BMW F 450 GS Sport: ప్రముఖ లగ్జరీ బైక్ తయారీ సంస్థ BMW Motorrad భారత మార్కెట్లో మరో కొత్త బైక్ వేరియంట్‌ను విడుదల చేసింది. తన అడ్వెంచర్ టూరర్ F 450 GS లైనప్‌లో కొత్తగా “F 450 GS స్పోర్ట్” వేరియంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ధరను రూ.5.90 లక్షలుగా నిర్ణయించింది. ఇప్పటికే ఉన్న ఎక్సక్లూసివ్ వేరియంట్ కంటే రూ.35 వేలు ఎక్కువగా, టాప్ వేరియంట్ GS ట్రోఫీ కంటే రూ.25 వేలు తక్కువ ధరతో దీనిని తీసుకొచ్చింది.
BMW F 450 GS స్పోర్ట్ ప్రత్యేకంగా “రేసింగ్ రెడ్” కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో డార్క్ రెడ్, బ్లాక్ రంగులతో పాటు వైట్, గ్రే కలర్ గ్రాఫిక్స్ ఆకట్టుకుంటాయి. ఫ్రంట్ కౌల్, ఫ్యూయల్ ట్యాంక్, రియర్ సైడ్ ప్యానెల్స్‌పై రెడ్ కలర్ ఎక్కువగా కనిపిస్తుంది. మిగతా భాగాలకు బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. దీంతో బైక్‌కు స్పోర్టీ లుక్ లభించింది. ఈ కొత్త Sport వేరియంట్ దాదాపుగా టాప్ స్పెక్ GS ట్రోఫీ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో ఈజీ రైడ్ క్లచ్ (ERC) ఫీచర్‌ను అందించలేదు. ఈ ప్రత్యేక ఫీచర్ కేవలం GS ట్రోఫీ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుంది. మిగతా కీలక ఫీచర్లన్నీ ‘స్పోర్ట్’ వేరియంట్‌లోనూ అందించారు.
ఇందులో అడ్జస్టబుల్ స్పోర్ట్స్ సస్పెన్షన్, గేర్ షిఫ్ట్ అసిస్టెంట్ ప్రో, ఆఫ్‌రోడ్ ఫుట్‌రెస్ట్స్, క్లియర్ విండ్‌షీల్డ్, హ్యాండ్ ప్రొటెక్షన్ వంటి సదుపాయాలు ఉన్నాయి. “రైడింగ్ మోడ్స్ ప్రో” తో పాటు “ఎండ్యూరో ప్రో” మోడ్‌ను కూడా అందించారు. ఇందులో 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది 48 hp పవర్, 43 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో ఈ ఇంజిన్ పనిచేస్తుంది. రైన్, రోడ్, ఎండ్యూరో రైడింగ్ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. స్టీల్ ట్యూబ్ ఫ్రేమ్, 43mm USD ఫ్రంట్ ఫోర్కులు, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ముందు, వెనుక డిస్క్ బ్రేకులతో పాటు ABS ప్రో సిస్టమ్‌ను అందించారు.
ఫీచర్ల విషయానికి వస్తే.. రైడ్ బై వైర్, యాంటీ హాపింగ్ క్లచ్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (DTC), డైనమిక్ ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ (MSR) వంటి టెక్నాలజీలు ఉన్నాయి. 6.5 ఇంచుల కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే, హీటెడ్ గ్రిప్స్, టైప్-C USB పోర్ట్, బ్లూటూత్ కనెక్టివిటీ అందించారు. వీటితో పాటు అడ్జస్టబుల్ క్లచ్, హ్యాండ్ బ్రేక్ లివర్లు, అడ్జస్టబుల్ ఫుట్ బ్రేక్ లివర్ వంటి సదుపాయాలు ఉన్నాయి. కొత్త BMW F 450 GS స్పోర్ట్ వేరియంట్‌తో అడ్వెంచర్ బైక్ కొనుగోలుదారులకు మరో ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ERC ఫీచర్ అవసరం లేకుండా మిగతా ప్రీమియం ఫీచర్లను కోరుకునే వారికి ఈ వేరియంట్ అందుబాటులో ఉంటుంది.

