తమ స్థలంలో లంకె బిందెలు ఉన్నాయని.. పురావస్తుశాఖ ద్వారా తవ్వించాలంటూ ఓ మహిళ సాక్షాత్తు గ్రీవెన్స్ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్‌ను కోరిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళ్తే.. పల్నాడు జిల్లా కారంపూడికి చెందిన దిల్షాద్ బేగం అనే ముస్లిం మహిళ తన పూర్వీకుల స్థలం కారంపూడిలోని కన్యకాపరమేశ్వరి ఆలయం పక్కన గల బజారులో ఉందని.. సదరు స్థలంలో లంకెబిందెలు ఉన్నట్లు తనకు తెలిసిందని స్వయంగా పల్నాడు జిల్లా కలెక్టర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
Tirumala: తిరుమల శ్రీవారికి రూ.7 కోట్ల విరాళం.. టీటీడీ చరిత్రలో ఇదే అత్యధికం
అయితే కారంపూడి తన స్వగ్రామం అని.. అత్తగారిది గుంటూరు అని ఆ స్థలం తన పూర్వీకులకు చెందిందని మహిళ సదరు లేఖలో వివరించింది. ప్రభుత్వం చొరవ చూపి తవ్వకాలు జరిపితే లంకెబిందెలు దొరికే అవకాశం ఉందని ఆమె లేఖలో పేర్కొంది. ఈ అంశంపై విచారణ జరపాలని కారంపూడి తహసీల్దార్ జె. ప్రసాదరావును పల్నాడు జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఫోన్ ద్వారా కారంపూడి తహసీల్దార్ జె.ప్రసాదరావును వివరణ కోరగా దిల్షాద్ బేగం అనే మహిళ గ్రీవెన్స్ లో పల్నాడు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమని.. దీనిపై విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ నుంచి తమకు ఆదేశాలు అందినట్లు తహసీల్దార్ తెలిపారు.