NTV Telugu Site icon

రాష్ట్రప‌తి, ప్ర‌ధానికి వైసీపీ ఎంపీల లేఖ‌.. ఎంపీ ర‌ఘురామ కంపెనీల‌పై ఫిర్యాదు..

Raghu Rama

వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుపై ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలుగా లోక్‌స‌భ స్పీక‌ర్‌కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు.. ఇక‌, లోక్‌స‌భ స్పీక‌ర్ కార్యాల‌యం నుంచి ఆయ‌న‌కు నోటీసులు కూడా వెళ్లాయి.. అంత‌టితో ఆగ‌కుండా.. ఇప్పుడు.. రఘురామకు చెందిన‌ కంపెనీపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాసారు వైసీపీ ఎంపీలు.. ఇందు భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు.. ఇందు భారత్ కంపెనీ రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిందని లేఖ‌లో పేర్కొన్న ఎంపీలు.. తక్షణమే ఇందు భారత్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞ‌ప్తి చేశారు.. అంతేకాకుండా.. కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలన్నారు. మోసం చేసిన మొత్తాన్ని డైరెక్టర్ల నుంచి వసూలు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.

ఇందు భారత్ కంపెనీ వేల కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టింద‌ని.. ఈ కేసులో సిబిఐ దర్యాప్తు సరిగా జరగడం లేద‌ని రాష్ట్రప‌తి, ప్ర‌ధాని దృష్టికి తీసుకెళ్లిన ఎంపీలు.. దీనివల్ల ప్రజలకు సంస్థల పైన నమ్మకం పోయే ప్రమాదం ఉంద‌న్నారు.. తక్షణమే “ఇందు భారత్”కంపెనీలపై చర్యలు తీసుకోవాల‌ని.. కేంద్ర ప్రభుత్వ సంస్థలు పిఎఫ్ సి, ఆర్ ఈసి, ఐఐఎఫ్ సిఎల్ నుంచి వేల కోట్ల రూపాయలు పొందార‌ని.. 941.71 కోట్ల రూపాయల ప్రజాధనం స్వాహా చేశార‌ని వారి దృష్టికి తీసుకెళ్లారు.. విద్యుత్ కంపెనీ పేరుతో లోన్లు తీసుకొని నిధులను పక్కదారి పట్టించారు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 63.46 కోట్ల రూపాయలు కొల్లగొట్టారు… పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను తీవ్రంగా మోసం చేశారు. ఇందు భారత్ పవర్ లిమిటెడ్, ఇందు భారత పవర్ ఇన్ఫ్రా లిమిటెడ్ , ఆర్కయి ఎనర్జీ లిమిటెడ్.. డైరెక్టర్ల పై దర్యాప్తు జ‌రిపి చర్యలు తీసుకోవాల‌ని కోరారు. ఇక‌, ఈ కంపెనీ డైరెక్టర్ల విదేశీ ప్రయాణాలపై నిషేధం విధించాలి.. వీరు మరో విజయ్ మాల్యాగా మారే అవకాశం ఉంద‌ని పేర్కొన్నారు.