MP Avinash Reddy: కడప జిల్లాలో మిలాద్ ఉన్ బీ సందర్బంగా బార్మి కార్యక్రమంలో ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ కడప ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారు.. వైఎస్ఆర్ చేసిన గొప్ప సంస్కరణలను, జగన్ తెచ్చిన పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు అని ఆరోపించారు. ఆరోగ్య శ్రీని పూర్తిగా ఎత్తేసారు.. బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో నెట్ వర్క్ ఆస్పత్రులు ఆందోళన బాట పట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. మెరుగైన విద్య కోసమే విద్యా దీవెన, వసతి దీవెన పథకాన్ని అమలు చేస్తే దాన్ని కూడా ఎత్తివేశారు. ఇప్పుడు, డబ్బులు చెల్లించి సర్టిఫికెట్స్ తీసుకోవాల్సి వచ్చిందని ఆయన తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేశారు అని ఎంపీ అవినాష్ రెడ్డి వెల్లడించారు.
Read Also: AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. పలు బిల్లులకు ఆమోదం..
ఇక, జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు, వాటిలో ఆరు కాలేజీలను కూడా ప్రారంభించారు.. మరో పదకొండు నిర్మాణ దశలో ఉన్నాయని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తెలిపారు. వాటిని కూడా కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుంది.. ఇదేనా పాలనా వ్యవస్థ.. ఇక, పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు వస్తే వద్దని వెనక్కి పంపించారు.. ఏం దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి పట్టిందోనన్నారు. ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళితే పేదల పిల్లలు వైద్య విద్య అభ్యసించాలంటే కష్టంగా మారుతుందున్నారు. సేవల విషయంలో సచివాలయ వ్యవస్థ పని చేసేది.. యూరియా కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి సరఫరా అయ్యేది.. మళ్ళీ పాత రోజులు వచ్చాయి.. రైతులు ఎరువులు, విత్తనాల కోసం గంటల తరబడి క్యూలో నిల్చునే పరిస్థితి వచ్చిందన్నారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, రైతు భరోసా, విద్యాదీవెన లాంటి పథకాలు ఏవి అమలు కావడం లేదన్నారు. చంద్రబాబుకు పరిపాలన చేయడం చేతకాదనేది స్పష్టంగా కనిపిస్తుంది.. ప్రజలు బాధ పడే పరిస్థితి ఏర్పడిందని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Rahul Gandhi: ఓట్ చోరీపై హైడ్రోజన్ బాంబు పేలుస్తా.. నేటి రాహుల్ గాంధీ ప్రెస్మీట్పై ఉత్కంఠ
అయితే, కూటమి ప్రభుత్వం పద్ధతులు మార్చుకోవాలి అని ఎంపీ అవినాష్ రెడ్డి సూచించారు. జగన్ హయాంలో ఉల్లికి ఎంఎఫ్సీ కింద 4 వేలు ఇచ్చేవాళ్ళు.. ఈ ప్రభుత్వం ఉల్లిని ఎందుకు కొనుగోలు చెయ్యడం లేదు అని ప్రశ్నించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి.. పరిపాలన గాడి తప్పింది.. శాంతి భద్రతలు ఎక్కడ కాపాడుతున్నారు.. జరుగుతున్న పరిస్థితులు చూస్తే అర్ధమవుతుంది.. ఎస్పీ, డీఎస్పీ చేతుల్లో ఏమి లేదు పెత్తనం మొత్తం ఎమ్మెల్యేలదే అని ఆరోపించారు. రాష్ట్రంలోని కూటమి ఎమ్మెల్యేలు రాజుల్లా ఫీల్ అవుతూ ప్రభుత్వ రంగ వ్యవస్థలను నడిపిస్తున్నారు.. ఇప్పటికైనా తమ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరించారు.
