అన్నమయ్య జిల్లా సంబేపల్లి మండలం శెట్టిపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ మాజీ జెడ్పీటీసీ నేత గొర్ల ఉపేంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో గ్రామంలో కలకలం రేగింది. ఆయనను అక్రమంగా అరెస్టు చేస్తున్నారంటూ గ్రామస్థులు, మహిళలు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఉపేంద్ర రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో గ్రామస్థులు, మహిళలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. నిరసన వ్యక్తం చేసే క్రమంలో ఓ మహిళ ఏకంగా పోలీసు వాహనం పైకెక్కి ఆందోళన చేపట్టింది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో ఎందుకు అరెస్టు చేస్తున్నారంటూ ఆందోళనకారులు పోలీసులను నిలదీశారు.
మహిళా కానిస్టేబుళ్ల సహాయంతో తరలింపు
గ్రామంలో ఉద్రిక్తత పెరుగుతున్న క్రమంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. చివరకు మహిళా కానిస్టేబుళ్ల సహాయంతో ఆందోళనకారులను పక్కకు జరిపిన పోలీసులు, ఉపేంద్ర రెడ్డిని అక్కడి నుంచి తరలించారు. ఎన్నికలు సజావుగా జరగడం లేదని, వైసీపీ సానుభూతిపరులను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.

