2026 Mahindra Scorpio-N: మహీంద్రా (Mahindra) తన ప్రముఖ SUV 2026 మహీంద్రా స్కార్పియో-ఎన్ ను భారత మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది. ఈ 2026 వెర్షన్‌లో కొత్త 540-డిగ్రీ కెమెరా సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, అప్‌డేటెడ్ క్యాబిన్, పెద్ద టచ్‌స్క్రీన్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి పలు కొత్త ఫీచర్లను అందించింది. అయితే ఇంజిన్ ఎంపికల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.
ఎక్స్‌టీరియర్‌లో మార్పులు:
2026 Scorpio-N డిజైన్‌లో పెద్దగా మార్పులు చేయలేదు. SUVకు ఉన్న బలమైన, మస్క్యులర్ లుక్‌ను యథాతథంగా కొనసాగించింది. అయితే Z8T వంటి కొన్ని వేరియంట్లలో కొత్త డిజైన్ 18 అంగుళాల అలాయ్ వీల్స్ ను అందించింది. దీంతో SUV మరింత ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకుంది.
ఇంటీరియర్‌లో మార్పులు:
ఇంటీరియర్‌లో మాత్రం పలు మార్పులు చేశారు. కొత్తగా డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్, ఫ్రీ-స్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రీడిజైన్ చేసిన AC వెంట్స్‌ను అందించారు. హయ్యర్ వేరియంట్లలో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ను కూడా జోడించారు. సీటింగ్ లేఅవుట్, స్విచ్‌గేర్ మాత్రం గత మోడల్ మాదిరిగానే ఉన్నాయి.
540-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్:
ఫీచర్ల పరంగా 2026 Scorpio-Nలో పలు కీలక అప్‌డేట్లు ఉన్నాయి. Z8S వేరియంట్ నుంచి 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్, 10.2 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ముందు-వెనుక ప్రయాణికుల కోసం 65W Type-C ఫాస్ట్ ఛార్జింగ్ పోర్టులు, UV & IR కట్ గ్లాస్ లభిస్తాయి. Z8L టాప్ వేరియంట్లో అత్యంత ప్రత్యేకమైన 540-డిగ్రీ కెమెరా సిస్టమ్ ను అందించారు. ఇది ముందు, వెనుక కెమెరాలతో పాటు వాహనం చుట్టూ పూర్తి వీక్షణను అందించి, ఇరుకైన రోడ్లు, పార్కింగ్ ప్రదేశాలు, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ సమయంలో మరింత సౌకర్యాన్ని కల్పిస్తుంది. ఇదే వేరియంట్‌లో పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇంజిన్:
2026 మహీంద్రా స్కార్పియో-Nలో ఇంజిన్ ఆప్షన్లను యథాతథంగా కొనసాగించారు. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ (రెండు పవర్ ట్యూన్‌లలో) ఉన్నాయి. ఈ రెండు ఇంజిన్లకు 6-స్పీడ్ మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. దీంతో నగర వినియోగంతో పాటు ఆఫ్-రోడ్ డ్రైవింగ్‌కూ ఈ SUV అనువుగా ఉంటుంది.

