649cc ఇంజిన్‌, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!

Kawasaki Vulcan S

Kawasaki Vulcan S

2027 Kawasaki Vulcan S Launched: కవాసకి నుండి ప్రీమియం క్రూయిజర్ బైక్ 2027 వుల్కాన్ ఎస్ (Kawasaki Vulcan S) మోడల్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్ లో పెద్దగా డిజైన్ మార్పులు చేయకపోయినా.. మూడు ముఖ్యమైన అప్‌డేట్స్ అందించింది. మరి ఆ విశేషాలేంటో చూసేద్దామా..

649cc ఇంజిన్‌

ఈ కొత్త వేరియంట్లో 649cc, లిక్విడ్-కూల్డ్, ప్యారలల్-ట్విన్ ఇంజిన్ ఉంది. ఈ ఇంజిన్ ఇప్పుడు 6,600rpm వద్ద 62.4Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 2026 మోడల్‌లో ఇది 61Nmగా ఉండేది. అంటే 1.4Nm టార్క్ పెరిగింది. అయితే గరిష్ఠ పవర్ 60bhp వద్ద 7,500rpmకు మార్పులేదు. ఆరు-స్పీడ్ గేర్‌బాక్స్ కూడా యథాతథంగా కొనసాగుతోంది.

బ్రేకింగ్ సిస్టమ్‌

బ్రేకింగ్ సిస్టమ్‌లో మాత్రం మార్పులు చోటుచేసుకున్నాయి. ముందు డిస్క్ పరిమాణం 300mm నుంచి 272mmకు, వెనుక డిస్క్ 250mm నుంచి 216mmకు తగ్గింది. డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ మాత్రమే ఇందులో అందించే ఎలక్ట్రానిక్ రైడర్ ఎయిడ్‌గా కొనసాగుతోంది.

సస్పెన్షన్

సస్పెన్షన్ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. ముందు భాగంలో 41mm ఫోర్క్ 130mm ట్రావెల్‌తో, వెనుక భాగంలో లింకేజ్-ఎక్విప్డ్ మోనోషాక్ 80mm ట్రావెల్‌తో, అడ్జస్టబుల్ ప్రీలోడ్‌తో లభిస్తుంది. బైక్ సీట్ హైట్ 705mm, గ్రౌండ్ క్లియరెన్స్ 130mm, కర్బ్ వెయిట్ 235kgగా ఉన్నాయి. తక్కువ సీట్ హైట్ కారణంగా ఈ క్రూయిజర్‌ను విభిన్న ఎత్తులున్న రైడర్లు సులభంగా నడిపే అవకాశం ఉంది. అయితే తక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కారణంగా స్పీడ్ బ్రేకర్లు, గుంతల వద్ద జాగ్రత్త అవసరం.

కొత్త కలర్‌

2027 మోడల్‌లో కొత్త పెయింట్ ఫినిష్ కూడా అందించారు. 2026 మోడల్‌లోని మెటాలిక్ ఫ్లాట్ స్పార్క్ బ్లాక్ స్థానంలో మెటాలిక్ కార్బన్ గ్రే/మెటాలిక్ బ్లూయిష్ గ్రీన్ కలర్‌ను తీసుకొచ్చారు. ఇందులో స్వల్ప గ్రీన్ హైలైట్స్ ఉండటం వల్ల బైక్‌కు కొత్త లుక్ లభిస్తుంది.

ఫీచర్లు

ఇక ఫీచర్ల విషయానికి వస్తే.. అనలాగ్-స్టైల్ టాకోమీటర్, అడ్జస్టబుల్ ఫుట్‌పెగ్స్, 14-లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కొనసాగుతున్నాయి. 1,575mm వీల్‌బేస్‌తో పాటు 18-అంగుళాల ఫ్రంట్, 17-అంగుళాల రియర్ వీల్స్ కూడా అలాగే ఉన్నాయి. కవాసకి ఈ బైక్‌ను భారత్‌లో సింగిల్ స్టాండర్డ్ వేరియంట్‌లో అందిస్తోంది.

ధర..

ఈ కొత్త మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ.8.23 లక్షలుగా ఉంది. 2026 మోడల్‌తో పోలిస్తే ధర రూ.10,000 పెరిగింది. సెప్టెంబర్ 2026 మధ్య నుంచి ఈ బైక్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.