Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్‌కు రంగం సిద్ధం

  • అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ
  • స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు
  • అమెరికాలో పలు నగరాల్లో ఉచిత ట్రయల్ రైడ్‌లను నిర్వహిస్తున్న Zoox
Amazon Zoox

Amazon Zoox

అటానమస్ వాహనాల రంగంలో కీలక అడుగులు వేస్తున్న అమెజాన్‌కు చెందిన Zoox సంస్థ తన కొత్త తరం రోబోట్యాక్సీ డిజైన్‌ను అధికారికంగా ఆవిష్కరించింది. త్వరలోనే చెల్లింపు (Paid) రైడ్ సేవలను ప్రారంభించే లక్ష్యంతో కంపెనీ ఈ కొత్త మోడల్‌ను రూపొందించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని వాహనం లోపలి, బయటి డిజైన్‌లో పలు మార్పులు చేసింది. ప్రస్తుతం అమెరికాలో పలు నగరాల్లో ఉచిత ట్రయల్ రైడ్‌లను నిర్వహిస్తున్న Zoox, అవసరమైన ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే కమర్షియల్ సేవలను ప్రారంభించనుంది.

స్టీరింగ్, పెడల్స్ లేని రోబోట్యాక్సీ

Zoox రోబోట్యాక్సీ ప్రత్యేకత ఏమిటంటే ఇందులో సంప్రదాయ కార్ల మాదిరిగా స్టీరింగ్ వీల్, బ్రేక్ లేదా యాక్సిలేటర్ పెడల్స్ ఉండవు. ఇది పూర్తిగా కృత్రిమ మేధస్సు (AI), కెమెరాలు, రాడార్, లిడార్ సెన్సార్ల ఆధారంగా నడుస్తుంది. వాహనం ముందు, వెనుక భాగాలు ఒకే విధంగా ఉండటంతో రెండు దిశల్లోనూ సమర్థంగా ప్రయాణిస్తుంది. ఒకేసారి నలుగురు ప్రయాణికులు ఎదురెదురుగా కూర్చునేలా క్యాబిన్‌ను రూపొందించారు.

ప్రయాణికుల సౌకర్యానికి కొత్త మార్పులు

కొత్త వెర్షన్‌లో ప్రయాణికుల సౌకర్యంపై ప్రత్యేక దృష్టి పెట్టింది Zoox. సీట్లకు మరింత కుషనింగ్, మెరుగైన ఎర్గోనామిక్ డిజైన్, కొత్త రంగుల ఇంటీరియర్‌ను అందించింది. టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను మరింత స్పష్టంగా మార్చడంతో పాటు పెద్ద కప్‌హోల్డర్లు, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌లో ఇంప్రూవ్ మెంట్స్ చేసింది. ప్రయాణికులు మర్చిపోయిన వస్తువులు సులభంగా గుర్తించేలా లోపలి భాగాన్ని లైట్ కలర్స్ తో రూపొందించారు.

బయటి డిజైన్‌లో కూడా మార్పులు

రోబోట్యాక్సీ వెలుపలి భాగంలో కూడా పలు మార్పులు చేశారు. వాహనం ముందు, వెనుక భాగాలను సులభంగా గుర్తించేందుకు కొత్త లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. అలాగే డోర్ల వద్ద స్పీకర్లు, మైక్రోఫోన్లను అమర్చి రెండు దిశల్లో కమ్యూనికేషన్ సదుపాయాన్ని కల్పించారు. దీంతో ప్రయాణికులు, అత్యవసర సిబ్బంది, Zoox సపోర్ట్ టీమ్ మధ్య నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది.

భారీ ఉత్పత్తికి సిద్ధం

కాలిఫోర్నియాలోని హేవర్డ్ తయారీ కేంద్రంలో ఈ కొత్త రోబోట్యాక్సీలను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని Zoox ప్రణాళిక రూపొందించింది. ప్రారంభ దశలో వారానికి 100 వాహనాల వరకు తయారు చేసే సామర్థ్యాన్ని ఏర్పాటుచేసింది. భవిష్యత్తులో ఏడాదికి 10 వేలకుపైగా రోబోట్యాక్సీలను ఉత్పత్తి చేసే లక్ష్యంతో కంపెనీ ముందుకెళ్తోంది.

ప్రభుత్వ అనుమతి తర్వాతే చెల్లింపు సేవలు

ప్రస్తుతం Zoox రోబోట్యాక్సీలు శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ వెగాస్, ఆస్టిన్, మియామి నగరాల్లో ఉచిత ట్రయల్ రైడ్‌లను అందిస్తున్నాయి. అయితే ప్రయాణికుల నుంచి డబ్బు వసూలు చేయాలంటే అమెరికా జాతీయ రహదారి భద్రతా సంస్థ (NHTSA) నుంచి ప్రత్యేక అనుమతి అవసరం. ఆ అనుమతి లభించిన వెంటనే కమర్షియల్ రైడ్ సేవలను ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

రోబోట్యాక్సీ రంగంలో పోటీ పెరుగుతోంది

ప్రపంచవ్యాప్తంగా అటానమస్ ట్యాక్సీ సేవల రంగంలో పోటీ వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే గూగుల్‌కు చెందిన Waymo కొన్ని నగరాల్లో వాణిజ్య సేవలను అందిస్తుండగా, Tesla కూడా తన Robotaxi సేవలను విస్తరించే ప్రయత్నాల్లో ఉంది. ఈ నేపథ్యంలో Zoox కొత్త డిజైన్, భారీ ఉత్పత్తి ప్రణాళికతో ఈ పోటీలో కీలక స్థానాన్ని సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.