster+) మోడళ్లను లాంచ్ చేసింది. కొత్త తరం మోడళ్లలో పూర్తిగా రీ-ఇంజినీర్ చేసిన 890cc V-Twin ఇంజిన్, తేలికైన చాసిస్, అప్‌డేటెడ్ డిజైన్, అధునాతన రైడర్-అసిస్ట్ ఫీచర్లను అందించారు.
V-Twin ఇంజిన్:
మాన్స్టర్ V2లో 890cc V-Twin ఇంజిన్ ను అందించారు. ఇదివరకు మోడల్ లోని 937cc ఇంజిన్‌తో పోలిస్తే ఇంజిన్ కెపాసిటీ తగ్గినప్పటికీ పనితీరులో మాత్రం ఎలాంటి రాజీ పడలేదని కంపెనీ పేర్కొంది. ఈ ఇంజిన్ 9,000 rpm వద్ద 111 hp పవర్, 7,250 rpm వద్ద 91.1 Nm గరిష్ఠ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇన్టేక్ వేరియబుల్ టైమింగ్ (IVT) టెక్నాలజీ కారణంగా 4,000 నుంచి 9,000 rpm మధ్య మొత్తం టార్క్‌లో 80% వరకు లభిస్తుంది. దీంతో వివిధ రైడింగ్ పరిస్థితుల్లో మెరుగైన యాక్సిలరేషన్ అందుతుంది.
ప్రత్యేకమైన డిజైన్:
మాన్స్టర్ V2లో అల్యూమినియం మోనోకోక్ చాసిస్ ను ఉపయోగించారు. దీని కారణంగా బైక్ బరువులో సుమారు 5 కిలోలు తగ్గింది. తక్కువ బరువు కారణంగా బైక్ మరింత చురుగ్గా, వేగంగా స్పందించేలా ఉంటుందని కంపెనీ చెబుతోంది. మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్ ద్వారా మాన్స్టర్ సిరీస్‌కు ప్రత్యేకమైన డిజైన్‌ను కొనసాగించారు. స్టాండర్డ్ సీట్ హైట్ 815mmగా ఉంటుంది. యాక్సెసరీ సీట్ల ద్వారా దీనిని 795mm లేదా 775mm వరకు తగ్గించుకోవచ్చు. ఇక సస్పెన్షన్ విషయానికి.. వస్తే ముందు భాగంలో 43mm Showa USD ఫోర్క్, వెనుక భాగంలో మోనోషాక్‌ను అందించారు. ఇవి రోజువారీ రైడింగ్‌తో పాటు స్పోర్టీ రైడింగ్‌కు అనుగుణంగా ట్యూన్ చేశారు.
Monster, Monster+ వేరియంట్లు:
డుకాటీ మాన్స్టర్ సిరీస్ లో మాన్స్టర్ V2, మాన్స్టర్+ అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. రెండు మోడళ్లలోనూ ప్రధాన మెకానికల్ ఫీచర్లు ఒకే విధంగా ఉంటాయి. అయితే మాన్స్టర్+లో అదనంగా హెడ్‌లైట్ కౌల్, పిలియన్ సీట్ కవర్ వంటి డిజైన్ ఎలిమెంట్లు ఉంటాయి. ఈ బైక్‌లు డుకాటీ రెడ్, ఐస్ బర్గ్ వైట్, స్పోర్ట్ లివరీ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి. వేరియంట్, కలర్‌ను బట్టి ధర రూ.13.99 లక్షల నుంచి రూ.14.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
అధునాతన టెక్నాలజీ:
కొత్త మాన్స్టర్ V2లో రైడర్ భద్రత, నియంత్రణ కోసం పలు ఎలక్ట్రానిక్ ఫీచర్లను అందించారు. ఇందులో రైడ్ మోడ్స్, పవర్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్, కార్నరింగ్ ABS ఉన్నాయి. కాక్‌పిట్‌లో 5 అంగుళాల TFT డిస్‌ప్లే ఉంటుంది. దీనికి తోడు ఫుల్ LED లైటింగ్, బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్, డైనమిక్ సెల్ఫ్-క్యాన్సిలింగ్ ఇండికేటర్లు అందించారు. అదనపు ఖర్చుతో TPMS, క్రూయిజ్ కంట్రోల్, హీటెడ్ గ్రిప్స్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి యాక్సెసరీలను కూడా ఎంచుకోవచ్చు.
మెరుగైన మెయింటెనెన్స్:
మాన్స్టర్ V2ను రోజువారీ వినియోగానికి మరింత అనుకూలంగా మార్చేందుకు మెయింటెనెన్స్ ఇంటర్వల్స్‌ను కూడా పెంచారు. వాల్వ్ క్లియరెన్స్ చెక్ 45,000 కిలోమీటర్లకు ఒకసారి చేయాల్సి ఉంటుంది. సాధారణ సర్వీసింగ్‌ను ఏడాదికి ఒకసారి లేదా ప్రతి 15,000 కి.మీ.కు చేయాలి. అంతేకాకుండా బైక్‌కు 2 సంవత్సరాల అన్‌లిమిటెడ్-మైలేజ్ వారంటీ అందిస్తున్నారు. దీనితోపాటు ప్రొటెక్ట్ పీరియాడిక్ మైంటెనెన్సు కాంట్రాక్ట్స్ ద్వారా మెయింటెనెన్స్ ప్యాకేజీలను కూడా పొందవచ్చు.

